పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఆగస్టు 2012, బుధవారం

గరిమెళ్ల నాగేశ్వరరావు ||వీడ్కోలు ||



సముద్రాన్ని గుండెల్లోకి

ఒంపుకున్నాను

పెదాలు ప్రమాద సూచికలు

ఎగరేస్తుంటే..

కెరటాలు కళ్లల్లోకొచ్చి

విరుచుకు పడ్డాయ్!

రెప్పల వెనుక సూర్యాస్తమయం

లోపలంతా చీకటి.

గుండె గదికి అడ్డంగా...

బోర్లించబడ్డ పర్వతం

కుంభవృష్టి.. కురిసింది ఎంతసేపో?

దిగులు.. వాగులై పారినట్టుంది.

అంత వానలోనూ..

ఒక అగ్నిపర్వతం బ్రద్దలయ్యింది

బుగ్గల మీద ‘లావా’ చారిక.

దుఃఖం ముట్టడిలో చేతులెత్తేసిన

ఒంటరి ద్వీపాన్ని.

చీకటితో పోరాడుతూ నన్ను నేను

దహించుకున్న దీపాన్ని.

అల్లకల్లోలమైన అంతరంగంలో

చెలరేగిన దావానలం.

దగ్ధమైన చీకట్లో..

వెలిగిన జ్ఞానజ్యోతి

పండుగ ముందు ఇల్లలికినట్టు

మదిలో ఏదో పవిత్ర భావన.

జీవితం గడ్డిపోచంత తేలికా?

కాలం.. ఏడు రంగుల హరివిల్లు

పెదాల మీద చిరునవ్వుల తోరణాలు

దూరంగా వెళ్లిపోతోన్న దుఃఖానికి

వౌనం.. పాడుతోన్న వీడ్కోలు..

దుఃఖం.. ఇప్పుడు ఆత్మబంధువు

ధైర్యానికి.. జన్మనిచ్చిన అమ్మ.
*21.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి