పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఆగస్టు 2012, బుధవారం

డా. సింహా చలం లక్ష్మణ్ స్వామి||తలసేమియా (రక్త పిశాచి ) ||


పైకి మాత్రం చిరునవ్వుల మేలి ముసుగుల
లోలోన మృత్యు ఘంటికలు ...

రుధిరపు నదుల్లోకి చొరబడ్డ తిమింగలాలు
ఒక్క నెత్తుటి చేపనూ వదలట్లేదు

ఏటి పక్కన బురద గుంటలో
మాటు వేసిన మకరం ...!

ప్రాణ జ్యోతిని వెలిగించటానికి
తగలబడుతూ
తరిగి పోతున్న నెత్తుటి ఇంధనం !!

పక్షానికోమారు
ప్రణాగ్ని పరీక్ష ..!!

చిల్లు పడ్డ రుధిర భాండం
గండి పడ్డ జీవన తటాకాన్ని
ఆపలేక ,నింప లేక
క్షణ క్షణం నరకయాతన ...!!

ఇదెక్కడి అన్యాయం దైవమా !!!
ఏపాపం చేశారని
ఈ చిరు దీపాల్ని
తుఫాను లోకి తోసేస్తున్నావు !

ఈ రక్త పిశాచాల బోనులో
ఆ చిన్నారుల ఆర్తనాదం
హృదయాన్ని పెకిలిస్తోంది
కాపాడవా ......!

రోజులు కరకు రంపాలై
రోజూ కోస్తుంటే
కన్నీటి మంటల్లో పడి
కన్నవారు విలవిల లాడుతున్నారు

తలసేమియా తలసేమియా
చిన్నారులని వదిలి వెళ్ళిపోవా

నీవు ప్రవేశించాక
ఇల్లు జీవచ్చవాల స్మశానమైయ్యింది!
ఏక్షణం ఏమవుతుందో ...?!
అవయవాలన్నీ చిద్రమవుతున్నాయి .

నెత్తుటి చుక్కల్ని కొనలేక
ఈ దారుణాన్ని కనలేక
పగులుతున్న గుండెలతో
పరితపిస్తున్న కుటుంభాలు ..!

తలసేమియా పంజాతిన్న
ఆధునిక విజ్ఞానం
పరుగందుకుంది ...!

అణుబాంబులు
అంతరిక్ష జ్ఞానం
బొక్క బోర్లా పడ్డాయి ...!!

లక్ష లేత ప్రాణాల్ని
పీక్కుతింటున్న
తలసేమియాను తరిమే
ఒక్క ఆయుధం కావాలి .

ఇల్లు -వాకిలి -భూమి -ఆస్తులన్నీ
తలసేమియా పూజకు హారతి
కర్పూరా లయ్యాయి..!!?

ఎన్నాళ్ళీ జీవన్మరణ పోరాటం ...!

అస్త్రాలన్నీ అయిపోయాయి
మృత్యువు రానే వచ్చింది

చీకటిలో ...
లీనమవుతున్న
చిరుదివ్వెల పరంపర
కొనసాగుతూనేవుంది ............!!!!??

* ( తలసేమియా బారిన పడిన పిల్లల, వారి కుటుంబాల దీనాతి దీన వేదనకు,
నరక యాతనకు స్పందిస్తూ ....) 
21.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి