పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఆగస్టు 2012, బుధవారం

పెరుగు రామకృష్ణ || మనదేశం-మన గీతం..||


నీలి సముద్రం మీద
గుండెని లాగి కట్టి రాసిన వేదమే జనగణమన ..
శవాలు గుట్టలుగా మిగులుతున్నప్పుడు
మరణం మీటిన రహస్య శబ్ద తంత్రీ నాదమే జనగణమన..
సింధు నది ఆవలి వొడ్డు నుండి
గంగా నది ఈవలి వొడ్డు వరకు జలతరంగిణి లా సాగే
ఒక మహా ప్రవాహ సంగీతమే జనగణమన..
పాట అందర్నీ పరవశింప చేసినా
గానం ఎప్పుడూ తల వంచదు ...
కాలంలో జారిపోయిన
అద్భుత క్షణాల్ని దోసిట్లో పెడుతుంది...
భారత దేశం ఒక తేజో మండల దీపం
ఇక్కడి మనిషిది కాన్తివంతపు దేహం
అందుకే
నా దేశాన్ని నేను జనగణమన తోనే అలంకరిస్తాను..
ప్రతి పౌరుడి గుండెలమీద పచ్చబొట్టులా దాన్ని పొదుగుతాను
శాంతి కాముకుడ్నై ,యుద్ధరహిత
మరోప్రపంచం కోసం మళ్ళీ మళ్ళీ జనగణమన ఆవిష్కరిస్తాను
నా గీతానికి ఆత్మాభిమానం ఎక్కువ...
నా దేశానికి గర్వమెక్కువ..
ఒక పురాతన ఉద్యమం లో అమరుల సాక్షిగా
మనుషులు పుష్పించడం కోసం జనగణమన ఆలపిస్తాను
భారతమాతను జనగణమన తోనే అభిషేకిస్తాను..
హిమాలయాల జీవన తాత్వికతను సుజల్లం,సుఫలాం లా
ప్రతి భారతీయుడి గుండెల్లోకి వొంపుతాను
అవును...
గురి కోసం నేను పాటని ఆయుధం చేస్తాను
దానికి జనగణమనగా నామకరణం చేస్తాను
నా గీతం లో కాంతి మసి బారదు
నా గీతం లో జాగృతి ఎప్పటికీ ఆరదు
అలుపెరగని గళాలతో, కోట్ల గొంతులతో
జయ జయహే నినాదాల తో
ఈ జాతీయ గీతం తోనే శత్రువుని జయిస్తాను...!
*21.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి