పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, జులై 2012, శుక్రవారం

జుగాష్ విలి || ఆమె కనిపించింది ||


ఆమె కనిపించింది
ఒకానొక పురాతన సమయంలో
నేను మోహించిన ఆమె
నన్ను ఇష్టపడిన ఆమె

నాలుగు దశాబ్దాల కిందట
యవ్వన ప్రాంగణం తలుపుతట్టిన నన్ను
తలుపుతీసి స్వాగతించిన ఆమె
మళ్ళీ ఇన్నాళ్ళకు
ఇక్కడ ఇప్పుడు కనిపించింది

కాలం సానపెట్టిన
సౌందర్యపు మెరుపుతో
సుడిగాలిలా గట్టిగా చుట్టేసుకున్నది ఆమె
నన్ను ఇప్పుడు ఇక్కడ

జుట్టు వెనక్కిజారి విశాలమైన
నా ముడుతల నుదిటికి
ఒక సుదీర్ఘ చుంబనాన్ని కానుకగా ఇచ్చినది ఆమె

కాలం కనుమరుగు చేయలేని కరుణ
కళ్ళనిండా నింపుకొని ఆమె
నా కళ్ళలో తన చూపును నిలిపినప్పుడు
ఇక్కడ ఇప్పుడు కూడా
అపరాధ భావన ఆవరించి... అవధరించి...
నాకళ్ళు తడబాటుతో తలదించుకున్నాయి

ఇన్నాళ్ళ విరామం తరువాత
కాదు
ఎడబాటు తరువాత
నాలుగు పదుల కాలాంతరమున కూడా
నను గుర్తుపెట్టుకున్నది ఆమె
తన ఆత్మతోను... దేహంతోను...
*26-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి