పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, జులై 2012, శుక్రవారం

జిలుకర శ్రీనివాస్||ఎహే పో! అని నువ్వు విసుక్కునే మూతి విరుపు ప్రేమ||

ఎహే పో! అని నువ్వు విసుక్కునే మూతి విరుపు ప్రేమ

స్వర్గానికి దూరంగా
నరకానికి చాలా దగ్గరగా
రోజు నేను చిక్కని చీకటిగా మాసిపోతున్నాను
దూరంగా ఉంచుతున్నవో
నువ్వే దూరం అవుతున్నవో
ఎంతకీ అర్థం కాని కవితలా మారిపోతున్నావు

తెల్లవారక ముందే దిగిలు ముసురు నన్ను కమ్మేస్తూంటది
పగలంతా ప్రాణం నీ మాటలను మననం చేసుకుంటూ మురిసిపోతది
రాత్రంతా కలలకు ఆహరం అవుతూ దేహం మురిగిపోతది
కులం కత్తులకు రాలిపడిన కోట్ల కొద్ది స్వప్నాలు ఎండిపోతాయి
ఎండా పొద విచ్చుకున్నాక నీ తీయటి మాటల పూలు పరిమలించాక
అస్పృశ్య హృదయమొకటి నా మెరుపుల చూపుల కోసం చిక్కని కవితొకటి రాసుకుంటది

ప్రేమంటే పత్రికా ప్రకటన కాదు
హక్కుల దేబిరింపు లేఖ కాదు
మనసును చంపుకొని బతకటం కాదు
ఎవరికోసమో నిర్జీవంగా పరిగెట్టడం అంత కంటే కాదు

నేను నీకోసం రాసిన తీయటి కవితా సంతకం ప్రేమ
నిత్యం నిన్ను స్మరిస్తూ బతకటం ప్రేమ
నిజ్జంగా నువ్వు నన్ను నిరాకరించటం ప్రేమ
నా మనో లోకం మీద నువ్వు విసిరినా నవ్వుల తునుక ప్రేమ
ఎహే పో! అని నువ్వు విసుక్కునే మూతి విరుపు ప్రేమ
ఎలా చింపి చూపేది తెంచి నీ చేతికిచ్చేది మొండి?
            .....
*27.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి