పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, జూన్ 2014, ఆదివారం

Sriramoju Haragopal కవిత

అశోకన్న- పాటలు అశోకన్న ఇరవై ఏళ్ళుగా తెలుగుసినిమాలకు పాటలు రాస్తున్నాడు. తన పాటలు వినగానే గుర్తుపట్టే శ్రోతలుండడం సినీకవికి అరుదైన సత్కారం.పాట పాటలో,మాట మాటకు కవి ఏం రాయబోతున్నాడన్న కుతూహలం పుట్టించే అసాధారణ ప్రతిభా వ్యుత్పత్తులున్న అరుదైన సినీగేయపదకర్త మా అశోకన్న. ఆయన పుట్టిందే పాటల ఒడిలో.అమ్మ జానకమ్మ, నాన్న సుద్దాల హనుమంతుగార్ల పాటల ఉగ్గు తింటూ పాటగా పెరిగినవాడు. వారి ఉద్యమ జీవితానుభవాలు, ఆశయాలు, జీవనవిధానం, ఇళ్ళే గ్రంథాలయంగా తాను పొందిన జ్ఞానానుభవం తననొక ప్రవహించే పాటను చేసింది. అన్న పాటల్ని రాగాలతోని పాడడు. మనసుతో పాడుతాడు. సినిమాలకు రాకముందు తాను రాసిన ప్రతిపాట ఒక జీవితానుభవమే, ఒక ప్రాపంచికదృక్పథమే. చలం, శరత్, శ్రీశ్రీలను చదివిపొందిన అంతులేని అన్వేషణమే. తాను స్త్రీల గురించి రాసిన పాటలు అంత ఆర్ద్రంగా వున్నాయంటే.... తనలో పల్లెజీవితపు సౌరభాలే కాదు, పల్లె స్త్రీల వేదనలు కూడా నిలువెల్లా తనను ఉద్విగ్నం చేసాయి. అశోకన్న ‘నేలమ్మా నేలమ్మా’ పాటలకు పాపినేని శివశంకర్ గారు ముందుమాట ఎంత రసానందంతో రాసారో... ‘ఒక గానంలో ప్రాణం కలిస్తే అది సుద్దాల అశోక్ తేజ ఒక జానపదంలో జ్ఞానపదం కలిస్తే అది అశోక్ తేజ ఒక కవనంలో కదనం కలిస్తే అది అశోక్ తేజ ఒక అరుణోదయంలో కరుణా హృదయం కలిస్తే అది అశోక్ తేజ’ అని. అందరి దారిని అనుకరించని తత్వం తనది.అందరికి భిన్నంగా వెలిగే ఊహ తనది. ఊహకందని విధంగా పదాలతో చమత్కారపు మెరుపులు విరజిమ్మే పాటలు తనవి. బురదలో కదిలే రైతుని చూస్తే మహా అయితే తామరపువ్వు గుర్తుకు రావాలె పోలికకు. కాని అశోకన్న రైతుని ఆకుపచ్చ చందమామ అన్నాడు. ఎంత అద్భుతంగా వుందీ వూహ.ఇద్దరికీ సాపత్యం చూపిస్తాడు దీన్నే Art of Contrast అనుకోవచ్చంటారు పాపినేని గారు. ఇలాంటి వైరుధ్యశిల్పం తన పాటల్లో ఎక్కువచోట్ల చూస్తాం మనం.అట్లా వూహించి రాయడం తనకిష్టం . ‘ నింగి వెన్నపూస వాడు (చందమామ), నేల వెన్నుపూస నువ్వు( రైతుని దేశానికి వెన్నుపూస అంటారు కదా)... తన పాటలకు మొదటి శ్రోతలం మిత్రులమే. పాట వింటూ అలౌకిక స్థితిలోకి చేరడం మాకు అనుభవం.అనుకంప నిండిన గొంతుతో అశోకన్న పాడుతుంటే కన్నీళ్ళై ప్రవహిస్తుండేవాళ్ళం.ఇప్పటికీ అంతే.తను పాడాలి. మేం వినాలి. ఇంకేదో కావాలి పాటలో అనుకునే వాళ్ళం. వెంటనే తన పాటలో కొత్త ఝలక్ లు కలిపేసే వాడు. మమ్మల్ని ఏడిపిస్తే పాట గెలిచినట్లే అనేవాడు. ఆ దుఃఖపరవశగీతాలన్ని అట్లాంటివే. ‘ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా.... ఈడ యెవనికి కానిదాన్ని యేడిదాన్నిరా నేను?...అని ఆడదానిగోసను విన్పించినా, ‘అవ్వ నీకు దండమే... అక్కవ్వ నీకు దండమే.. అంటూ ఆడది అర్ధాంగిగా మగవాడికి ఎన్నివిధాల ఆకాశంలో సగమయ్యి బతుకంతా తోడు నిలుస్తుందో చెప్తూ ‘ పురుటినొప్పుల బాధ తెలియని, పురుషజాతికి తల్లివైతివీ...’అంటాడు అశోకన్న. తల్లి కాగలిగినది ఆడదే. ఆ తల్లితనం మగవాడికి లేదు.రాదు. స్త్రీ స్థానం ఆమెదే. ఆడకూతురే ఈ ప్రపంచానికి ఉదయాస్తమయాలు. ఆమె లేకుంటే పురుషప్రపంచం అంధకారబంధురమే. కాని ‘ మగవాడే నీ నొసటన రాసె మనువు రాతలు.... పురుషాధిక్యసమాజం చేసిన తాతలకుట్రేదో చెప్పి స్త్రీ పక్షపాతిగా నిలిచాడు అశోకన్న. ఈ పాటలు విని తమవేనని అనుకోని స్త్రీలుండరని నా నమ్మకం. పాట రాసినపుడు ఆ విషయంలోకి పరకాయప్రవేశం రాయడం అశోకన్న పద్ధతి.తెలిసిన విషయాలనైనా సరే తరచి తరచి తెలుసుకుని రాస్తాడు, ఎంత సున్నితంగా పదాలను పూలమాలలాగా అల్లుతాడో, అంతే వజ్రకాఠిన్యంతోనూ రాస్తాడు. ప్రతిపాటలో తానుంటాడు. సినిమాల్లో సందర్భాల కనుగుణంగా రాసినా తనదైన ముద్రను వొదులుకోడు అశోకన్న. స్వతహాగా తను ఎంత ఎమోషనలో, తన పాటలు కూడా అంతే భావోద్వేగాలతో నిండి వుంటాయి. తడి ఆయన పాటల రహస్యం. ప్రతి గుండెను తడిమే గుణం ఆయన పాటల నైజం. అశోకన్న తొలుత అచ్చేసిన పాటలపుస్తకం బతుకుపాటలు. అందులో ‘కన్నాతల్లీ మమ్ముల కన్నప్పటి నుండీ కడుపునిండా తినలేదు మెతుకు కంటినిండా... కనలేదు కునుకు’ పేదతల్లి బాధలగాధకు గానరూపమిచ్చాడు అశోకన్న. అసలు పాటెట్లా పుట్టిందో అశోకన్న చెప్పిన తీరు అనితరసాధ్యం.ఇంతకు ముందెవ్వరు రాయలేదు. పని,పాటల జమిలి తత్వాన్ని శ్రమైకజీవనసౌందర్యాన్ని, పని పాటకు ఎట్లా కారణమో, పాట పనికి ఎట్లా ఉపశమనసాధనమో తనచెప్పినట్లు ఎవరు చెప్పగలుగుతారని...? ‘టపటపటప టపటపటప, చెమటబొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే, స్వరాలు కడుతుంటే పాటా పనితోపాటే పుట్టింది పని పాటతో జత కట్టింది’..... అట్లే తాను పరికరాలు పుట్టుక గురించి రాసిన పాట మానవపరిణామం, మానవాభ్యుదయాల గురించి ఇంతకు మునుపు ఎవరు రాయని పాటే... ‘పరికరాలు పుట్టించిన, తెలివి కష్టజీవిది.. పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది.. కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది’ ‘ మనసురాట్నమును దిప్పి మెదడునెంతొ వడికి వడికి’ మనిషి ఇన్ని సుఖసాధక యంత్రాలెన్నో కనిపెట్టాడు. కనిపెడుతూనే వున్నాడు. వాటి వెనక శ్రమే కారణభూతమై వుంది. అడివి గురించి రాసినా , అన్నల గురించి రాసినా, రాములమ్మ సినిమాల్లో రాసినా ప్రతిపాటలో ‘కోటబుల్ కొటేషన్స్ ’ వంటివెన్నో చిరస్మరణీయాలు. అడివితల్లి పాటలో ‘ ఆకలైతె నువ్వు మాకు అమ్మ చెట్టువే, ఆయుధాలను అడిగితే జమ్మిచెట్టువే’ , ‘పోరాటవ్యూహాలకు పురుటితల్లి అడవి, విముక్తి పోరాటాలకు తరతరాల సాక్షి అడవి’....వంటి వాక్యాలు, జై సుభాష్ చందు లో ‘ పుడతారు వేలవీరులే ఒక్కధీరుడే ఒరిగి, పుడతాయి విప్లవాలెన్నొ వీరరక్తాలు చింది ’... భద్రాచలం లో ‘గెలుపు పొందెవరకూ అలుపు లేదు మనకు, బ్రతుకు అంటె గెలుపు గెలుపు కొరకె బ్రతుకు’ మంటాడు. ఇట్లాంటివి ఆయన పాటలనిండా వుంటాయి. ఉద్భోధించేవి, ప్రేరణనిచ్చేవి ఎన్నో. అశోకన్న పాటలలో మకుటాయమానమైన పాట, విశ్వజనీనతకు ప్రతీక అయిన పాట, వింటూనే ప్రపంచయాత్ర చేయించే పాట, తనను పాటల ఇంటివాణ్ణి చేసిన పాట ‘ నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా’ ... ఈ నేలను భూమాతగా వర్ణించడం అనూచానంగా వొస్తున్నదే అయినా... అశోకన్న పాడిన, రాసిన నేలమ్మ వేరు. ఆమె అచ్చంగా ఓ పేదతల్లి. ఓ సామాన్యమైన పల్లెటూరితల్లే. ఎవ్వరిట్ల అమ్మను గురించి పాడిన బిడ్డలు, రాసిన కవులు? అశోకన్నా నీకు, పాటలు రాస్తున్న నీ చేతులకు వేల వేల వందనాలన్నా. అశోకన్న పాటలు ఆంగ్లంలో suddala ashokteja lyrics ( translated by swati sripada garu) అని హిందీలో ‘ధర్తీమా ధర్తీమా’ ( ఎం.రంగయ్య గారిచే అనువాదితం) అని త్వరలో ఆవిష్కరించబడనున్నాయి. (04.06.2014న అశోకన్న ద్విదశాబ్ది సినీగీతోత్సవం జరుగనున్న సందర్భంగా) 04.06.2014 న

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oetNj8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి