పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, జూన్ 2014, శుక్రవారం

Abd Wahed కవిత

మొన్న కవిసంగమం సమావేశంలో పాల్గొనడం ఒక మధురమైన అనుభూతి. కవిమిత్రులను కలుసుకోవడం, ఉర్దూ కవిత్వ నజరానా గురించి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, మరింత మెరుగ్గా ఉర్దూ కవిత్వ నజరానాను తీర్చిదిద్దడానికి నాకెంతో తోడ్పడే విషయం. ముఖ్యంగా గాలిబ్ సిరీస్ పై చాలా మంది ఆసక్తిగా ప్రశ్నించారు. గాలిబ్ కవిత్వం పట్ల ఉన్న ఆసక్తి చూసిన తర్వాత శుక్రవారం ఎప్పుడు వస్తుందా, మరో పోస్టులో మరిన్ని గాలిబ్ కవితలను పరిచయం చేసే అవకాశం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూడ్డం నా పనయ్యింది. చివరకు శుక్రవారం రానే వచ్చింది. ఇక గాలిబ్ కవితలు ఆస్వాదిద్దాం... ఈ రోజు గాలిబ్ కవితా సంకలనంలోని 20వ గజల్ మొదటి షేర్. ఇది మత్లా కాబట్టి రెండు పంక్తుల్లోను రదీఫ్ నియమం కనబడుతుంది. దోస్త్ గమ్ ఖోరీ మేం మేరీ, సయీ ఫర్మావేంగే క్యా జఖమ్ కే భర్నే తలక్, నాఖున్ నా బఢ్ జావేంగే క్యా నా బాధలకు మిత్రుల సానుభూతి ఎలా పనికొస్తుంది? గాయం మానేలోగా, గోళ్ళు పెరగకుండా ఉంటాయా? ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. గమ్ ఖోరీ అంటే సానుభూతి చూపడం, బాధలో ఉన్నప్పుడు బాధ తగ్గించడానికి ప్రయత్నించడం. సయీ అంటే ప్రయత్నాలు. ఫర్మావేంగే అనేది పాత ఉర్దూ, ఫర్మాయేంగే ఇప్పటి రూపం. ఈ వాక్యంలో సయీ ఫర్మాయేంగే అంటే ప్రయత్నాలు చేస్తారా అని. జఖ్మ్ అంటే గాయాలు. భర్నా అంటే మానడం. నాఖున్ అంటే గోళ్ళు. భడ్ జానా అంటే పెరగడం. ఈ కవితకు భావం చూద్దాం. ప్రేమలో గాలిబ్ అనేక గాయాల పాలయ్యాడు. మిత్రులు, హితులు, శ్రేయోభిలాషులు సానుభూతి చూపి బాధ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. కాని స్వయంగా గాలిబ్ తన గాయాలను మాననీయడం లేదు. తన గోళ్ళతోనే పచ్చిగా చేస్తున్నాడు. మిత్రులు ఆయన గోళ్ళు కత్తిరించడం ద్వారా ఆ గాయాలు తగ్గేలా చూద్దామనుకున్నారు. కాని గోళ్ళు మళ్ళీ పెరుగుతాయి కదా అప్పుడేం చేయగలరు? ఇక్కడ గోళ్ళను గాలిబ్ ప్రతీకగా వాడుకున్నాడు. ప్రేమ విఫలమైన నిజమైన ప్రేమికుడు ఆ ప్రేమను ఎన్నటికీ మరువలేడు. ఎంతకాలమైనా ఆ విషాదాన్ని సజీవంగా ఉంచుకుంటాడు. మిత్రలు అందులోంచి బయటకు లాగాలని ఎంత ప్రయత్నించినా అతను స్వయంగా అందులోంచి బయటకు రావాలని భావించడు కాబట్టి ఆ ప్రయత్నాల వల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు. ఈ కవితలో కొందరు సూఫీతత్వాన్ని వివరిస్తారు. మనిషిని చెడు మార్గంపై నడిపించడానికి సైతాను మనిషికి మిత్రుడి రూపంలో వస్తుంటాడు. దేవుడిని ప్రేమించే మనిషి కష్టనష్టాలను ఎదుర్కుంటున్నప్పటికీ దైవప్రేమలో స్థిరంగా ఉంటాడు. ఆ కష్టాలను నవ్వుతూ భరిస్తాడు. మిత్రుడి రూపంలో వచ్చిన సైతాను ఎలాంటి సానుభూతితో దారి మళ్ళించాలని ప్రయత్నించినా, దేవుడిని మరిచిపోతే బాగుపడతావని, భవిష్యత్తు బాగుంటుందని ఎంత నమ్మబలికినా దైవప్రేమ గుండెల్లో నింపుకున్న మనిషిపై ఆ మాటల ప్రభావం ఉండదు. రెండవ కవిత గాలిబ్ సంకలనంలోని 20వ గజల్ 2వ కవిత. బే నియాజీ హద్ సే గుజరీ, బందా పర్వర్, కబ్ తక్ హమ్ కహేంగే హాల్ దిల్, ఔర్ ఆప్ ఫర్మావేంగే ’’క్యా‘‘ మీ ఉదాసీనత పరాకాష్ఠకు చేరింది, మహరాణీ, ఎంతకాలం? నేను మొరపెట్టుకుంటున్నాను మీరు ’’ఏమిటీ‘‘ అంటున్నారు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. బేనియాజీ అంటే ఉదాసీనత, నిర్లక్ష్యం, అలక్ష్యం వగైరా అర్ధాలున్నాయి. హద్ అంటే హద్దు. హద్ సే గుజరీ అంటే హద్దులు దాటింది. బందా పర్వర్ అంటే సేవకులను కాపాడే వ్యక్తి. నిజానికి దేవుడిని బందా పర్వర్ అంటారు. దాసులను కాపాడేవాడు, పోషించేవాడు ఆయనే కాబట్టి. కబ్ తక్ అంటే ఎప్పటి వరకు అని అర్ధం. హాలె దిల్ అంటే మనసు పరిస్థితి, అంటే బాధలు. క్యా అంటే ఏమిటి అని అర్ధం. చెప్పిన ప్రతిసారి ఏమిటి అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం. ఈ కవిత భావం చూద్దాం. గాలిబ్ ప్రేయసిని ఉద్దేశించి ఈ మాటలంటున్నాడు. నిజానికి తన బాధ చెప్పుకుంటున్నాడు. బందా పర్వర్ అని కూడా సంబోధించాడు. అంటే తనలాంటి దాసుడిని కాపాడే మహారాణి లాంటిది. ఆమె ముందు మొరపెట్టుకుంటున్నాడు. కాని ఆవిడ ధ్యాస మరెక్కడో ఉంది. సింగారించుకోవడంలోనో, మరింత అందంగా తయారై గాలిబ్ వంటి ప్రేమికులను మరింత పిచ్చివాళ్ళను చేయడంలోనో ఆమె ధ్యాస ఉంది. అందువల్ల ఆమె గాలిబ్ మాటలు వినడం లేదు. ఆయన తన బాధనంతా వెళ్ళగక్కిన తర్వాత ఆమె ఏం చెప్పావో మరోసారి చెప్పు అంటోంది. ఈ నిర్లక్ష్యం, ఉపేక్ష చూసి గాలిబ్ ఇక భరించలేకపోయాడు. ఇక నిర్మొహమాటంగా చెప్పేశాడు, మహారాణీ, ఈ నిర్లక్ష్యం ఇక భరించలేను. తలకు మించి పోయింది. ఇది ఇలా నిరంతరంగా ఎంతసేపు ఇలా కొనసాగాలి. నేను నా బాధలు చెప్పుకోవడం, మీరు మళ్ళీ మళ్ళీ ఏం చెప్పావని అడగడం. ఇది చాలా ప్రచారం పొందిన కవిత. చాల సందర్భాల్లో కోట్ చేయడానికి అనువైన కవిత. ఇక్కడ ప్రేయసి అన్న పదాన్ని కవితలో గాలిబ్ ఉపయోగించలేదు. అందువల్ల ఎవరిని ఉద్దేశించి అయినా ఉపయోగించడానికి వీలుంది. అయితే ముఖ్యంగా ప్రేమికుల మధ్య చిరు కలహాల్లో కూడా కోట్ చేయడానికి అనువైన కవిత తర్వాతి కవిత గాలిబ్ సంకలనంలోని 20వ గజల్ 3వ షేర్ హజ్రతె నాసిహ్ గర్ ఆవేం, దీదా దిల్ ఫరషే రాహ్ కోయీ ముఝ్ కో ఏ తో సమఝాదో, కె సమఝావేంగే క్యా ప్రబోధకుడు వస్తుంటే స్వాగతం, మా గుండెను తివాచీగా పరిచేస్తాం కాని, ఆయన చెప్పేదేమిటో, ఎవరైనా నాకు వివరిస్తారా కాస్త ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. నాసిహ్ అంటే ప్రబోధకుడు, హజ్రత్ అనేది గౌరవవాచకం. దీదా అంటే కళ్ళు, దిల్ అంటే హృదయం. ఫరషె రాహ్ అంటే బాటగా పరచడం. సమఝానా అంటే వివరించడం, చెప్పడం. ఈ కవితకు భావం చూద్దాం. గాలిబ్ ప్రేమలో పిచ్చివాడిగా మారిపోయాడని ఒక ప్రబోధకుడికి తెలిసింది. ప్రేమలో పడి దేవుడిని కూడా మరిచిపోయాడని తెలిసింది. గాలిబ్ కు హితబోధ చేయడానికి వెళ్లాలనుకున్నాడు. ఆ విషయాన్ని గాలిబ్ మిత్రులకు చెప్పాడు. ఆ విషయాన్నిమిత్రులు గాలిబ్ కు చెప్పారు. ఆయన వస్తుంటే చాలా సంతోషం. ఆయనకు స్వాగతం. ఆయన కోసం కళ్ళను, హృదయాన్ని తివాచీగా పరిచేస్తాను. చాలా గౌరవంగా ఆయన్ను పిలుస్తాను. కాని, అసలు ఆయన వచ్చి నాకు ఏ విషయం గురించి మాట్లాడుతాడో ఎవరైనా చెబుతారా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే అర్ధం. గాలిబ్ తనలో ఉన్న ప్రేమ ఒక అగ్నిగా భావిస్తున్నాడు. హితబోధల నీళ్ళు చల్లినంత మాత్రాన దాన్ని చల్లార్చడం సాధ్యం కాదు. కాబట్టి ప్రబోధకుడు వచ్చి హితబోధ చేసినా ప్రయోజనం ఏమీ లేదని ముందే తేల్చేశాడు. ఇది ఈ వారం గాలిబానా. వచ్చే శుక్రవారం మరిన్ని గాలిబ్ కవితలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UiH94M

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి