పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మే 2014, మంగళవారం

Aruna Naradabhatla కవిత

విలువలు _________అరుణ నారదభట్ల పరుగుపందెం కొద్దిగా పుంజుకుంది... కాళ్ళూ నావే...చేతులూ నావే! కాలం కళ్ళు తెరిపించిన చరిత్రా నాదే! నేనో మూలబడిన పుస్తకాన్ని... పేజీలనిండా బోలెడన్ని కలలు! సద్దిమూట నుండి విప్పిన ఎర్రని పచ్చడిమెతుకునూ... రంగూ...రుచీ తో పాటూ నోరూరించే అందచందాల సుగంధాలూ నావే! విజ్ఞాన సర్వస్వంలా ఇంటితోటకే పూలై పూసాను ఇంతకాలంగా! "పరిమళాలను పీల్చేసుకొని నాలుగు గోడలకే అంకితం చేసే ఈ సంసృతికి ఇప్పుడు నేనో దూరపు బంధువును!" "నా సేవలకు విలువ కట్టని ఈ లోకానికి నేనిప్పుడో చక్కని జవాబుదారిని!" "లోకం ఉనికిని చాటుతున్న మాతృత్వానికి విలువ లేనప్పుడే మానవధర్మం అంతరించింది!" "ఉదయాన్నే టీ కప్పునుండీ కళ్ళకు నిద్దుర కమ్మే వరకూ... నీకూ నీ బీజాలకు క్రీనీడనైనా నా ఉనికిని ఒక్కసారైనా గమనించని సమాజానికి ఇప్పుడు నేనో కొత్త పోటీని!" "కళ్ళాపు చల్లిన వాకిలిలో ముగ్గుగా ముడుచుకొని మల్లెపూవులా ఉండాలనుకున్న... నీ అడుగుజాడనై!" "అనుక్షణం అణచివేసిన ఆరాటాలు పెద్దమూటై గుట్టగా మారుతున్నాయి!" "మళ్ళీ పూర్వపు వాసనలు"!!! "ముక్కంటి తెలివిగా బంధించాననుకొన్నాడు... ఇప్పుడు మూడు కళ్ళూ మూడు ప్రళయాలై అన్ని రంగాలనూ దట్టంగా ఆలింగనం చేసుకుంటున్నాయి!" "నరాల్లో పరుగెత్తిన రక్తం ఒక్కసారిగా ఉవ్వెత్తున పారుతుంది!" "పొలం నాటువేసే పడతినుండి దేశాన్నేలే నేత దాకా.... మళ్ళీ అంతా నేనై ఆవహిస్తున్నా!" "ఆడది...అబల...స్వాతంత్రమా.. అని నవ్విన నోళ్ళు ఇప్పటికే గుక్కపట్టుకొని ఏడ్వడం ప్రారంభించాయి!" "విలువలను వెదుక్కుంటూ వెళ్ళే ప్రయాణంలో ప్రస్తుతం నువ్వో పాత్రవు మాత్రమే అయ్యావు!" "కేవలం ఆర్థిక స్వాతంత్రనికే" దాసోహమైన పురుష ప్రపంచానికి ఇప్పుడు నేనో గట్టి పోటీని! "అన్ని కార్యాలనూ అవలీలగా చక్కదిద్దే భారతనారీని!" "ఇప్పుడు ఆకాశమూ నాదే... అంతుచిక్కని అద్భుతమూ నేనే!" "ప్రకృతిని చదవడానికి ఇకపై ఎన్ని జన్మలు ఎత్తాలో నీ ఉనికి మళ్ళీ పూవులా పరిమళించాలంటే!" 20-5-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jkZmro

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి