పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, మే 2014, గురువారం

Abd Wahed కవిత

ఈ రోజు ఉర్దూ కవిత్వ నజరానాలో గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ చూద్దాం మొదటి షేర్ బస్ కే దుష్వార్ హై హర్ కామ్ కా ఆసాం హోనా ఆద్మీ కో భీ మయస్సర్ నహీ ఇన్సాం హోనా ప్రతి పని సులభంగా నెరవేరడం చాల కష్టం మనిషికి కూడా మానవుడిగా మారడం చాలా కష్టం చాలా సరళమైన పదాలతో గాలిబ్ చాలా లోతయిన భావాన్ని వ్యక్తం చేసిన కవిత ఇది ఇందులో ఉన్న ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. బస్కే అంటే అత్యధికంగా, చాలా ఎక్కువగా అని అర్ధం. దుష్వార్ అంటే అసాధ్యం, సాధ్యం కాని పని, చాలా కఠినమైన పని అని భావం. మయస్సర్ అంటే లభించడం, దొరకడం, ప్రాప్తం కావడం వగైరా అర్ధాలు చెప్పవచ్చు. ఆద్మీ అన్న పదం గమనించదగ్గది. ఆద్మీ అంటే మనిషి అన్నది భావం. ఆదమ్ నుంచి మానవాళి వ్యాప్తి చెందింది కాబట్టి మనిషిని ఆద్మీ అంటే ఆదమ్ సంతానం అంటారు. ఇన్సాన్ అంటే కూడా మనిషి, మానవుడు అని అర్ధం. ఇక్కడ మానవ లక్షణానికి ప్రాముఖ్యం ఉంది. ఇన్సానియత్ అంటే మానవత్వం. ఇన్సాం హోనా అంటే మానవత్వ లక్షణాలతో నిజమైన మనిషిగా మారడం. ఈ కవితలో భావాన్ని చూద్దాం. మనిషికి ఏ పనయినా చాలా కష్టంతో కాని పూర్తి కాదంటున్నాడు గాలిబ్. మనిషి ప్రతి పని చేయడానికి చాలా కష్టపడక తప్పదు. మనిషి మనిషిగా పుట్టాడు. ఉర్దూలో ఉన్న పంక్తిని గమనిస్తే, ఆదమ్ సంతానం కావడం వల్ల పుట్టుకతోనే మనిషిగా పుట్టాడు. ఇంకొక్క అడుగు ముందుకేస్తే చాలు మానవత్వ లక్షణాలున్న ఇన్సాన్ గా మారవచ్చు. కాని ఆ ఒక్క అడుగు ముందుకేయడం కూడా మనిషికి ప్రాప్తం కావడం లేదు. సాధ్యపడడం లేదు. ఒక తీవ్రమైన వ్యంగ్యం ఇందులో ఉంది. మనిషి మనిషిగా పుట్టాడు కాని, మనిషిగా మానవత్వంతో బతకడం మనిషికి సాధ్యపడడం లేదని అంటున్నాడు. ఇది నిజానికి చాలా చిన్నపనే కాని అది కూడా చాలా పనుల్లాగే సాధ్యం కావడం లేదంటున్నాడు. ఈ కవితలో గాలిబ్ ప్రయోగించిన పదాలు కూడా గమనించదగ్గవి. దుష్వార్ అన్న పదానికి పూర్తి వ్యతిరేకపదం ఆసాన్ ఉపయోగించి రెండవ పంక్తిలో ఆద్మీ అన్న పదం ఇన్సాన్ అన్న పదం ప్రాసగా వాడాడు. మొదటి పంక్తిలో రెండు పదాలు వ్యతిరేకార్థం ఉన్న పదాలు. కాని రెండవ పంక్తిలో రెండు పదాలు సాధారణంగా పర్యాయపదాలే, కాని వాటిని వ్యతిరేకార్థం కలిగిన పదాలుగా ప్రయోగించడంలో కవిత్వ నైపుణ్యం గమనించదగ్గది. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవితపై తమ అభిప్రాయం చెబుతూ మనిషికి ముఖ్యమైన లక్షణం మానవత్వం, మనిషి పుట్టుకతో మానవజన్మ ఎత్తాడు కాబట్టి ఇక మానవత్వం నిండిన మనిషిగా మారడం అతడికి చాలా సులభం. పశుపక్ష్యాదులకు ఇది సాధ్యం కాదు. కాని తనకు సులభమైన పని చేయడం కూడా మనిషికి సాధ్యం కావడం లేదు. ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమంటే, దేవుడు మనిషికి ఆలోచించే, తన ఇష్టం ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. ఇతర ప్రాణులకు అలాంటి స్వేచ్ఛ లేదు. అవి ఎలా బతకాలని దేవుడు నిర్ణయించాడో అలాగే బతుకుతాయి. అవి తమ పరిస్థితిని మార్చుకోలేవు. కాని మనిషి పరిస్థితి అది కాదు. మనిషిని దేవుడు ’’అష్రఫుల్ మఖ్లూఖ్‘‘ అంటే సమస్త ప్రాణుల్లో అత్యుత్తముడిగా పుట్టించాడు. పైగా భూమిపై సమస్తమూ మనిషి కోసమే పుట్టించాడు. ఇన్ని సదుపాయాలున్నప్పుడు మనిషి, పుట్టుకరీత్యా తనకు లభించిన ఈ సానుకూలతలను ఉపయోగించుకుని మానవత్వం ఉన్న మనిషిగా మారడం చాలా తేలిక. కాని అది కూడా అతడికి అసాధ్యం అయిపోయింది. ఈ మాట అంటూ, అసలు మనిషికి ఏ పని కూడా సులభం కాదు అంటూ మనిషి ఎలాంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడో తేల్చి చెప్పేశాడు. రెండవ కవిత గిర్యా చాహే హై ఖరాబీ మేరే కాషానే కీ దరో దీవార్ సే టప్కే హై బయాబాం హోనా నా నివాసం నాశనం కావాలన్నదే రోదనల కోరిక గోడలు, తలుపుల నుంచి కారడవి కారుతుంది చూడు ఈ కవిత భావాన్ని పరిశీలించే ముందు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. గిర్యా అంటే రోదనలు, దుఃఖం అని అర్ధం. కాషానా అంటే నివాసం, ఖరాబీ అంటే వినాశం. దర్ అంటే తలుపు. దరో దివార్ అంటే తలుపులు గోడలు అని అర్ధం. టపక్నా అంటే బొట్లు బొట్లుగా రాలడం. వర్షంలో ఇంటి పైకప్పు లీకేజి ఉంటే వర్షపు నీరు బొట్లు బొట్లుగా లోపల పడుతుంది దీని టపక్నా అంటారు. టపక్తా హై అంటే కారుతుంది అని అర్ధం. పాత ఉర్దూ వాడకంలో టప్కే హై అని కూడా ఉపయోగించేవారు. బయాబాం అంటే అడవి. బయాబాం హోనా అంటే అడవిగా మారడం (making of wilderness) అని చెప్పుకోవచ్చు. అంటే అడవిగా మారే ప్రక్రియ బొట్లు బొట్లుగా కారుతోందన్నది భావం. ఈ కవిత భావాన్ని పరిశీలిద్దాం. గాలిబ్ చాలా విషాదంలో ఉన్నాడు. రోదిస్తున్నాడు. అయితే ఈ రోదన తన ఇంటిని నాశనం చేయాలనుకుంటోందని మనకు చెబుతున్నాడు. తన ఇంటి గోడలు, తలుపుల నుంచి వర్షంలో నీరు కారుతున్నట్లు అడవి కారుతుందని చెబుతున్నాడు. ఇల్లు పాడుపడితే ఇంటిలో పిచ్చిమొక్కలు పెరిగి అడవిలా తయారవుతుంది. తన రోదన తన ఇంటి వినాశాన్ని కోరుతుందని, అందువల్ల ఇంట్లో వర్షపు నీటిలా అడవి కారుతోందని చెప్పాడు. ఈ కవితలోని పదచిత్రాలు, పోలికలు పరిశీలించదగ్గవి. రోదన వల్ల కంట నీరు వర్షిస్తుంది. ఆ రోదన అతని ఇంటి వినాశాన్ని కోరుతుంది. అందువల్ల ఆ నీరు అడవిగా ఇంటి గోడలనుంచి, తలుపుల నుంచి కారుతోంది. ఇలాంటి పోలిక బహుశా గాలిబ్ తప్ప మరెవ్వరూ చెప్పలేరు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్లో 4వ షేర్ వాయె దీవాన్గీ షౌఖ్ కీ హర్ దమ్ ముఝ్ కో ఆప్ జానా ఉధర్, ఔర్ ఆప్ హీ హైరాం హోనా అయ్యో, ప్రేమబాధ ఏం చెప్పేది ప్రతిక్షణం అటు వెళ్లడమూ, అయోమయంగా మరలడమూ ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. వాయ్ అంటే అయ్యో అని భావం. దీవాన్గీ యే షౌఖ్ అంటే ప్రేమ పిచ్చి. ప్రేమాతిశయం. హర్ దమ్ అంటే అనుక్షణం, ఈ పదానికి మరో అర్ధం ప్రతి ఊపిరిలో. ఇలాంటిదే మరో పదం ఏక్ దమ్ అంటే ఒక్కుదుటు అని అర్ధం. నిఘంటు ప్రకారం ఒక్కశ్వాసలో. దమ్ అంటే శ్వాస. హర్ దమ్ అంటే ప్రతిశ్వాసలో అని భావం. ఉధర్ అంటే ఆ వైపు. ఇక్కడ ఆమె వైపు అని భావం. హైరాం అంటే అయోమయానికి, గందరగోళానికి గురికావడం. ఈ కవిత భావాన్ని చూద్దాం. గాలిబ్ తన ప్రేమను వర్ణిస్తున్నాడు. ప్రేమలో పిచ్చివాడైపోయాడు. చివరకు తన ప్రేమపిచ్చి పట్ల తనకే అయ్యో అనిపిస్తోంది. ప్రేమపిచ్చిలో పడి అనుక్షణం ఆమె కోసం వెళుతున్నాడు. కనీసం ఒకసారి చూడాలని, అది సాధ్యం కాదని తెలిసి కూడా వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరరే ఇక్కడికి ఎందుకొచ్చాను అని అయోమయంలో పడిపోతున్నాడు. ఆమెను చూడడమైతే సాధ్యం కాదు. కాని ఏం చేస్తాడు, ప్రేమపిచ్చిలో పడ్డాడు కాబట్టి వేలసార్లు అక్కడికి వెళతాడు, మళ్ళీ నిరాశగా తిరిగివస్తాడు. ఈ కవితలో ప్రియుడి పరిస్థితిని వర్ణించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రేయసిని చూడ్డానికి ఆమె వీధిలో చక్కర్లు కొట్టడం మామూలే కదా. ఒక్కోసారి అదృష్టం కలిసొస్తే కనబడుతుంది లేకపోతే లేదు. ప్రేయసిని చూడాలన్నది ఒక అందమైన కల. ఆమె కనబడదన్నది వాస్తవం. కల వాస్తవాల్లో చిక్కుకుపోయిన పరిస్థితి. ఈ నిస్సహాయ పరిస్థితి చూసి అయ్యో అనకుండా ఎవరుంటారు? గాలిబ్ కూడా అదే అంటున్నాడు. తన నిస్సహాయస్థితి పట్ల అయ్యో అనుకుంటున్నాడు. ఇది కేవలం ప్రేమపిచ్చిలో పడిన వారి పరిస్థితి మాత్రమే కాదు, ఇలాంటి పిచ్చి ఇష్టం ఎవరి పట్ల అయినా ఉండవచ్చు. అభిమాన తారలను ఒక్కసారి చూడాలని పడిగాపులు పడేవాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వారిని చూసినప్పుడు కూడా అయ్యో అనిపించే జాలి మాత్రమే కలుగుతుందన్నది ఆలోచిస్తే గాలిబ్ కవితలో ఉన్న లోతు అర్ధమవుతుంది. గాలిబ్ ఇక్కడ తన ప్రేమపిచ్చిని గొప్పగా వర్ణించుకోవడం లేదు. ఈ పిచ్చి విషయంలో తనపై తానే జాలి పడుతున్నాడు. ఈ కవితలో గాలిబ్ వాడిన ’’హర్ దమ్‘‘ అన్న పదం గమనించదగ్గది. సాధారణంగా ఈ పదానికి అర్ధం అనుక్షణం. కాని దమ్ అంటే శ్వాస అని అర్ధం. హర్ దమ్ అంటే ప్రతిశ్వాస అని అర్ధం. ఇక్కడ ప్రతి శ్వాస అన్న భావం తీసుకుంటే, ఈ కవిత ఇష్క్ హకీకీ కవిత. ఉర్దూలో ప్రేమ అనేది రెండు తరగతులుగా విభజించవచ్చు. ఇష్క్ మజాజీ అంటే ప్రాపంచిక ప్రేమ. అంటే ఒక ప్రేయసి ఒక ప్రియుడికి మధ్య ఉండే ప్రేమ. ఇప్పటి వరకు ఈ కవితకు మనం అలాంటి కోణంలోనే భావం తెలుసుకున్నాం. కాని ఇష్క్ హకీకీ అంటే దైవం పట్ల ప్రేమ. అంటే నిజమైన ప్రేమ. ఇదే సూఫీతత్వం. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవితలో లోతయిన సూఫీతత్వం ఉందన్నారు. ప్రతిశ్వాస తీసుకుంటున్నప్పుడు నిత్యుడు, సృష్టికర్త అయిన దైవం వైపునకు పరుగెత్తి వెళుతున్నాడు. కాని దైవాన్ని చూడడం సాధ్యం కాదని తెలిసి అయోమయంగా వెనక్కి మళ్ళుతున్నాడు. దైవాన్ని చూడాలన్న కోరికతో వెళ్ళడాన్ని ఉచ్ఛాస్వగాను, చూడలేక నిస్సహాయంగా మరలడాన్ని నిశ్వాసగాను వర్ణించాడు. ఈ కల వాస్తవాల మధ్యనే బతుకుతున్నాడు. తీసుకున్న ఊపిరి పైకి పోతే మనిషి ఇహలోకాన్ని చాలిస్తాడు. ఆ తర్వాత దేవుడి ముందు జవాబు చెప్పుకునే పరలోకంలోకి ప్రవేశిస్తాడు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 5వ షేర్ జల్వా అజ్ బస్కే తఖాజాయె నిగా కర్తా హూం జోహరె ఆయినా భీ, చాహే హై మజగాం హోనా ఆమె అద్భుత రూపం అందరి దృష్టికి కేంద్రం అద్దంపై గీతలు కూడా కనురెప్పలై ఆమెను చూస్తున్నాయి ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. జల్వా అంటే వైభవం. అజ్ బస్కే అంటే అత్యధికంగా అని అర్ధం. తఖాజా అంటే డిమాండ్ అని అర్ధం. తఖాజాయే నిగా అంటే దృష్టి పడాలని డిమాండ్ చేయడం. జోహరె ఆయినా అంటే అద్దంపై ఉన్న గీతలు (scratches). పాతకాలంలో అద్దాలను చేత్తో పాలిష్ చేసేవారు. అందువల్ల అద్దంపై కొన్ని గీతలు ఉండేవి. అద్దాలు గాజుతో కాకుండా లోహంతో కూడా చేసేవారు. మజ్ గాం అంటే కనురెప్పకు ఉండే వెంట్రుకలు, రోమాలు ఇంగ్లీషులో eyelashes. ఈ కవితకు భావం చూద్దాం. గాలిబ్ ప్రేయసి సౌందర్యం వైభవోపేతమైంది. అందరి చూపులను తనవైపు తిప్పుకునే సౌందర్యం ఆమె స్వంతం. మరో విధంగా చెప్పాలంటే ఆమె సౌందర్యం అందరి చూపులను తనవైపు చూడాలని ఆదేశిస్తుంది. ఆ ఆదేశాన్ని అద్దంలోని గీతలు కూడా మన్నిస్తున్నాయి. అద్దానికి ఉన్న గీతలు కూడా eyelashes గా మారి ఆమెను చూస్తున్నాయి. ఈ కవితలో గాలిబ్ అద్దానికి కూడా ప్రాణం పోశాడు. ఆమె తన్ను తాను చూసుకోడానికి అద్దం వద్దకు వెళ్ళింది. కాని ఆమె సౌందర్యం అసాధారణమైనది. అందరి చూపులు తనవైపు తిప్పుకునే ఆ సౌందర్యం అద్దాన్ని కూడా తనవైపు చూసేలా చేసింది. అద్దం కూడా ఆమెను కళ్ళార్పకుండా చూస్తుంటే, అద్దంపై ఉన్న గీతలు కనురెప్పలపై రోమాలుగా మారిపోయాయి. ప్రేయసి సౌందర్యాన్ని ఇలా వర్ణించిన కవి మరొకరు ఎవరైనా ఉన్నారా? తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 6వ షేర్ ఇష్రతె ఖతల్ గయే అహ్లే తమన్నా మత్ పూచ్ ఈదె నజ్జారా హై, షంషీర్ కా ఉర్యాం హోనా వధ్యస్థలిలో ప్రియుడి సంతోషం గురించి అడక్కు నగ్నకరవాలం, పండుగ నాటి నెలవంకే అవుతుంది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఇష్రత్ అంటే సంతోషం, ఉత్సాహం వగైరా అర్ధాలున్నాయి. ఖతల్ గాహ్ అంటే వధ్యస్థలి. హతమయ్యే చోటు. అహ్లె తమన్నా అంటే ప్రేమించిన వారు. ఈద్ అంటే సంతోష సమయం. పండుగ. నజ్జారా అంటే దృశ్యం. షంషీర్ అంటే కరవాలం. ఉర్యాం అంటే నగ్నంగా అని అర్ధం. షంషీర్ కా ఉర్యాం హోనా అంటే ఒర నుంచి బయటకు దూసిన కరవాలం. నగ్నకరవాలం. ఈ కవితలో గాలిబ్ ఒక దృశ్యాన్ని వర్ణించాడు. ప్రేమపిచ్చిలో మునిగిపోయిన వారు చివరకు తమ ప్రేయసిని ఒక్కసారి చూడడానికి వధ్యస్థలికి కూడా చేరుకున్నారు. అంటే తమ ప్రాణాలు పోగొట్టుకునే ప్రదేశానికి కూడా వచ్చేశారు. అక్కడ చావు సమీపంలో, వధ్యస్థలిలో వారి సంతోషం గురించి అడగొద్దు, వారు చాలా ఉత్సాహంగా ఉన్నారంటున్నాడు. ఆమె చేతిలో హతమైన ఫర్వాలేదు, ఎందుకంటే అప్పుడు ఆమెను చాలా దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది కాబట్టి. ఆమె ఖడ్గాన్ని ఒర నుంచి పైకి లాగినప్పుడు వారికి ఆ కరవాలం పండుగ రోజున నెలవంకను చూసినంత సంతోషాన్నిస్తుంది. (రమజాన్ పండుగ నెలవంకను చూసిన తర్వాత ఉపవాసాలు విరమించి చేసుకుంటారు. నెలవంకను చూడడం అనేది మర్నాడు పండుగ ఉందన్న సంకేతం. కాబట్టి చాలా సంతోషకరమైన దృశ్యం). వధ్యాస్థలిలో ప్రియుడి సంతోషం ఎలా ఉంటుందో నన్నడక్కండి అంటున్నాడు గాలిబ్. అంటే అంత అతిశయించిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే పరిస్థితి. ఆమె చేతి కరవాలం వంపు పండుగ నెలవంకలా వారికి ఆనందాన్నిస్తుంది. చివరి శ్వాస వదిలే ముందు అతి దగ్గరగా చూసే అవకాశం వారికి లభించిందన్న సంతోషం పట్టశక్యం కానంత ఉంటుందంటున్నాడు. ఉర్దూ కవిత్వంలో ప్రతీకల వైవిధ్యం, కొన్ని అతిశయోక్తుల ప్రయోగం తెలుగులో కాస్త కొత్తగా ఉండవచ్చు. ఉర్దూ కవిత్వంలో ప్రతీకలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రేయసిని ఖాతిల్ (హంతకి) అని వర్ణించడం చాలా సాధారణం. ప్రేయసి కనుబొమలను కరవాలంగా పోల్చడమూ కనబడుతుంది. ఎందుకంటే వాటి పదునైన సౌందర్యం ప్రియుడి గుండెను ముక్కలు చేస్తుంది కాబట్టి. ప్రేయసి చూపులను చురకత్తులతో పోల్చడమూ సాధారణంగా కనిపిస్తుంది. గాలిబ్ ప్రత్యేకత ఏమంటే, కవితలో సూచనామాత్రంగా పదాలు ప్రయోగించడం వల్ల పాఠకులు తమ ఊహాశక్తికి పదును పెట్టి అక్కడ దృశ్యాన్ని అర్ధం చేసుకుంటారు. ఎవరి ఊహ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతగా దృశ్యం విస్తరిస్తుంది. గాలిబ్ పై కవితలో నగ్నకరవాలం పండుగ నెలవంకలా ఆనందాన్నిస్తుందని మాత్రమే చెప్పాడు. ఇక్కడ నగ్నకరవాలం అనేది ఆమె కనుబొమలకు అన్వయిస్తే, ఆమెను కలిసిన స్థలమే వధ్యస్ధలిగా మారిపోయింది. ఎందుకంటే అందమైన ఆ కనుబొమలు నగ్నకరవాలాలకు తక్కువ కాదు, అవి ప్రియుడి గుండెను ముక్కలుగా ఛేదిస్తున్నాయి. కాని వాటి మెరుపులు (అంటే కనుబొమల కదలికలు) చూస్తుంటే పండుగ నెలవంకను చూసినంత ఆనందంగా అనిపిస్తుంది. ఈ కవితలో గాలిబ్ ప్రేమికులను ఆశావాదుల సమూహంగా కూడా పిలిచాడు. అహ్లె తమన్నా అంటే ఈ అర్ధం కూడా చెప్పుకోవచ్చు. ఈ కవితలో చాలా అర్ధచ్ఛాయలున్నాయి. ఇక్కడ ఈ సమూహం ప్రేమికులదే కాదు, ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వారి సమూహం కూడా కావచ్చు. దేశం కోసం, జాతి కోసం నడుంకట్టిన వ్యక్తుల సమూహం కావచ్చు. ఇలాంటి వారికి తమ లక్ష్యమే అత్యంత ప్రియమైనది. ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి ఏమైనా చేస్తారు. దేశాన్ని కాపాడే సైనికులకు దేశరక్షణే అత్యంత ప్రియమైనది. ఆ లక్ష్యం కోసం యుద్ధరంగంలో నగ్నకరవాలాన్ని చూసి భయపడడు, పండుగ నెలవంకను చూసినంతగా సంతోషిస్తాడు. గాలిబ్ ఉపయోగించిన వథ్యాస్థలి అన్న పదం చాలా సందర్భాలకు అన్వయించే పదం. ప్రేమికుడికి ప్రేయసిని కలుసుకున్న ప్రదేశమే వథ్యాస్థలి అయితే, సైనికుడికి అత్యంత ప్రియతమమైన దేశరక్షణకు యుద్ధరంగమే వథ్యాస్థలి. అలాగే నిరుపేదలను ఆదుకునే లక్ష్యాన్నే ప్రేమించిన వారికి బీదసాదల కోసం పాటుపడడంలో ఎదురయ్యే కష్టనష్టాల నగ్నకరవాలం పండుగ నెలవంకే అవుతుంది. ఒక విస్తృతస్థాయి వివరణకు అవకాశమున్న కవిత ఇది. గజల్ ప్రత్యేకత ఇదే. ప్రతి రెండు పంక్తుల షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది. గజల్ లోని మిగిలిన షేర్లతో దానికి ప్రత్యక్ష సంబంధం ఒక్కోసారి ఉండకపోవచ్చు. అంతర్లీనంగా ఒక భావం అన్ని షేర్లను పూలదండలో దారంలా దాగుంటుంది. ఇది ఈరోజు గాలిబానా వచ్చే శుక్రవారం మరిన్ని గాలిబ్ కవితలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOtAV2

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి