పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మే 2014, శుక్రవారం

Abd Wahed కవిత

ఉర్దూ కవిత్వ నజరానాలో గత కొన్నివారాలుగా గాలిబ్ కవిత్వం గురించి తెలుసుకుంటున్నాం. ఈ రోజు గాలిబ్ 17వ గజల్ మొదటి షేర్లు చూద్దాం ఏక్ ఏక్ ఖతరేకా ముఝే దేనా పఢా హిసాబ్ ఖూనె జిగర్ వదియతె మజ్కానె యార్ థా ఒక్కో బొట్టుకు లెక్క చెప్పక తప్పలేదు గుండె నెత్తురు కనురెప్పకు చెల్లించక తప్పలేదు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. ఖతరా అంటే బొట్టు, చుక్క, బిందువు. హిసాబ్ అంటే లెక్క. వదియత్ అంటే అమానతు, ఇది కూడా ఉర్దూ పదమే. వదియత్ లేదా అమానత్ అంటే అర్ధం ఎవరైనా మనవద్ద ఏదన్నావస్తువు, లేదా సంపద దాచమని అప్పగిస్తే దాన్ని అమానత్ అంటారు. ఇచ్చిన వ్యక్తి అడిగిన వెంటనే దాన్ని తిరిగి అప్పగించవలసి ఉంటుంది. సంపద కావచ్చు, ధనం కావచ్చు, వస్తు సామాగ్రి కావచ్చు ఏమైనా కావచ్చు. ఎవరైనా నమ్మకంగా మనవద్ద ఉంచింది అమానత్ అవుతుంది. దాన్ని తిరిగి అడిగిన వెంటనే అప్పగించవలసి ఉంటుంది. అందుకే ఈ జీవితం దేవుడి అమానత్ అంటారు. అడిగిన వెంటనే మనం తిరిగి ఇవ్వక తప్పదు. మజ్కాన్ అంటే కనురెప్పలకు ఉండే వెంట్రుకలు, ఇంగ్లీషులో eyelashes. ఈ కవితలో మిగిలిన పదాలు సాధారణంగా వినబడే పదాలే. ఇప్పుడు కవిత భావం చూద్దాం. గాలిబ్ తన గుండెలోని నెత్తురంతా నిజానికి ప్రేయసి కనురెప్పలపై ఉన్న వెంట్రుకలు దాచుకున్న సంపద అంటున్నాడు. ఆమె ఇష్టమొచ్చినప్పుడు వాటిని తిరిగి తీసుకోవచ్చును. విరహబాధతో అతని కంటి నుంచి జారే కన్నీళ్ళు అలా వాపసు ఇస్తున్న లెక్కలే అంటున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే, కనురెప్పలపై ఉండే వెంట్రుకలు సాధారణంగా చాలా బిరుసుగా, మొనదేలినట్లు, చూడడానికి ముళ్ళ మాదిరిగా చిన్నవిగా ఉంటాయి. ప్రేయసి సౌందర్యానికి దాసుడైన ప్రియుడికి, ఆమె కనురెప్పలు అల్లార్చినప్పుడు ఆ కనురెప్పల వెంట్రుకలు గుండెల్లో దిగినట్లనిపిస్తుంది. ఆ ప్రేమగాయాల నుంచి స్రవించే నెత్తురే కంటి నుంచి జాలువారుతుందని చెప్పాడు. విరహబాధతో కంటి నుంచి కన్నీళ్ళు కాదు రక్తమే ప్రవహిస్తుంది, నిజానికది ప్రేయసి దాచుకున్నదే, ఆమె ఈ విధంగా తిరిగి తీసుకుంటోందని భావం. తర్వాతి కవిత గాలిబ్ సంకలనంలో 17వ గజల్ రెండవ షేర్ అబ్ మైం హూం ఔర్ మాతమె యక్ షహరె అర్జూ తోడా జో తూనే ఆయినా, తమ్సాల్ దార్ థా ఇక నేనున్నాను, అభిలాషల నగరాలున్నాయి ప్రతిబింబాలున్న అద్దాన్ని నువ్వు పగులగొట్టావు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. మాతమ్ అంటే విషాదం. షహరె అర్జూ అంటే కోరికలు, అభిలాషల పట్టణం అంటే లెక్కలేనన్ని కోరికలు ఆకాంక్షలు. ఆయినా అంటే అద్దం. తమ్సాల్ దార్ అంటే ప్రతిబింబం స్పష్టంగా కనబడేలా తయారు చేసింది. ఇక్కడ పగలగొట్టిన అద్దం స్వయంగా అతడి హృదయమే. తన హృదయాన్ని స్పష్టమైన ప్రతిబింబాలున్న అద్దంగా చెప్పాడు. కవిత భావం చూద్దాం. స్వచ్ఛమైన అద్దాన్ని నువ్వు పగలగొట్టావు. అందులో అనేక ప్రతిబింబాలు, నా అభిలాషల పట్టణాలు నివసిస్తున్న అద్దాన్ని నువ్వు పగలగొట్టావు. ఈ అద్దాన్ని పగులగొట్టడం ద్వారా నువ్వు అసంఖ్యాక అభిలాషలను హతమార్చావు. ఇప్పుడు ఏదీ మిగల్లేదు, కేవలం నా ఆకాంక్షల విషాదం, దుఃఖం, నేను, తప్ప మరేమీ మిగల్లేదు. ప్రేయసి తిరస్కారం వల్ల తన హృదయంలో జరిగిన విషాదాన్ని గాలిబ్ వర్ణించిన తీరు బహుశా మరెవ్వరు చెప్పలేదేమో. ఇప్పడు మూడవ కవిత చూద్దాం గలియోం మేం మేరీ నాష్ కో ఖీంచే ఫిరో కె మైం జాందాదా యే హవాయే సరె రహ్గుజార్ థా ఇక వీధుల్లో నా విగతకాయాన్ని లాగుతూ తిరుగు బతికినప్పుడు ప్రతివీధి మూల ప్రేమవాంఛనే నేను ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. గలీయోం అంటే వీధులు. నాష్ అంటే ప్రాణం లేని శరీరం, శవం. జాందాదా అంటే ప్రేమలో పడిన అని భావం. హవా అంటే వాంఛలు. జాందాదా యే హవా అంటే ప్రేమలో పడిన వాంఛలు అని చెప్పవచ్చు. సర్ అంటే తల అని అర్ధం. రహ్గుజర్ అంటే రహదారి. సరె రహ్గుజర్ అంటే వీధి మలుపు అని చెప్పవచ్చు. ఫార్శీ భాషలో రెండు పదాలను కలిపి సమాసం చేయడం తేలిక. ఈ పదాలన్నింటిని గాలిబ్ ఒకే సమాసంగా మార్చేశాడు. జాందాదా యే హవా యే సరె రహ్గుజర్ అంటూ అన్ని పదాలను కలపడం వల్ల ప్రతి వీధి మలుపులో ఉన్న ప్రేమవాంఛ అన్న భావం వస్తుంది. అంటే ప్రతి వీధి మలుపులో, ప్రతి వీధిలో ప్రేమలో పడిన పిచ్చివాడిగా తిరిగాడు. పార్శీ ప్రభావం వల్ల ఉర్దూలో కూడా పదాలను ఇలా అల్లడం తేలిక. అందువల్ల కవిత్వంలోను ఆ సౌలభ్యం లభిస్తుంది. ఈ కవిత భావం చూద్దాం. తాను బతికి ఉన్నప్పుడు వీధుల్లో తిరగడమంటే చాలా ఇష్టంగా ఉండేది. వీధుల్లో తిరగడాన్ని ఇష్టపడుతూనే చనిపోయాడు. ఇక దేహానికి అంత్యక్రియలు చేసేబదులు వీధుల్లో లాక్కువెళ్ళండి అంటున్నాడు. మరణించిన తర్వాత కూడా వీధుల్లో తిరగడమే తనకు ఇష్టమని చెబుతున్నాడు. ఏదో ఒక జైలు లాంటి సమాధిలో ఉంచవద్దని, అలా చేయడం తన స్వేచ్ఛను కోల్పోవడమే అంటున్నాడు. పై రెండు కవితలకు ఈ కవితకు పైకి సంబంధం లేనట్లే కనిపిస్తుంది. పై రెండు కవితలు ప్రేయసి, ప్రేమ, విరహం గురించి చెప్పాడు. మూడవ కవితలో వీధుల్లో తిరగడాన్నే తాను ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. ప్రతివీధి మలుపు వద్ద ప్రేమవాంఛగా నిలిచాడు. మరణించిన తర్వాత కూడా అలాగే తన దేహాన్ని వీధుల్లో లాక్కు వెళ్ళాలని చెప్పడం ద్వారా తాను బతికి ఉన్నప్పుడు ఏ ప్రేమవీధుల్లో తిరిగాడో అవే వీధుల్లో మరణించిన తర్వాత కూడా తిరుగుతానని పరోక్షంగా చెబుతున్నాడు. ఇప్పుడు ఇదే గజల్లో 4వ షేర్ చూద్దాం మోజె సరాబె దస్తె వఫా కా న పూఛ్ హాల్ హర్ జర్ర మిసలె జోహరె తీగ్ అబ్దార్ థా ప్రేమ ఎడారిలో ఎండమావుల కెరటాల గురించి అడగకు ప్రతి రేణువు పదునుతో మెరుస్తున్న కరవాలంలా ఉంది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. మోజ్ అంటే అల. సరాబ్ అంటే ఎండమావి. దస్త అంటే ఎడారి. వఫా అంటే ప్రేమ లేదా ప్రేమలోని నిబద్దత. జర్ర అంటే రేణువు. మిసల్ అంటే పోలిక. జోహర్ అంటే మెరుస్తున్న అని ఇక్కడ భావం. తీగ్ అంటే కరవాలం. అబ్దార్ అంటే పదునైన. ఈ పదాలను కలపి పదబంధాలు రూపొందించడం ద్వరా చక్కని కవితను అల్లాడు ఈ కవిత భావం చూద్దాం. గాలిబ్ తన ప్రేమ గురించి అడిగిన వారికి చెబుతున్నాడు. మిత్రులారా, నా ప్రేమ ఎడారి పరిస్థితి ఎలా ఉందని అడగొద్దు. అందులో ఎండమావుల కెరటాల గురించి అడగవద్దు. ప్రేమలో అంకితభావం, నిబద్దత అనేవి ఎండమావుల వంటివి, ఎండమావిలో నీరు, పచ్చదనం ఎలా కనబడుతుందో ప్రేమ ఎడారిలోని ఈ ఎండమావుల అలలు కూడా అలాంటివే. వాటిని వెదుక్కుంటూ తిరగడమే. ఎడారిలో దప్పికతో అలమటించే వాడికి ఎండమావిలో నీరు దొరకదు. ఎండమావి వెనుక నడుస్తూ చివరకు ప్రాణాలు కోల్పోతాడు. ప్రేమ ఎడారిలోను ఇదే పరిస్థితి. ప్రేమ ఎడారిలో పరిస్థితి చెప్పాలంటే, ఇక్కడ ప్రతి ఒక్క ఎండమావిలోని ఇసుక రేణువు పదునుతో మెరుస్తున్న కరవాలం వంటిది. ఇలాంటి ఎడారిలాంటి ప్రేమలో ఎవరు అడుగుపెట్టగలడు? కాబట్టి, క్షేమంగా ఉండాలంటే దీనికి దూరంగా ఉండడమే మంచిది. ఎడారిలోని ఇసుక తిన్నెలను సముద్రంలో కెరటాలతో పోల్చడం, ఆ రెండింటిని భగ్న ప్రేమికుడి మనోభావాలతో పోల్చడానికి గాలిబ్ ఎంచుకున్న పదాలు అద్భుతమైనవి. ఈ గజల్ యావత్తు భగ్న ప్రేమ, విరహాలను అతిశయోక్తులతో వర్ణించాడు. ఇప్పుడు ఈ గజల్లోని 5వ షేర్ చూద్దాం కమ్ జాన్తేథే హమ్ భీ గమె ఇష్క్ కో, పర్ అబ్ దేఖా, తో కమ్ హుయే పే, గమె రోజ్గార్ థా ప్రేమబాధ గురించి తెలియలేదు, కాని ఇప్పుడు చూశాను, ఆ బాధ తగ్గితే, ఉపాధి బాధలు చుట్టుముట్టాయి ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. గమ్ అంటే బాధ, దుఃఖం. ఇష్క్ అంటే ప్రేమ. గమే ఇష్క్ అంటే ప్రేమ బాధ. రోజ్గార్ అంటే ఉపాధి లేదా నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు. గమె రోజ్గార్ అంటే నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యల బాధ అని భావం. ఈ కవిత భావం చూద్దాం. గాలిబ్ తెలియక ప్రేమలో పడ్డాడు. ప్రేమ బాధ గురించి తెలియదు. ఆ బాధ గురించి తెలుసుకుని దానికి దూరమయ్యే ప్రయత్నం చేస్తే నిత్యజీవిత వ్యవహారాలు, ఉపాధి బతుకుదెరువు సమస్యలు చుట్టుముట్టాయి. అంటే సమస్యలు, బాధలు లేకుండా స్వేచ్ఛగా ఉన్నదే లేదు. అయితే, మిగిలిన బాధలేవయినా కాని ప్రేమబాధ ముందు దిగదుడుపే. ఇక్కడ గాలిబ్ ఉర్దూలో చెప్పిన చమత్కారం ఏమంటే, ఒకవేళ ప్రేమబాధలో నేను మునిగిపోకుండా ఉన్నట్లయితే ఈ ప్రాపంచిక వ్యవహారాలు, బతుకుదెరువు బాధల్లో కొట్టుకుపోయేవాడిని. ఈ బాధల నుంచి ప్రేమబాధ నన్ను రక్షించింది. అంటే వందలు, వేల ప్రాపంచి బాధల్లో కొట్టుకుపోవడం కన్నా ఒకే ఒక్క ప్రేమబాధే మంచిది. ఎలాగూ బాధ తప్పనప్పుడు, ఒకేఒక్క అందమైన బాధను భరించడం మంచిది కదా. ఈ గజల్ మొదటి నుంచి కూడా అంతర్గతంగా ఒక భావాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తోంది. ఏకాగ్రతతో, ఒకే లక్ష్యంతో పనిచేస్తే, అది ప్రేమ కాని, మరో విషయంలో కాని మనిషికి ప్రపంచంలో మరేదీ పట్టదు. మరే బాధను అతను పట్టించుకోడు. కాని మనిషి తన లక్ష్యాన్ని మరిచిపోతే లేదా వదిలేస్తే అతడిని శూన్యం ఆవహిస్తుంది. ఆ శూన్యంలో అనేకానేక సమస్యలు, విషాదాలు, బాధలు చొచ్చుకువస్తాయి. ఇది ఈ రోజు గాలిబానా. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1maouRL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి