పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఏప్రిల్ 2014, బుధవారం

Nirmalarani Thota కవిత

మంచు దుప్పటి కప్పుకొని మగత నిద్రలోకి జారి ఒళ్ళు విరిచి ఆవులింతల ఆకుల్ని రాల్చి పక్కకు ఒత్తిగిలి మళ్ళీ మాగన్నుగా కునుకు తీస్తూ తన కాళ్ళ కింద మొలచిన గడ్డి పువ్వు పరవశం సోకితే స్వాప్నిక జగత్తు నుండి తుళ్ళి పడి నిదుర లేచిన ప్రకృతి ! నవ నవోన్మేషపు పత్ర హరితాల పరవశాల జాతర ! యాంత్రిక జీవన స్రవంతిలో కొట్టుకు పోతూ కూడా సున్నితత్వపు స్పర్శ సడలని కవి మనస్సులా కాకి గూట్లో పొదిగినా మార్దవం వీడని కోకిలల కుహూ కూజితాల రాగ రంజితాలు ! సంధ్య వారగానే సమ్మోహనాల పరిమళంతో తనువును, ఎదనూ మత్తెక్కించే మల్లెల సౌరభాల సోయగాలు ! అదిరే లేలేత చివుళ్ళ కెంపైన పెదవులతో తరుణం వచ్చేసిందని తన్మయాన తరువు తరుణులు ! అరవిచ్చిన కంజాత దళాక్షుల కాంక్షా సమ్మిళిత శోభిత దృక్కుల్లా నును సిగ్గుతో కందిపోయిన కన్నెపిల్లల బుగ్గల్లా అక్కడక్కడా మోహరించిన కెంజాయ వన్నె గుల్ మొహార్లు ! ధరణీ కాంత చిలక పచ్చ చీరె సింగారించుకొని తన ఒడిలొని పసి కూనలకు పురిట్లోనే జీవన సారమంతా రంగరిస్తూ ఉగ్గు పాలతో ఉద్వేగాల చేదును దిగమింగే అత్మీయతా, ఆత్మ విశ్వాసం మేళవించిన తీపిని పంచుతూ ఎదురొచ్చే సవాళ్ళ కారాలను మమకారాల్తో జయిస్తూ చీకూ చింతా లేని చిన్నారుల అల్లరి చింతల పులుపులతో ఆలుమగల అలకల కులుకుల వగరుతో షడృచుల ఆస్వాదనకు సమాయత్తం చేస్తూ . . చివుళ్ళు మేసిన చైత్ర కోయిలలు చిరుగాలి సన్నాయి మైత్రి పిలుపులు కొమ్మ పాటల ఊసుల ఊయలలు కొంగొత్త ఆశల విరుల లాహిరులు . . ఒక్కసారిగా ఈ చిత్తరువును కనురెప్పల గుండెల్లో బంధిస్తే . . ఓహ్ . . ! మనసంతా విచ్చిన వసంతం ! బ్రతుకంతా పరుచుకున్న పచ్చదనం ! { కవి మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు . . ! } నిర్మలారాణి తోట [ తేది: 31.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSPa4C

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి