పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Kavi Yakoob కవిత

తప్పక మళ్ళీ ఎగురుతాం. .................................... ["ఒక్కోసారి జీవితంలో మనం వెళ్లేదారి మనని విజయం దాకా తీసుకు వెళ్తుందని కచ్చితంగా చెప్పలేం. కానీ హటాత్తుగా ,ఎక్కడినుంచో మీకొక చిన్న సూచన దొరుకుతుంది. మీరు సరైన దారినే ముందుకు సాగుతున్నారని అది మీకు సూచిస్తుంది '' -Jim Stovall, 'The Ultimate Gift' .] # గాలిలో తేలుతూ రెండు పక్షి ఈకలు వాకిట్లోకి వచ్చాయి. వాటి రెపరెపల చప్పుడులో ఇప్పటిదాకా ఎగిరిన విహారమంతా కనిపిస్తోంది. గూళ్ళలో పొదువుకున్న తల్లిరెక్కల వేడి జ్ఞాపకపు వాసన. కాళ్ళకు అంటుకున్న చెట్లకొమ్మల మీది వగరు. ఆకులమీంచి ఎగిరిన గోళ్ళపై అంటిన పసరు కమ్మదనం. అంతకుమించి వియోగంలోని దు:ఖం. ఎండల్లో వానల్లో గడ్డకట్టించిన చలిలో ప్రాణాలు దక్కించుకుని ఆకాశమై విస్తరించిన పయనం. ముక్కున కరుచుకుని గూటి గూటికి మార్చిన తల్లి మమకారం. డేగ కాళ్లకు చిక్కనంత ,పాము నోటికి అందనంత రక్షణకవచమై కాపాడిన అమ్మతనం. పక్షి ఈకల్లో ప్రవహిస్తున్న జీవితం. రాలుతున్న జ్ఞాపకాల వాసన. ఒక్కోసారి తమలోకి తామే ముడుచుకుపోతూ ,కొంచెం కొంచెంగా కదులుతూ గుసగుసలుగా సంభాషణ. 'ఎక్కడ ఉన్నాం' 'వెనక్కి వెళ్లి మళ్ళీ ఎక్కడ అతికించుకుందాం' 'ఏ ఆకుల కొమ్మల్లో గూడులమై విశ్రమిద్దాం' 'ఏ రెక్కల కుదురుల్లో ఎగిసే గాలులమై ఊపిరి పోసుకుందాం' ' రెక్కలకష్టం తెలిసిన వాళ్ళం .' ' దు:ఖపు అర్థం విడమరిచి చూసినవాళ్ళం ' ' ఆకలిదప్పుల అంతరార్థం మనకంటే ఇంకెవరికి తెలుసు ' ' కన్నీళ్లను ,కష్టాలను సరాసరి మనమే అనుభవించాం. ' 'జీవితాన్ని చెత్తకుప్పలోంచో, మురికి ఇంటి ముంగిటిలోంచో ,బీదతనపు కరుకుతనంలోంచో మొదలుపెట్టినవాళ్ళం. రెడీమేడ్ భద్ర కుటుంబాల ధైర్యమేదీ అసలే లేదు. అంతకుమించి వంశపారంపర్యపు అతిశయం అంతకన్నా లేదు. అట్టడుగునుంచి అందిపుచ్చుకున్న వారసత్వపుబలం మనలోనే దాగిఉంది.' 'ఇప్పుడిక్కడ పడ్డాం. తప్పక మళ్ళీ ఎగురుతాం. ఇవాళ రెక్కలు మనతో లేకపోవచ్చు. జీవితపు అనుభవం మన ఆస్తి. మన బలం. ఎగురుదాం. తప్పక -ఎగురుతాం !! ' *** వాటి రెపరెపల చప్పుడులో ఇప్పటిదాకా ఎగిరిన విహాయసమంతా వినిపిస్తోంది విశ్వాసం ధ్వనిస్తోంది.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lMjJfK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి