పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Abd Wahed కవిత

ఉర్దూ కవిత్వ నజరానాలో ఈ వారం గాలిబ్ సంకలనంలోని 15వ గజల్లోని మిగిలిన షేర్లు చూద్దాం. గత వారం మొదటి మూడు షేర్ల భవార్ధాలు తెలుసుకున్నాం. ఈ కవితల్లో గాలిబ్ తన దుస్థితిని తన ప్రేయసి విలాసభరిత జీవితంతో పోల్చుతూ, ప్రేయసి ప్రియుడి పరిస్థితికి జాలిపడడం లేదు సరికదా తన లోకంలో తాను హాయిగా గడుపుతుంది. నిజానికి ఈ భావాలను చాలా మంది కవులు, ముఖ్యంగా ఉర్దూ కవులు రాశారు. అయితే గాలిబ్ వ్యక్తీకరణలో ఈ కవితలు ఇతర సందర్భాలకు కూడా అతికినట్లు సరిపోతాయి. ఇప్పుడు 4వ షేర్ చూద్దాం. జల్వ యె గుల్ నే కియా థా, వాం చిరాగాం ఆబె జూ యాం రవాం మిఝ్గానె చష్మ్ తర్ సే ఖూనె నాబ్ థా అక్కడ గులాబీల కాంతికి ఏటినీరు ఎరుపైంది ఇక్కడ రక్తాశ్రు కనురెప్పపై గులాబీ ఎరుపైంది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. జల్వా అంటే ప్రకాశం, తేజం. చిరాగాం అంటే మెరుస్తున్న అని అర్ధం. ఆబ్ జూ అంటే సెలయేరు. మిజ్గాం అంటే కనురెప్పలపై వెంట్రుకలు, eyelashes. చష్మ్ తర్ అంటే తడిసిన కన్నులు. ఖూనె నాబ్ అంటే స్వచ్ఛమైన నెత్తురు. గుల్ అంటే పువ్వు, ఇక్కడ ఎర్ర గులాబీగా అర్ధం చేసుకోవచ్చు. ఈ కవితకు భావం చూద్దాం. ప్రేయసి తోటలో ఉంది. అక్కడ ఎర్రని గులాబీ పూలు సెలయేటిలో తొంగి చూస్తున్నట్లు వాలడం వల్ల వాటి కాంతి ప్రతిఫలించి ఏటి నీరు ఎర్రగా ప్రకాశిస్తోంది. ఇక్కడ విరహబాధతో కళ్ళు రక్తాశ్రువులతో నిండిపోయాయి. కనురెప్పలపై ఉన్న వెంట్రుకల్లో కన్నీటి బిందువులు ఎర్రగులాబీలయ్యాయి. ప్రియుడు, ప్రేయసి అన్న పదాలను తొలగించి ఈ కవితను చదివితే వివిధ సందర్భాలకు కోట్ చేయగల కవితగా కనబడుతుంది. ఎంతగానో అభిమానించే వారి కోసం, ప్రేమించే వారి కోసం పరితపిస్తున్న వారి బాధ ఒకవైపు, ఆ ప్రేమను, అభిమానాన్ని అర్ధం చేసుకోకుండా తమ లోకంలో తాము బతికేస్తున్న వారి వైఖరి ఇంకో వైపు కనబడతాయి. గాలిబ్ ఇలాంటి సన్నివేశాన్ని వర్ణిస్తూ అక్కడా, ఇక్కడా రెండు చోట్ల ప్రవాహమే ఉంది. అక్కడ గులాబీల కాంతితో ఎరుపెక్కిన ప్రవాహం. ఇక్కడ ఎర్రని నెత్తుటి బిందువులే గులాబీలుగా కన్నీటిని ఎరుపెక్కిస్తున్న ప్రవాహం. ఇదే గజల్లో 5వ షేర్ చూద్దాం యాం సరె పుర్ షోర్ బే ఖాబీసే థా దీవార్ జో వాం వో ఫర్కె నాజ్ మహవె బాలీషె కమ్ ఖ్వాబ్ థా ఇక్కడ విరహవేదనతో నిద్రరాని తల గోడను వెదుకుతుంది అక్కడ రూపగర్వంతో మత్తెక్కిన తల మెత్తని తలగడపై ఉంది ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం : సరె పుర్ షోర్ అంటే భరించరాని వేదనతో ఉన్న శిరస్సు. బేఖ్వాబ్ అంటే నిద్రలేమి. దీవార్ జూ అంటే గోడను వెదకడం, అంటే అర్ధం భరించరాని వేదనతో తల గోడకేసి కొట్టుకోవాలనుకోవడం. ఫర్కెనాజ్ అంటే గర్వంతో కూడిన. మహూ అంటే నిమగ్నమైన, తలమునకలైన, బాలిష్ అంటే తలగడ, కంఖ్వాబ్ అంటే ఎంబ్రాయిడరీ చేసిన మెత్తని సిల్కుతో తయారైన తలగడ. ఇక్కడ కూడా గాలిబ్ అక్కడ ఆమె ఎలా ఉందో ఇక్కడ తానెలా ఉన్నాడో చెబుతున్నాడు. ఇక్కడ తాను విరహవేదనతో నిద్రరాక తలపగులగొట్టుకోవాలని గోడను వెదుకుతుంటే, అక్కడ ఆమె రూపగర్వంతో మత్తెక్కి మెత్తని సిల్కు తలగడపై తలవాల్చింది. ఈ కవితలో కూడా ప్రేయసి, ప్రియుడు అన్న పదాలను తొలగించి చూస్తే వివిధ సందర్భాలకు కోట్ చేయదగిన కవితగా కనబడుతుంది. తర్వాతి కవిత ఇదే గజల్లో 6వ షేర్ యాం నఫ్స్ కరతాథా రోషన్, షమె బజ్మె బే ఖుదీ జల్వా యే గుల్, వాం, బిసాతె సోహ్బతె అహ్బాబ్ థా ఇక్కడ నా నిట్టూర్పులే దీపాలను ముట్టిస్తున్నాయి అక్కడ సుమదళాలే మిత్రమండలికి పాన్పులయ్యాయి ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. నఫ్స్ అంటే నిట్టూర్పు అని ఇక్కడ భావం. షమా యే బజ్మ్ అంటే గోష్ఠిలోని దీపం. బేఖుదీ అంటే absent minded. జల్వా యే గుల్ అంటే పూల ప్రకాశం. బిసాత్ అంటే పడక. అహ్బాబ్ అంటే మిత్రులు. సొహ్బత్ అంటే వారి సాన్నిహిత్యం లేదా వారి గోష్ఠి. ఈ కవితలో కూడా రెండు చోట్ల ఉన్న పరిస్థితినే వర్ణించాడు. ఇక్కడ నిట్టూర్పుల వేడితోనే దీపాలు వెలుగుతున్నాయి. షమాయే బజ్మె బే ఖుదీ అంటున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలియని, తెలివిలేని absent minded గోష్ఠిలో దీపాన్ని ఆయన నిట్టూర్పు వెలిగిస్తోంది. కాని అక్కడ మిత్రమండలి గోష్ఠిలో ఆమె విలాసంగా కూర్చుని ఉంది. మిత్రమండలికి పూలరెక్కల ప్రకాశమే కూర్చోడానికి అవసరమైన పాన్పు పరిచింది. ఈ కవిత కూడా అనేక సందర్భాల్లో కోట్ చేయగలిగిన కవిత. తర్వాతి కవిత ఇదే గజల్లో 7వ షేర్ ఫర్ష్ సే థా అర్ష్, వాం, తూఫాంథా మౌజె రంగ్ కా యాం జమీ సే ఆస్మాం తక్, సోక్తన్ కా బాబ్ థా అక్కడ భూమ్యాకాశాల మధ్య తూఫానులా రంగులే ఇక్కడ భూమ్యాకాశాల మధ్య నా కథలో మంటలే ఉర్దూ పదాలు చూద్దాం. ఫర్ష్ అంటే భూమి, అర్ష్ అంటే ఆకాశం. మౌజె రంగ్ అంటే రంగుల కెరటం. తుఫాం అంటే తుపాను. సోక్తన్ అంటే దహనం. బాబ్ అంటే అధ్యాయం. ఇక్కడ కూడా రెండు ప్రదేశాల పరిస్థితిని వర్ణిస్తున్నాడు. అక్కడ భూమ్యాకాశాల మధ్య పలువర్ణాలు, రంగురంగుల కెరటాల తుఫానుంది. అంటే అక్కడ ఉల్లాసం, హుషారు, సంతోషాలున్నాయి. ఇక్కడ భూమ్యాకాశాల మధ్య గాలిబ్ కథలోని ’’దహనం‘‘ అనే అధ్యాయం ఉంది. అంటే గాలిబ్ తన కథలో ’’దహనం‘‘ అనే అద్యాయంలోని మంటలు భూమ్యాకాశాల మధ్య విస్తరించాయని, తన పరిస్థితి అంత వేదనాభరితంగా ఉందని చెబుతున్నాడు. ఇక్కడ రెండు ప్రదేశాల మధ్య పోలికల్లో తేడా చూపించాడు. అక్కడ రంగు రంగు కెరటాల తుఫానుంది. ఇక్కడ పెనుమంటలున్నాయి. ఆ మంటలు ఆయన కథలోని ’’దహనం‘‘ అనే అధ్యాయంలోనివి. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే, అక్కడి తుఫాను గాలికి ఇక్కడి దహనం మరింత తీవ్రమవుతుంది. ఈ కవిత కూడా అనేక సందర్భాల్లో అన్వయించుకోగలిగిన కవిత. తర్వాతి కవిత ఇదే గజల్లో 8వ షేర్ నాగహాం, ఇస్ రంగ్ సే ఖూంనాబా టప్కానే లగా దిల్కే జౌఖె కావిషే నాఖూంసే లజ్జత్యాబ్ థా ఈ విధంగా వేదనలు ద్రవిస్తున్నాయి గాయాలపై గోళ్ళు నర్తిస్తున్నాయి ఈ కవితను తెలుగులో కాస్త స్వేచ్ఛగా అనువదించాను. ఉర్దూ పదాల అర్ధాలు చూస్తే మీరు ఒరిజినల్ కవిత భావం గ్రహించగలరు. నాగహాం అంటే యాధృచ్చికంగా లేదా అకస్మాత్తుగా అని అర్ధం. ఇస్ రంగ్ సే అంటే ఈ విధంగా. ఖూం నాబా అంటే స్వచ్ఛమైన నెత్తురు. టపక్నా అంటే బొట్లు బొట్లుగా రాలడం. టప్కానె లగా అంటే రాల్చడం మొదలుపెట్టింది అని అర్ధం. అంటే మొదటి పంక్తికి అర్ధం ’’యాధృచ్చికంగా, ఈ విధంగా (నా కళ్ళు) రక్తాశ్రువులు రాల్చుతున్నాయి.‘‘ అని భావం. ఇక్కడ ఈవిధంగా అన్న పదాలు గజల్లో ఇంతకు ముందు వచ్చిన కవితలను సూచిస్తూ బాధాకరమైన పరిస్థితిని వర్ణించిన రక్తాశ్రువులుగా అర్ధం చెప్పుకోవాలి. రెండవ పంక్తిలో దిల్ అంటే హృదయం, జౌఖ్ అంటే తపన, ఆకాంక్ష, కావిష్ అంటే శ్రమ, కావిషె నాఖూం అంటే గోళ్ళ శ్రమ. లజ్జత్ అంటే రుచి, లజ్జత్యాబ్ అంటే రుచిని ఆస్వాదించడం. కాబట్టి రెండవ పంక్తికి భావం ’’గుండెలోని ఆకాంక్ష గోళ్ళను శ్రమపెట్టి సాంత్వను లేదా రుచిని ఆస్వాదిస్తోంది‘‘. గాయాన్ని గోరుతో గోకడం వల్ల అది మానదు, మరింత పచ్చిగా మారుతుంది. అదేవిధంగా గాలిబ్ తన బాధల గాయాలను గోళ్ళతో మాననివ్వకుండా చేయడం ద్వారా సాంత్వన పొందుతున్నానని చెబుతున్నాడు. గజల్లోని పై కవితలన్నీ అలా చేసిన ప్రయత్నాలే అన్న భావం ఈ కవితలో ఉంది. ఈ కవితలో చివరి పంక్తి గమనించదగ్గది. గుండెలోని కోరిక గోళ్ళశ్రమతో తీరుతుంది అన్న పంక్తి (దిల్కే జౌఖె కావిషే నాఖూంసే లజ్జత్యాబ్ థా)... అనేక సందర్భాల్లో అన్వయించే చాలా బలమైన పంక్తి. ఇది ఈ వారం గాలిబానా. వచ్చే వారం మరిన్ని గాలిబ్ కవితలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gUV05Q

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి