పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, మార్చి 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 21 (కవిసంగమం) ____________________________ "మట్టి రాతలు"(కవిత్వం ) రాసినది :- డా:కత్తిమండ ప్రతాప్ పరిచయం చేస్తున్నది:- రాజారామ్.టి " చెరిగిపోని రాతల సంతక కవిత్వం మట్టి రాతలు" "అస్పృశ్యుడు ఈ లోకంలోనే సంచరిస్తున్నాడు నిత్య నయవంచనకు లోనవుతు నలుగురి మధ్య నల్లగా నలిగిపోతూ బతుకు చితికి పోతూ అతుకుల బతుకులతో మెతుకుల కోసంఅన్వేషిస్తూ..." ఇలా తమ బ్రతుకులను ఎర్రగా పండించుకోడానికి అగ్ర వర్ణం దళిత వర్ణాన్ని సున్నంగా వాడుకొంటున్న వైనాన్ని తన కవిత్వంతో బట్టబయలు చేసే యత్నం చేస్తున్నవాడు కత్తిమండ ప్రతాప్. "అక్షరాలు పరిగెడుతున్నాయి ఆవేశంగా భాష దాటి భావాల కోసం భావోద్వేగాల కోసం" అంటూ కవిత్వం ఫిరంగి అయితే మాటలు తూటాలైతే నా చేతులు ట్రిగ్గర్ మీదే వుంటాయంటూ సమాజ డురంతాల మీద తుపాకీ ఎక్కుపెట్టిన వాడు కత్తిమండ ప్రతాప్. 'నేను పనుల్లో శ్రమల్లో స్వేదంలో నిత్యం తడుస్తాను" అని చెబుతూ వ్యవస్థ గుండె గాయాలను మాన్పడం కోసం పాదాలకు ఎన్ని గాయాలైనా నిత్యాన్వేషిగా వెతుకులాట బాటలోనే పయనిస్తానంటున్న వాడు కత్తిమండ ప్రతాప్. ప్రతాప్ కవిత్వం పాఠకులకు పరవశాన్ని ఇవ్వకపోవచ్చు కానీ,చదివేవారి గుండెల్లో ఆలోచనా అలల అలజడిని రేకెత్తిస్తుంది.మండే మేధస్సుల్లోంచి ఆవేశం ఉరికురికి వచ్చేటట్లు చేస్తుంది.ఆ ఆవేశంలోంచి ప్రశ్నల పరంపరను దుర్మార్గ సమాజంపై సంధింపజేస్తుంది. ఇంతకన్నా వేరే ప్రయోజనం కవిత్వానికీ అవసరం లేదనుకోవచ్చు.గొప్ప ఊహలతో,అందమైన భావ చిత్రాలతో,కొత్తకొత్త సాదృశ్యాలతో,మనోహర భావవ్యంజకమైన విశేషాలతో కవిత్వం వుండాలని కొందరి కోరిక.కదిలించేది కవిత్వమైనప్పుడు ప్రతాప్ రాసింది కవిత్వమే.అనవసరంగా ఆలంకారించకుండా,ప్రాసతో పనిలేకపోయినా,ప్రయాసపడుతూ ప్రాసను ప్రయోగించకుండా,హృదయం ఎట్లా కంపిస్తే అట్లా తన హృదయ కంపనలను "మట్టి రాతలు" చేశాడు ప్రతాప్. కవి లేదా కవయిత్రి పాత్రను తనపై ఆరోపించుకొని ఆత్మాశ్రయ ధోరణిలో కవిత్వం రాయడం చేస్తుంటారు.ఈ కవి కూడ "మట్టి రాతలు" అనే ఈ సంపుటిలో ఎక్కువగా "నేను" అనే కవితల్ని రాశాడు.పాత్రను తనపై ఆరోపించుకోకుండా వొక అబ్జర్వర్ గా కవిత్వాన్ని చిత్రించిన కవితలు అరుదు. "కాల గర్భంలో కలసిపోతున్న కన్నీటి గాథలను చూడలేనని కాబోలు అంధకారంలో స్వేచ్ఛగా విహరించమని అంధుడను చేశావు" (ఆత్మ విశ్వాసం)1 'నా ఙ్ఞాపకాలను స్కానింగ్ చేస్తున్నా గతాలను చితి చేసేద్దామని "(ఙ్ఞాపకాల స్కానింగ్)2 ఒక రాత్రి సమాధిలో నుండి బయటకు వచ్చి చూశా మోసాల లోకంలో పాపాల చూడలేక ఒక క్షణం వుండలేక మళ్లీ నా సమాధి స్వేచ్ఛా లోకంలోకి పారిపోయా (సమాధిలో నేను)3 ఇలా చాల కవితల్లో(1,2,3) కవి పాత్రను తనపై ఆరోపించుకొని కవిత్వం చెప్పాడు. మనిషికి వుండాల్సింది విశ్వాసమే అయినా ఆత్మవిశ్వాసం వుంటే మనిషి మరింత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు.అలాంటి ఆత్మవిశ్వాసం వికలాంగులు ప్రోది చేసుకోవాల్సిన అవసరాన్ని కవితా సంపుటి ఆరంభంలోనే కవిత్వం చేసి తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకొన్నాడు.కళ్లు లేని తనం, కాళ్లు లేని తనం ,చేతులు లేని తనం ఇవన్నీ కలిగి వుండటం వల్లనే సమాజంలోని దురంతాలను చూడకుండా వున్నానని,సమాజంలోని ముళ్ల పొదల బాటలు దాటాల్సిన అవసరం లేకుండా పోయిందని,పాపాలు చేయకుండా వుండిపోయానని కవి "ఆత్మ విశ్వాసం"-అనే కవితలో పాజిటివ్ గా ఆలోచింప జేస్తూ,అంగాల లేమిని తన భావాలతో సమర్థన చేసుకోవడమే కాక "ఆత్మ విశ్వాసం వెయ్యి ఏనుగుల బలంతో గెలిచింది"-అంటూ అత్మ విశ్వాసానికి ఎవరెస్ట్ హోదాని ఈ కవితలో కలుగచేశాడు. "మట్టి నెర్రల మధ్య చర్మపు ఛాయలు ఇంకా కనిపిస్తున్నాయి వెంటాడే ఙ్ఞాపకాల నీడల్లా" (కుబుసం)4 ఈకవితా పాదాల్లో(4)కవి నెర్రలు పోవడం అనే లక్షణం మట్టికీ,చర్మానికీ వుండటం అనే అంశాన్ని గుర్తు చేస్తూ,వొక మంచి సాదృశ్యాన్ని సాధించడమే కాక తన పాత ఙ్ఞాపకాలను పాము కుబుసం విడిచినట్టుగా మనసు వదిలివేసుకోవాలనుకుంటున్నదని మనసులోని ఘర్షణని వొక మంచి పోలికలతో వ్యక్తం చేస్తాడు. "కొవ్వొత్తి (లా)ని నేను నిత్యం అగ్నికి ఆహుతి అవుతాను కన్నీటి ధారనై జారిపోతాను"(కరగి పోయే జీవితం)5 పై కవితలో(5) అందరు కవుల్లాగానే కొవ్వొత్తిని త్యాగానికి ప్రతీకాగా చేసినప్పటికీ "కన్నీటి ధారనై జారిపోతాను"-అని అనటం ద్వారా వొక కొత్త అభివ్యక్తిని కవి సాధించాడు.కొవ్వొత్తి కరిగే టప్పుడు కారే మైనపు ద్రవాన్ని కన్నిటితో పోల్చి ఆ కొవ్వొత్తికి మానవత్వ లక్షణం ఆరోపించి కవితకు కొత్త రూపును సాధించాడు. పదాలతో ఆడుకోవటం,వాటిని వీనులకు ఇంపుకలిగేటట్లు ప్రయోగించటం వొక అక్షరం మార్పుతో ఒక కొత్త అర్థాన్ని స్ఫురింపచేయడం ఇవన్నీ కవికి పదాలపై గల అధికారాన్ని తెలియచేస్తాయి.ఒక కవితలో "పగబట్టిన పాములా రేగుతున్న గాయం/పొగబట్టిన దీపంలా మసకబారిన జీవితం"అన్న వాక్యాలున్నాయి.ఈ పంక్తుల్లో "పగబట్టిన", "పొగబట్టిన" అనే ఈ రెండు పదాల్లో మొదటి పదంలో "అ"కారాన్ని,రెండోపదంలో"ఒ'కారంగా మార్చి ఉచ్ఛారణలో ఒకే పదంలా ముందు పాఠకులకు అనిపించిన తరువాత ఆలోచనతో ఆ పదప్రయోగ వైచిత్రిని వారు ఆస్వాదిస్తారు.ఇట్లాంటి చిత్రపద ప్రయోగం ప్రతాప్ చాల కవితల్లో చేశాడు. ఈ కవికీ మరొక లక్షణం కూడా వుంది.ఏ సామాజిక దురంతాన్నైనా తీవ్రంగా స్పందించి కవిత్వం చేయడం."కు(క)ల కలం"అనే కవితలో"కలానికి కూడా కులం కావాలని నా సిరా చుక్కకు తెలీదు" -అంటూనే సమాజంలో కులానికీ గల బలాన్ని ఎరుక చేసుకొని,"కలం ముందు కులం ఓడిపోయేలా"-తన కలం లోని రక్తపు సిరా విలయతాండవం చేయాలనే అభ్యుదయ ఆలోచనని ప్రకటిస్తాడు ప్రతాప్.కొందరు కవులు చేసినట్లే కవితా పాదాలలో గాని,కవితా శీర్షికలలోగాని కుండళీకరణాలలో ఒక అక్షరాన్ని పెట్టి ఒక కొత్త అర్ఠాన్ని సాధించే ప్రయత్నం చేశాడు. "వెలుగులో చీకటి"అనే కవితలో "నర రూప (మ)మృగ సంహారం ఇంకెప్పుడు"-అనే వాక్యంలో కుండలీకరణంలో "మ" అనే అక్షరం వుంచి మగ,మృగ అనే పదాలను ప్రయోగించిన భావనను పఠితకు కలిగించాడు.ఇలాంటి ప్రయోగాలు కవులు అభివృద్ధి దశలో చేస్తుంటారు. "మట్టి రాతలు"-అనే కవితలో కవి తనకు,ఇంకొక వ్యక్తికీ గల వ్యత్యాస్యాన్ని చాల కవితాత్మకంగా ఆ వ్యక్తివి కల్పనలని,తనవి మట్టి రాతలని యథార్ఠంగా సత్యాంగ్రహంతో చెబుతాడు. "నువ్వు ప్రత్యూష కిరణాల్లొ ఉషోదయాల్లో తుమ్మెదల్లో తుమ్మెదల్లో తేలియాడుతావు "(మట్టిరాతలు)7 "నేను ఆకలి కేకల్లో ఎంగిలి విస్త్ర్లో కాలే ఉదరంతో సంచరిస్తాను" (మట్టిరాతలు)8 పైన కనపరిచిన పాదాలలో(7,8) ఇతరులతో పోల్చినప్పుడు తన జీవితం ఎట్లా మట్టికొట్టుకపోయిందో చెబుతూ మరికొన్ని పాదాలలో ఆ దుస్థితిని మరింత దుఃఖాత్మకంగా చెబుతాడు. ఇలాంటి రసాత్మక వాక్యాలతో ప్రతాప్ కవితా సంపుటి కవిత్వ ప్రియుల్నీ అలరిస్తంది. ప్రతాప్ ఇంకా మంచి కవిగా స్థానం సంపాయించుకోవాలంటే కొన్ని ఆలోచనలు పంచుకొని పాటిస్తే అది సాధ్యం.కవితా సంపుటి ప్రచురింకోవాలనుకున్నప్పుడు రాసిందంతా ముద్రణలో చూసుకోవాలనే కోరికను నిగ్రహించుకొని వుండాల్సింది.తన మిత్రుల అభిప్రాయాలు శ్రేయోభిలాషుల సలహాలు తీసుకొని కవిత్వ సంపుటిలో అర్హమైన కవితల్ని చేర్చి వుండాల్సింది.పునరావృతంగా వుండే భావాల్ని కల కవితల్నీ,మూర్తి గారు "కవిత్వంలో ఏడడుగులు'-అన్న శీర్షికలో అన్నట్టుగా రొడ్డుకొట్టుడు పదాల కవితల్ని తొలగింపు చేసి వుంటే కవిత్వం మరింత మెరుగయ్యేది.జాన్ డ్రైడెన్ అన్నట్టుగా పాలిష్ ఎన్నిసార్లు చేస్తే పాదరక్షలు అంతా తళాతళ మెరిసినట్లుగా కవి కూడా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు తిరగ రాయటం మూలాన కవిత్వం అచ్చమైన కవిత్వంగా మిగిలిపోవడమే కాక,అనవసర పదాలు తొలిగిపోతాయన్న విషయాన్ని గ్రహిస్తే కవిత్వం త్రిపురనేని అన్నట్లు వచనమై తేలిపోకుండా కవిత్వమై నిలుస్తుంది.ఇవన్ని ప్రతాప్ అభివృద్ధి కాంక్షతో చెప్పినవే. "చెప్పులు కుట్టె నా చేతుల తోనే నీ నాలుక కుట్టెయాలని వుంది- బట్టలుతికే నా చేతులతోనే నిన్ను బండకేసి కొట్టలని వుంది' (గాయం)8 ఇలా(8) కులవృత్తుల పట్ల ఆ కులవృత్తుల్ని నీచంగా చూస్తున్న అహంకార జాడ్యం ప్రదర్షించే వారిపట్ల ఈ కవి ప్రదర్షించేదీ ధర్మాగ్రహమే."తత్వం తెలీక కవిత్వంరాసా"అని అంటున్న ప్రతాప్ చాల నిజాయితిగా "నా రచనల్లో కవిత్వం తక్కువగా వున్నా చెప్ప దలుచుకున్న అంశం సూటిగా చెప్పటమే నా తత్వం"-అని అన్నా ఎన్నో కవితాత్మక వాక్యాలు సంపుటంతా నిండి మనల్ని ఆనందపరుస్తాయి.ప్రతాప్ ఏది చెప్పిన కవిత్వమే చెప్పాడు కాబట్టి ఇతన్ని అభిమానిస్తు అభినదింస్తూ...వచ్చే మంగళవారం మరో కవితా సంపుటితో కలుద్దామని చెబుతూ రాబోయే ప్రపంచ కవిత్వ దినోత్సవ శుభాకాంక్షలు కవి మిత్రులకు చెబుతున్నా.మంచి కవిత్వం కవి సంగమ కవులనుంచే వస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ సెలవు.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ojaIgk

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి