పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, మార్చి 2014, బుధవారం

Kapila Ramkumar కవిత

సునిశిత విశ్లేషకుడు కెవిఆర్ – వి.చెంచయ్య by gdurgaprasad 'రచనలకు సమకాలికత ఉండాలిగాని, తాత్కాలికత కాదు.' 'మార్పును బుద్ధిపూర్వకంగా ఆశించిన ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారు.' కెవిఆర్ కవి, నాటక కర్త- అంతకంటే ముఖ్యంగా మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో అడవి, భువన ఘోష, అంగార వల్లరి కవితా సంపుటాలను, విప్లవ సాహిత్యోద్యమ కాలంలో జైలు కోకిల, ఎర్రపిడికిలి, సూరీడు మావోడు కవితా సంపుటాలనూ వెలువరించాడు. ఆయన రాసిన అన్నపూర్ణ, రాజీవం నాటకాలు విశేష ప్రజాదరణ పొందాయి. దువ్వూరి రామిరెడ్డి గురించి రాసిన 'కవికోకిల', గురజాడ గురించి రాసిన 'మహోదయం' రచయితల జీవిత సాహిత్య వ్యక్తిత్వాలను విశ్లేషించే పద్ధతికి మార్గదర్శకంగా నిలవదగిన నమూనాలు. ఇవన్నీ ఒకెత్తు అయితే, 1950ల నుండి 1998 జనవరి 15న శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలిపోయేంత వరకూ- దాదాపు అర్థ శతాబ్దం పాటు- కెవిఆర్ రాసిన సాహిత్య వ్యాసాలు ఒకెత్తు. ఇవి సంఖ్యాపరంగా 300లకు పైగా ఉండడమే కాదు, మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఒరవడికి మంచి ఉదాహరణలు. ఇంకా చరిత్ర, రాజకీయ, సామాజిక వ్యాసాలతోబాటు, మూణ్ణెల్ల ముచ్చట, డిటెన్యూ డైరీలు ఆయన జైలు జీవిత విధానానికి, ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడతాయి. కెవిఆర్ సాహిత్య వ్యాసాలలో 20వ శతాబ్దపు తెలుగు సాహిత్య చరిత్రతోపాటు ఆయన సాహిత్య దృక్పథం కూడా స్పష్టమవుతుంది. వర్తమానంలో గతమూ, భవిష్యత్తూ రెండూ ఉంటాయనీ, గతాన్ని తిరస్కరించి భవిష్యత్తును చూడగలగడమే ప్రజాస్వామ్య సోషలిస్టు రచయితల దృక్పథంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. సంఘ విమర్శ లేని సాహిత్య విమర్శ గాలి కసరత్తు లాంటిదంటాడు. తత్వస్పర్శ లేని విమర్శకు కనుచూపు ఉండీ లేనట్టేనంటాడు. భూ స్వామిక సంస్కృతి నుండి పూర్తిగా బయటపడకుండానే భావికవిత్వం వ్యక్తి స్వేచ్ఛా భావంతో ఆత్మాశ్రయ వైఖరిని అవలంబించిదని కెవిఆర్ అభిప్రాయం. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో కూడా ప్రజాకవులుగా ఉండి రచనాగానం చేసినవారు తెరమరుగైపోయారనీ, మధ్యతరగతి విద్యా సంస్కారాలతో, కళా ప్రమాణాలతో ప్రజాఘోషను కావ్య వస్తువుగా మార్చుకోగలవారే నిలబడగలిగారనే విషయాన్ని కెవిఆర్ గుర్తించారు. ఇది కమ్యూనిస్టు ఉద్యమం తాలూకు లోపాన్ని సూచించడంతో బాటు, పునాది వర్గాల నుండి వచ్చిన నాయకత్వం లేకపోవడాన్ని కూడా తెలియజేస్తుందని అంటాడు. సాహిత్య సంబంధమైన ఒక వాస్తవాన్ని గుర్తించి, కెవిఆర్ దాన్ని అంతటితో వదిలెయ్యడు. ఆ వాస్తవం వెనకగల నేపథ్యాన్ని తరచి చూస్తాడు. దాని ఆధారంగా ఒక సూత్రీకరణ చేస్తాడు. కవిత్వానికీ, వచనానికీ ఆకర్షణ విషయంలో గల తేడాను చెప్పే సందర్భం దీనికి మంచి ఉదాహరణ, కెవిఆర్ ఇలా అంటాడు- 'కవిత్వానికి గల ఆకర్షణగానీ, మన్ననగానీ, వచనానికి లేకపోవడమనేది, ఒక సమాజం వెనుకబాటుతనానికే నిదర్శనం.' ఈ సూత్రీకరణతో కెవిఆర్ సునిశిత దృష్టి వ్యక్తమవుతుంది. దీనికొక ఉపపత్తి కూడా ఆయనకు అందుబాటులోనే ఉంది. కవిగా శ్రీశ్రీకి ఎంతో గౌరవం వచ్చింది. కాని ప్రజాస్వామిక యుగంలో వచనానికి ఉండాలి గౌరవం. కవిత్వానికి ఇంత గౌరవం ఉండడం ఆదిమ యుగ అవశేషం అంటాడు. కవిత్వం ఒక మలుపు తిరగాలంటే కచ్చితంగా అది ఆదిమ యుగ స్వభావమైన 'మాయ'తో జతగూడాల్సిందే. శ్రీశ్రీ కవిత్వంలో ఈ శక్తే అందరినీ ఆకిర్షించడానికి కారణం. దీని ఆధారంగానే కెవిఆర్ కవిత్వానికొక మంచి నిర్వచనం ఇస్తాడు. కవిత్వం హేతుబుద్ధికి వ్యతిరేకం కాదు. తర్కానికి శత్రువూ కాదు. కానీ అందులో ఒక ఐంద్రజాలిక గుణం ఉంది. హృదయోద్రేక లక్షణం ఉంది. ఈ రెండిటికీ లొంగకపోవడమే కవిత్వానికున్న విశిష్టతగా కెవిఆర్ గుర్తిస్తాడు. వీరేశలింగం, గురజాడ, రాయప్రోలు నుండి విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల దాకానే కాదు; చలం, కుటుంబరావు, తిలక్‌లతో ఆగలేదు సరికదా, చాసో, రాచమల్లు, కుందుర్తి, దాశరథి, బంగోరె, చెరబండరాజు, అల్లం రాజయ్య- ఒకరేమిటి? తనకు ముందుతరం, తనతరం, తన తర్వాతితరం రచయితలను కూడా విశ్లేషించి అంచనా వెయ్యగలిగిన సత్తా తనకుందని రుజువు చేసుకున్నాడు కెవిఆర్. 'రచనలకు సమకాలికత ఉండాలిగాని, తాత్కాలికత కాదు.' 'వస్తుప్రాధాన్యం శిల్పాన్ని పూర్తిగా నిరాకరించేది కాదు.' 'వ్యక్తిత్వం సాహిత్య వ్యక్తిత్వాన్ని విలక్షణం చెయ్యకమానదు.' 'మార్పును బుద్ధిపూర్వకంగా ఆశించిన ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారు.' సాహిత్యలోకం గుర్తుంచుకోదగిన ఇలాంటి పదునైన వాక్యాలు కెవిఆర్ సాహిత్య వ్యాసాలలో కోకొల్లలు. -వి.చెంచయ్య (ఈ నెల 23న విజయవాడలో 'కె.వి.ఆర్. సాహిత్య వ్యాసాలు' 2, 3 భాగాల ఆవిష్కరణ జరుగనుంది. పి.రామకృష్ణ, శివారెడ్డి, కాత్యాయని విద్మహే పాల్గొంటారు.)

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j2s0iU

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి