పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఫిబ్రవరి 2014, గురువారం

Nirmalarani Thota కవిత

వి 'గ తం . . ! పాదాల పారాణి ఆరక ముందే తల మీది తలంబ్రాలు జారక ముందే నేను కావాలా ? మీ అమ్మ నాన్న కావాలా ? అన్న మగడైన ప్రియుడి మొదటి మగ ప్రశ్నకు ప్రతిగా . . . కన్నవాళ్ళ మమకారపు బంధాల్ని తెంచేసి బేలగానో .. ఆశగానో అటువేపే అడుగేసి 'ఆడ' బిడ్డగా. . . స్వార్ధంతో చచ్చిపోయా . . ! కలల రాకుమారుడని ఒకనాడు మురిసి పోయిన కట్టుకున్నవాడిలో మగాడు మద్యం మత్తులో కసాయితనంతో చేయి చేసుకుంటుంటే మనసు కళ్ళు మూసుకున్న మధ్యతరగతి "ఇంట్లో సుఖం లేకపోతే ఏం చేస్తాడు పాపం ?" అనే సానుభూతి పలుకుల ములుకులతో ఆలిగా . . . ఆక్రోశంతో చచ్చిపోయా . . ! "పిల్లలు పుట్టడం లేదటగా .. పాపం .. ! ఏంటి సమస్య? " అనే పర పరామర్శల బేతాళ ప్రశ్నకి సమాధానం తెలిసీ .. చెప్పలేక గుండె కపాలం బ్రద్దలవుతుంటే . . ప్రయోగశాలల్లో పరీక్షల పేరిట వలువల విలువలు దాటి తనువుకు పడే తూట్లు, గాట్లతో ఆడదానిగా. . . సిగ్గుతో చచ్చిపోయా . . . ! కనుపాపల్లా భావి జీవితం చూపుతారని కంటికి రెప్పల్లా కాచుకుంటూ కనిపెంచిన పిల్లలు కనుల ముందే కసి పెంచే కలతల కాపురపు కాట్లకో కవ్వించే పాశ్చాత్యపు పోకడల మోజుకో పెడదోవన పడుతుంటే "ఎలా పెంచిందిరా నీ అమ్మ(నీయమ్మ) ? " అనే సగటు సమాజపు తిట్లతో అమ్మగా... అసహ్యంతో చచ్చిపోయా . . . ! ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే ప్రశంస పురాణాలకు , పుస్తకాలకూ మాత్రమే పరిమితమై నిజ జీవితంలో మగవాడి ప్రతీ తప్పుకూ ఆడదాన్నే వేలెత్తి చూపే సభ్య(మభ్య) సమాజంలో నా వాళ్ళకూ . . సంఘ జీవితపు ఉనికికీ దూరం కాకుండా ఉండడానికి చేసే విశ్వ ప్రయత్నంలో నాకు నేనే దూరమవుతూ . . మనిషిగా అనుక్షణం అత్మవంచనతో చచ్చిపోయా . . . ! జీవితం పడమటి వాకిలి చేరాక వెనక్కి తిరిగి చూస్తే . . . ఒక్క నిజం జాలిగా కనిపించి . . లీలగా గుర్తొచ్చింది . . నేను ఒక విషయం మరిచి పోయానని . . (?) అనుబంధాల కోసం పడిచస్తూనో అస్తిత్వం కోసం చచ్చినట్టు పడుంటూనో నేను " బ్రతకడం " మరచిపోయానని . . ! ? నిర్మలారాణి తోట [ తేది: 05. 02. 2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1b1GWKH

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి