పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

Narayana Sharma Mallavajjala కవిత

ఈనాటికవిత-72 __________________________ నిర్మలారాణి తోట కవిత కవికి భావనాబలం కావాలి.ఊహాశాలిత్వం ఒకటి కలగాలి.అప్పుడే మార్దవమైన వాక్యాలని అందించగలుగుతాడు.ఈ భావనాబలాన్ని సాహిత్యానికి పరిపూర్ణ దృష్టితో అందించింది భావకవిత్వం(Romantic poetry)ఈ మార్గంలోనే భావనాశక్తి (Imagination)అనే పదన్నికూడావాడుతున్నారు.విడివిడి భావనలను ఒక్కటిగ ఏకం చేసే సామర్థ్యం భావనా శక్తి.నిజానికి ఇంద్రియాతీత భావాలను ఉహించగల శక్తి భావనాశక్తి.ఇది వస్తువు,పరిస్థితి,చర్య వేటినన్నా ప్రతిబింబించవచ్చు.ఇది సంపూర్తిగ కల్పన కాదని విమర్శకుల అభిప్రాయం.అందువల్లే దీనిని"భావనశక్తి,సృజనాత్మక కల్పనాశక్తి,ఊహాశక్తి "అనే పదాలతో పిలిచారు. నిర్మలారాణి కవిత్వంలో ఊహాశక్తి ఎక్కువ.నిర్మాణ గతంగా ఆలోచిస్తే మొదటివాక్యం నుండే భౌతికాన్నుంచి..మానసికమైన ధ్యాన స్థితిలోకి వెళ్లిపోయారు. "లిప్త పాటు కళ్ళు మూస్తే చుట్టూ చుట్టేసే చీకటి . . మనసు లోతుల్లోంచి వెల్లువయ్యే నిశి . ." యోగ శాస్త్రంలో చీకటి ధ్యానంలోని పరిపూర్ణత్వానికి ప్రతీక.కవయిత్రి తరువాత వాక్యాలనితీర్చిన క్రమాన్నించి ఆలోచిస్తే ఇది భయానికి ప్రతీక.ఒక లిప్తపటులోకలిగే ఉద్వేగాన్ని,మానసిక అందోళనని అనేక దృశ్యాలుగా చిత్రించిన కవిత. ఒక్క క్షణం స్వప్నమై మరు క్షణం శూన్యమై స్థభ్దమై ఒక్క క్షణం నీరవమై నిశ్చలమై నిగూడమై . . . నిర్మలమై ఒక్క క్షణం . . . ఒక్క క్షణం నా ఉనికిని ప్రశ్నిస్తూ పరిహసిస్తూ . . . తాను నిజమై నేను కరిగే నీడై . . కోల్పోయిన నా స్వీయత దూరపు నెలవంకైతే. . నిండిన మసక చీకటిలో అసహనపు దాహార్తిలో . . ఆరుబయట నే రాసుకున్న జాలిపాట విని రాలిన నక్షత్రాల సామీప్యంలా . . . చెదిరిన నది ఒడిలో నిశ్చల నక్షత్రపు ప్రతిబింబంలా . . . కూలిన స్వప్న సౌధాల పునర్నిర్మాణంలో అలసిన బేలగువ్వ లిప్తపాటు సేదకై సారించిన చూపుల్లా . . . ఇవన్నీ ఒక లిప్తపాటులో,క్షణంలో కలిగిన ఉద్వేగాన్ని చెప్పిన అంశాలే.చివరికి తన ఆశంసతో కవిత ముగుస్తుంది. నా భావాలు మనసైన మనసున్న మనిషిని చేరితే పొద్దున్నే కలల ముంగిట పూచే గుబాళింపు వనాలు . . వీచే పులకరింపు గీతాలు . . ఎగిసే జలదరింపు సాగరాలు . . కురిసే పలకరింపు జలపాతాలు . . ! కవిత్వం నిండా భావాన్ని బలపర్చగల ప్రతీకలు,పదబంధాలున్నాయి. కవిత్వం నిజానికి భావకవితా దశనుంచి కళాత్మకంగా చాలదూరం చేరుకుంది.నిర్మలారాణిగారు ఆ సాధనకుదగ్గరలో ఉన్నారు.ఇంక నిర్మాణం విషయంలో బలన్ని సాధించాల్సిన అవసరం ఉంది."కోల్పోయిన నా స్వీయత"నిశ్చల నక్షత్రపు"లాంటి ప్రయోగాల విషయంలో వ్యాకరణ సిద్ధత కొంత అవసరం. మంచికవిత అందించిన నిర్మలారాణిగారికి అభినందనలు.సమాజం ,ప్రకృతి వంటి అంశాలకి ఇంకా దగ్గరగా వెళితే ఇంకా మంచికవిత్వం నిర్మలారాణిగారు అందించగలరు.

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pco0fM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి