పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Kavi Yakoob కవిత

అజంతా పద్యాలు వ్యాసాలు » సెప్టెంబర్ 1999రచన : వెల్చేరు నారాయణరావు [ ప్రస్తుతం University of Wisconsin, Madison లో కృష్ణదేవరాయ Special Chair Professor గా ఉంటున్న శ్రీ వెల్చేరు నారాయణ రావు గారు తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో కొత్త మార్గాల్ని ప్రవేశపెట్టి ప్రపంచ సాహితీ విమర్శనా రంగంలో తెలుగు భాషకి కూడ ఒక ఉన్నత స్థానాన్ని కలిగించారు. ఈయన Ph.D. thesis "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు కవితా విమర్శ రంగంలో ఒక విప్లవం తెచ్చిపెట్టింది. శివ కవుల కవిత్వమూ, దానికీ అప్పటి సంఘజీవితానికీ ఉన్న సంబంధమూ వివరిస్తూ " Siva's Warriors", చాటు పద్యాల గురించిన ఒక వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ "A Poem at the Right Moment" మొదలైన గ్రంథాలే కాకుండా ఎన్నో వ్యాసాలు, కాళహస్తీశ్వర మహాత్మ్యం లాటి వాటికి అనువాదాలు రాశారు. సాహిత్యం, సంఘం మీద దాని ప్రభావం గురించి మౌలికమైన పరిశోధనలు చేస్తున్నారు, చేయిస్తున్నారు. ] * * అజంతా రాసింది తక్కువ. అయినా ఆయనకి తెలుగు కవిత్వంలో వున్న పేరు తక్కువది కాదు. అజంతాని తెలిసున్న వాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేవి రెండు వచన పద్యాలు: “చెట్లు కూలుతున్న దృశ్యం,” “ఎక్కడా ఎవరూ లేరు.” ఈ రెండూ అబ్బూరి ఛాయాదేవి సంకలనం చేసిన కవితల్లో వచ్చాయి. రెండూ గొప్ప పద్యాలు. రెండే రెండు వచన పద్యాలతో ఆధునిక తెలుగు వచన కవిత్వంలో అందరికీ జ్ఞాపకముండే చోటు సంపాదించుకున్న అజంతా, ఆ తరువాత (బహుశా అంతకు ముందు కూడా) రాసిన వచన పద్యాలు ఉన్నాయి. ఎన్నో లేవు కాని, ఉన్న వాటిలో ఆయన స్వయంగా ఎంచి బయట పెట్టదలుచుకున్నవి “స్వప్న లిపి” అనే పేరుతో వచ్చిన పుస్తకంలో వున్నాయి. మాటకున్న తూకం, చప్పుడూ, వచన పద్యంలో పంక్తి నడవవలసిన తీరూ అజంతాకు తెలిసున్నంతగా తెలిసున్న వచన కవులు ఎంతోమంది లేరు. పద్యం లోంచీ, గేయం లోంచీ వచన పద్యం అప్పుడే బయట పడుతున్న తొలి దశలో రాసిన అజంతా వచన పద్యం ఆ తరువాత ఇన్నేళ్ళుగా అనేక కవుల చేతిలో ఆ ప్రక్రియ సాపు దేరిన తరువాత కూడా, చాలా తక్కువ మంది మాత్రమే అందుకోగల శిల్ప శిఖరంగా నిలిచిపోయింది. అజంతా వచన పద్యపు పంక్తులు పొడుగ్గా వుంటాయి. అయినా ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోతాయి. పద్యంలో మాటల కన్నా మించిన అర్థాన్ని మాటల కలయికల అవరణంలో కల్పిస్తాయి. పంక్తికీ పంక్తికీ మధ్య వున్న జాగాలు పద్యం చుట్టూ నిశ్చితమైన వాతావరణాన్ని నిర్మిస్తాయి. ఆ వాతావరణం, అస్తమిస్తున్న సూర్యుడున్న ఆకాశం కింద దారి లేని ఎడారి జాగా లాగా, కంటికి తాను కనిపిస్తూ అందులో మరేదీ కనిపించని చీకటిలో ఒళ్ళంతటికీ తగిలే గాలిలాగా పాఠకుడి మనస్సు చుట్టూ ఆవరించుకుంటుంది. అజంతా మాటలు మన ఇంద్రియాల గ్రహణశక్తికి వుండే పరిమితుల్ని అంతకు ముందు మనం వున్నాయని ఎరగని ప్రదేశాల వరకూ పొడిగిస్తాయి. ఈ పని ఆ మాటలకి అంతకు ముందు లోకంలో వున్న అర్థాలని వాడుకునే చేస్తాయి. మాటకి వున్న నిశ్చితమైన అర్థాన్ని ఒప్పుకుని మాటల్ని ఒకదాని పక్క ఒకటి పేర్చడంలో వున్న పద్ధతులకి లోబడి వుంటూ కూడా, ఆ మాటల అర్థ ప్రదేశాల్ని అంతకు ముందు ఎవరూ ఎరగనంతవరకూ పొడిగిస్తాడు అజంతా. ఈ పని తను చేస్తున్నానని ఎరిగున్నాడేమో కాని ఎవరికీ చెప్పలేదు “రోడ్లకు నమస్కారం” రాసే దాక. అక్షర హింస కవిత్వం కాదు కనుక అక్షర హర్మ్యాలలో ఉన్మత్తుని ఖడ్గ విన్యాసాలు ఆత్మహత్యా సదృశం కనుక ప్రచ్ఛన్న రాక్షసులకు దూరంగా రోడ్లమీద నడుస్తూనే నేను కవిత్వం సృష్టిస్తాను అంతకు ముందు ఎవరూ ఎరుగని అనుభవాలు కవికీ కలుగుతాయి, పిచ్చివాడికీ కలుగుతాయి. ఎటొచ్చీ పిచ్చివాడి అనుభవాలు ఇంకొకళ్ళకి అందవు. అతను మాటల్ని తన అదుపులో పెట్టుకుని వాటి ద్వారా ఆ అనుభవాలు మనకు అందివ్వలేడు. వాడు చేసేది అక్షర ప్రయోగం కాదు, అక్షర హింస. కాని కవిత్వానికి అక్షరాలే ప్రాణం. పిచ్చివాడు తను మాటలతో కట్టిన ఇంట్లో కత్తి పిచ్చి పిచ్చిగా తిప్పి చివరకు తననే పొడుచుకుంటాడు. ఇలాంటి (పిచ్చి) రాక్షసులకి (వాళ్ళు కవుల్లా కనిపించొచ్చు ఒక్కొక్కప్పుడు అందుకే ప్రచ్ఛన్నులు) దూరంగా వుంటాడు కవి. రోడ్లు ఇంకెవరో వేసినవి. భాషకి వ్యాకరణం లాంటివి. వాటి మీద నడుస్తూనే, అంటే వాటిని ఉపయోగించుకుంటూనే కవిత్వం సృష్టిస్తాడు అజంతా. అజంతా రచనలు తిరిగి మరో మాటల్లో తాత్పర్యార్థాన్ని చెప్పడానికి వీలయేవి కావు. మంచి కవిత్వానికి ఇదొక లక్షణం అని అధునికులంటారు. ఆ మాట అన్ని కవిత్వాలకు వర్తించదు. తాత్పర్యార్థాలు చెప్పడానికి వీలిచ్చే మంచి కవిత్వం వుంది. అయితే అది అజంతా కవిత్వం లాంటి మంచి కవిత్వం కాదు. ఆధునిక నాగరికతలో వ్యక్తి చైతన్యం సాంప్రదాయిక సమాజంలో లాగా సమిష్టి తోటీ, ప్రకృతి తోటీ సమస్థితిలో వుండదు. ప్రకృతి పగిలిపోయి, సమాజపు సమిష్టి స్థితి చెదిరిపోయిన ఈ ఆధునిక స్థితిలో ఒంటరి వ్యక్తి దారిలేని చోట దారి వెతుక్కుంటాడు. గాలి లేని చోట ఊపిరి కోసం తపన పడుతుంటాడు. ఈ స్థితిని కవిత్వంగా పునఃప్రవచించి వ్యక్తం చేయ్యడం ఈ స్థితి పై విజయం సాధించడానికి మనిషికి దొరికిన ఒక మార్గం. ఈ మార్గం అజంతాది. అంతర్ముఖత్వం దీనికి తప్పని సరి. కాని కవిత్వం కాబట్టి ఇది ఆ అనుభవాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఇంద్రియ స్పృహ (సెన్సిబిలిటీ)ని నిశితపరచే భాష ద్వారా అందరిలోనూ తమ అంతరంగాలను జాగృతం చేస్తుంది. అంతరంగమొక్కటే వస్తు ప్రపంచమయి, మాటలొక్కటే కావ్య వ్యక్తీకరణ సాధనాలయిన కవిత్వంలో కవికి నేర్పు చాలా కావాలి. మాటలు ఎప్పటికప్పుడు పాతబడిపోతుంటాయి. స్పృహలు ఎప్పటికప్పుడు మొద్దుబారిపోతుంటాయి. ఏ మాటా రెండు మార్లు వాడడానికి వీలు లేదు. లోకం తననించి తీసేసుకుని పది చోట్ల వాడేసిన మాట మైలపడిపోతుంది. తనే ఒకసారి వాడిన మాట రెండోసారికి మాసిపోయినట్టుంటుంది. ఎప్పటికప్పుడు మాటల్ని శుభ్రం చేసుకోవాలి. అర్థాల బలహీనత నుంచి అక్షరాలను కాపాడాలి. ఈ పనిలో కవికి ప్రతిసారి భాష పాడైపోయినట్టు, కవిత్వం కల్మషమయి పోయినట్లు కనిపిస్తుంది. కవి తన అక్షరాలను తానే శంకిస్తాడు. తన వాక్యాలను తానే అనుమానంగా చూస్తాడు. ఆధునిక కవిత్వంలో ఇది కాలుష్య యుగం అని ప్రకటించాడు అజంతా, ముప్ఫై ఏళ్ళ క్రితం ఒకసారి. సాహిత్యంలో సాహిత్యేతర విషయాలు కలిసిపోయాయని నొచ్చుకున్నాడు. సిద్ధాంతాలు, విశ్వాసాలు కవిత్వంలో వుండకూడదన్నాడు. అంతేకాదు అనుకరణం కూడా కాలుష్యానికి దారి తీస్తుందన్నాడు. ఇది అజంతా చేసిన ప్రత్యేకమైన కవితా సిద్ధాంతం కాదు. మాటలూ, మనస్సులో పుట్టిన కదలికలూ మాత్రమే కవితా సంపద అయిన పరిస్థితిలో అనివార్యంగా ఏర్పడే కవిత్వ సిద్ధాంతం ఇదే. అజంతా రాసిన పద్యాలన్నిటిలోనూ కనిపించే బొమ్మ మృత్యువుది. ఆ మృత్యువు అనేక రకాలు: భాషా మృత్యువు, భావాల హత్య, మనుష్యుల మరణం, చివరికి తన సొంత చావు. ఎవడో హఠాత్తుగా ఘోర ప్రమాదంలో చిక్కుకుంటాడనుకో చుట్టూ పోగైన జనం ఒక్క దఫా నా ముఖం వైపు చూస్తారు ఇదేం విచిత్రం వీడు వాడు ఒకే పోలిక అని ఆశ్చర్యపోతారు అందాకా ఎందుకు, రోడ్డు మీద నా మృత కళేబరాలని నేనే లక్ష సార్లు చూశాను నమ్ముతావో నమ్మవో గాని తమ్ముడూ నిజం చెప్తున్నాను ఈ నగరంలో అడుగు పెట్టిన రోజున పట్టపగలు నక్షత్రాలు చూశాను. ఈ మృత్యువు ప్రపంచం అంతటా వ్యాపించి వున్నది. ఆధునిక నాగరికతలో వ్యాప్తమై వున్న ఈ మృత్యు లక్షణం భాషకి కూడా వర్తిస్తుంది. మిత్రుడా నేరం చేశాను అదృశ్య ప్రాకారాల వెనుక రహస్యోద్యాన వనంలో వికసించిన చిత్రాక్షరాలను చీకటి నఖాగ్రాలతో చిత్రవధ చేశాను … మిత్రుడా నేరం చేశాను. ఈ బొమ్మలు అజంతా పద్యాల నిండా వుంటాయి. ఈ “భీభత్సంలో,” “నిశ్శబ్దంలో,” “ఆకలి రుద్రభూమిలో,” “జీవన సౌందర్యాన్ని ఎలా చూడగల” నని ప్రశ్నించుకున్న మానవుడు శాశ్వతంగా నిస్సహాయుడు, నిరంతరం పరాజితుడు. ఇన్ని పరాజయాల, సమాధానం లేని ప్రశ్నల సమ్మర్ద వాతావరణాన్ని సృష్టించినా, అజంతా కవిత్వం భాషని బతికిస్తుంది, భావాల మనఃప్రపంచాలని చైతన్యవంతం చేస్తుంది. అందుకే ఏ నిరాశని, వైకల్యాన్ని పాఠకుడి అంతరంగంలో ప్రతిసృష్టించిందో, వాటి మీద పాఠకుడికి ఒక సృష్టికర్త కుండే స్వాధీనమూ, సౌలభ్యమూ సంపాదించి పెడుతుంది. నిరాశ కవిత్వం అయితే లోకంలో నిరాశలా, మనిషిని కుంగదీయదు. మనిషిని ఆ నిరాశకి యజమానిని చేస్తుంది. భావ కవిత్వపు రోజులలో మనకొక అపసిద్ధాంతం వొచ్చింది. కవికి ఇన్స్పిరేషన్‌, అంటే భావావేశం, అవసరమనీ, అదే కవిత్వానికి ప్రాణమని. ఈ వరసలోనే కవిత్వం హృదయ ప్రధానం అనీ, శాస్త్రం బుద్ధి ప్రధానమనీ ఒక చెక్కపడి అభిప్రాయం ఏర్పడింది. ఈ అభిప్రాయాలు ఇప్పటికీ మన సాహిత్య విమర్శలో మిగిలి వున్నాయి. నిశితమైన బుద్ధితో, నిశితమైన ఇంద్రియాల ద్వారా గ్రహించిన ప్రాపంచిక తత్వ్తాన్ని శబ్దాల సత్తువని జాగ్రత్తగా కలిపి నిపుణంగా నిర్మించిన భౌతిక సౌధం కవిత్వం. ఇలాంటి కవిత్వం మట్టి లోంచి వస్తుంది; చర్మం లోంచి వస్తుంది; తన చుట్టూ వున్న ప్రపంచంలో నిండా మునిగి వుండడం వల్లనే వొస్తుంది. ఈ సంగతి శ్రీశ్రీ కి తెలుసు. శ్రీశ్రీకి తెలుసునని అజంతాకి తెలుసు. భావకవులు, ముఖ్యంగా వాళ్ళలో చిన్నవాళ్ళు అతిలోక సౌందర్యాల అబద్ధాల వెనుకాతల తమను తాము మోసం చేసుకుంటున్న రోజుల్లోనే అజంతా ఇలాంటి కవిత్వం రాశాడు. అందుకే కవిత్వంలో కన్నీళ్ళలో తత్వ్తం వుండదు. చేతగాని సొంత బాధ వుండదు. ఒక్క “పరిత్యాగి పరివేదన” లోనే అజంతా మధ్య తరగతి వ్యక్తి సొంత బాధని జాలిగా వినిపించాడు. బహుశా ఇప్పుడు గుర్తుకు రాదు నీకు క్రమ్ముకు వస్తున్న చీకట్లో కన్నీళ్ళు రాల్చుతూ చెప్పారు నువ్వే మా కష్టాలకు వంతెన అన్నారు అదే నిన్ను చూడడం ఆఖరు రోజు నాకు వాళ్ళ ఆశని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసాను వాళ్ళని అక్షరాల కన్నీరుగా మార్చేసాను. ఇలాంటి జాలి అజంతా పద్యాల్లో మరెక్కడా కనిపించదు. అజంతా పద్యాలలో తరువాత వ్యక్తమయేవి వ్యక్తిగతమైన కన్నీటి మాటలు కావు. నిరంతర ఆత్మహననం లోంచి వచ్చిన, నిత్య పరిశ్రమ వల్ల ఉద్భవించిన పదునైన నిర్మాణాలు. తెలుగులో చాలా మంది కవులు పద్యానికి ఏదో ఒక అర్థ సూత్రాన్ని వాడుకుని, ఆ దారం మీద మాటలు పేరుస్తారు. అజంతా పద్యాలలో పంక్తికీ పంక్తికీ మధ్యనున్న జాగాలో ఇలాంటి క్రమానుగత అర్థసూత్రం వుండదు. ఏ మాటకామాట కట్టే బొమ్మల్ని ముద్దుగా కలిపి వాటి సమ్మేళనాల సమ్మర్దం ప్రదర్శించే ప్రపంచమే అజంతా పద్యం. ఈ ప్రపంచానికి నేపథ్యంగా పద్యపు పంక్తుల లయ విన్యాసాలు నిశ్శబ్ద కాసారంలో రాయి వేసినప్పుడు వచ్చే అల తరువాత అలలాగా కదులుతాయి. అజంతా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. తన కవిత్వాన్ని తానే నిరాకరించి, తన పద్యాలు తానే అసహ్యించుకుని తనకు నచ్చని వాటిని వొదిలేసే ధీరత వున్నవాడు అజంతా. కవి అనే మాటను కూడా తనకు వాడవద్దనేవాడు; అంతగా తన కవిత్వంలో తనను ముంచేసుకున్నాడు. అజంతా మన అంతరంగాలను సృష్టించిన చాలా కొద్ది మంది కవుల్లో ఒకడు. మనం ఎన్నిసార్లు చదివినా అతని పద్యాలు ఒరలోంచి తీసిన బాకు మొనలాగా, సర్పం విడిచిన కుబుసం పొరలాగా పదునుగా, స్వచ్ఛంగా వుంటాయి. [Courtesy : eemata.com]

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK4PpU

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి