పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

మరువం ఉష కవిత

మరువం ఉష | హోరు --------------------- స్థల కాలాల్లో దూరంగానైనా సమాంతర ప్రపంచమేదో ఉండే ఉంటుంది. అద్దంలో చందమామతో ఆగని రాముడు, మేఘాల పీచుమిఠాయి కావాలని మారాములు చేస్తుంటే, శాస్త్రజ్ఞుడొకడు శుక్రగ్రహపు ధూళిని నిశితంగా పరికిస్తున్నాడు. చందమామ విచ్చి నవ్విన క్షణాల్లో మరెక్కడో పగటినిద్ర మనసు పలక మీద తీరని కలని తిరిగి దిద్దుకుంటుంది. ఇరుకు నగరాల్లో చినుకుల నేల సాంగత్యం లేని ఒంటరివాన విసుగ్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లోకి ఇంకిపోతుంటే ఆవలి పక్కన కొండ అంచున నది, ఎగువ ప్రవాహమై శిఖరాన్ని చేరలేక, విరహాన ఆవిరై, చినుకై సాయుజ్యం పొందుతుంది. సృష్ట్యాది నుంచి రాధాకృష్ణుల రసవంత గాథ అనురాగ జలధి. నల్లకలువ కళ్ళలో చెంగల్వమాల మెరుపు. ఇదిగో ఓ జంట హృదయాల వేణుగానం — ఆమె పీల్చిన గాలి కణం ఊపిరితిత్తులలో రసాయనిక చర్య పొంది మళ్ళీ ఎప్పటికో మరలా అతని ఊపిరితిత్తుల్లో జొరబడే క్షణాలుంటాయా? ఉంటే, అవి అతనికి తెలుస్తాయా? అతను చూసిన నక్షత్రాన్నే, అతను చూసిన క్షణంలోనే, ఆమె చూస్తుందా? అలా జరిగితే దానికి మినుకుమినుకుల్లో ఏమన్నా ద్యుతి పెరుగుతుందా? ప్రేమ బారిన పడ్డవాళ్లింతే. ఆమె కౌగిట ఆతని గుస గుస "విశ్వమొకటి వుధ్భవించిన క్షణాన మనతో ప్రచోదితమవుతున్నాయనుకున్న మానవ లక్షణాలు.... అనురాగం, విరహం వంటి వున్నతానందాలను ప్రేరేపించగల భావ పరంపర మొదలయ్యాయి, ఆ భావాలతోటే నీ వునికీ ఆరంభమయ్యిందేమో అందుకే ఆది నుంచి నువ్వు నాకు ఎరుకే. నన్ను నాకు మిగలనీయని ఈ అనుభూతికి పదే పదే కారణమయ్యే నువ్వు నా జీవితానికి వరం" – రాధామాధవీయం. అక్కడో తరం క్రౌంచ వారసత్వ శాపభారాన్ని వేదనతో మోస్తుంది. సమకూరని మిథున భాగ్యం అందని ద్రాక్షలా ఊరిస్తుంటే అర్థవృత్తంలా అంతా బయటికికనపడిపోతూ, తమని తాము కప్పుకోలేక, విప్పుకోలేక, కాపు లేని అనాథ గాయంలా ముసిరే ఈగల బారిన పడుతుంది. నిన్నటి మొన్నటి చిన్నతనాల కుట్టిన పున్నాగ పూల జడల వాసన ఇంకా పూర్తి గా మనసు లో నిండనే లేదు, విరబుసే కాలాలకు కాలాతీతమయ్యిందని కబురొచ్చింది. నిరుడు కురిసిన కన్నీటి సముద్రాల ఉప్పెన పోటు ఉధృతి ఇంకా తగ్గనే లేదు, మేట వేసిన దిగులు దిబ్బల మధ్య గా రాత్రి కురిసిన వెన్నెల మరక మెరుస్తూ గూడు నుంచి జారిన చిన్నారి చిలుక కళ్ళలో మెరుపులు నింపుతోంది. ఆనంద విషాద రహిత స్వర్గ సీమల్లో అప్సర కాంతలు నాట్యమాడుతున్నారు. 'ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో నిదురించు జహాపనా. నిదురించు జహాపనా.. ' — ఈ కల్పనలకు, యమున రాగాలకు అసలు అర్ధం తెలిపే బేగం యే గానాలు ఆలపించిందో? వైభవాల నడుమ అపూర్వ ఆదరణ పొందిందో,ఆదరణలోనే రగిలే నిరాశల చెరసాలలో మునిగిందో. స్వయంప్రకాశకమైన మణిపూస నవ్వుతో వెలిగిందో, ప్రాణం లేని రాళ్ళ మధ్య ఒక పాషాణమై తళ తళ లు మెరిపించిందో. ఏమో ఆమె మనస్సులో ఎన్ని అగ్ని పర్వతాలే రగిలేయో, అందమే ఆలంబనగా అదే జీవనాధారంగా ఆనందపడుతూ బతికేసిందో. వాకిట ముగ్గుతో ఇంటి శోభని వెళ్ళడించే గృహమొకటి ఊసుల పూసల పల్లకిలో మమతని మోస్తూ ఉంది. ఆలుమగలు — మగని బుగ్గన మిగిలిన తన కుంకుమ గురుతు చూసి ఫక్కున నవ్వుతూ మల్లియకి అసూయ పుట్టించే మగువకి ఆతని మనసే ధామం. ఆ క్షణమే శాశ్వతం. జ్ఞాపకార్దదశ అక్కడ జనించదు. ఈ హోరు ఏమిటి. ఈ అంతర్ముఖ బాహ్యస్పృహల ఆర్బాటం – దర్శనాల ఆరాటాల కలబోత ఎందుకు. ప్రాణం లేని ఈ అక్షరాలని మమకారం తో స్వీకరించే ఓ మనసు కోసమేనా? ఊహాప్రపంచాలు రూపమియ్యమని మూగగా అడుగుతున్నాయి. నిజానికి ఇది సంబరమేమో. సంతృప్తనిశ్వాసల్ని విడువగల అవలోకన భాష్యమేమో. తీక్షణమైన హోరు — కావాలి, దహించాలి. అనుభూతి రవ్వల గనిగా బతుకు మారాలి. 02/11/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lsnpUs

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి