పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, సెప్టెంబర్ 2012, శనివారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || పార్టీ వార్తలు


ఒద్దికగా ఒదిగి
ఆకాశమంత ఎదిగి
ఆయుధమై కదిలే అక్షరాన్ని
రాజకీయ పక్షపాతం
కబ్జా చేసుకుంటోంది

అక్షరాలు సిగ్గు పడుతున్నాయి
అసత్య వార్తల్లో
తమకు అంగీ లాగు తొడిగినందుకు

ప్రతిపక్షానికొకటి
మిత్రపక్షానికొకటి
అధికారపక్షానికొకటి
ప్రజాపక్షానికే
దినపత్రిక కరువయ్యింది

ఎవడి పత్రికల్లో వాడు
గొప్పగానే కనిపిస్తున్నాడు
ఎవడి ఛానల్లో వాడు
మేమే గొప్పని
అరుపులు పెడబొబ్బలు

ఇది
శబ్దం నోరు పారేసుకుంటున్న
మహానగరం
ఇక్కడ
గట్టిగా నోరున్న వాడిదే రాజ్యం

అక్షరానికి పక్షపాతం పులుముతున్న
పత్రికలు, చానళ్ళు
వ్యాపారం రాజకీయంలో భాగమై
రాజకీయమే వ్యాపారమై
పార్టి ట్రేడ్ మార్క్ వార్తలు
చిలకపలుకులై కూత పెడుతున్నాయి

భయపెట్టే అక్షరం
భయపడుతోంది
ఎవడి సొంతానికి వాడు
వాడుకుంటుంటే

పార్టీలకు అమ్ముడు పోయిన పత్రికలను
నడి బజార్లో తగలబెడుదాం
పోనీలే అని కూర్చుంటే
నిజం నిశ్శబ్దంలోకి జారుకుంటుంది మరి !
26-09-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి