పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, సెప్టెంబర్ 2012, శనివారం

యాకూబ్ ॥ లోలోపలి గాధ


ప్రేమకోసమే ప్రేమిస్తున్నానా నిన్ను?
కాదు,
నా సహజస్వభావమే ప్రేమ !
గడ్డిపువ్వు శిరస్సుమీద
తళతళలాడుతున్న మంచుబిందువుల్లా
సందేహాలమధ్య, జీవనభయాలమధ్య ప్రేమికుడిలా ప్రకాశిస్తుంటాను.
ప్రేమ - పూలు వికసించినట్లు
నాలో వికసిస్తుంది.

1
ఎవరో మనసులో ఉన్నారు.గుబగుబలాడే గుండె, అలిసిన వదనం, నిరంతర ఖేదం.!

2
రేవులో బిందె ముంచాను
నీళ్ళకు ప్రేమభాష తెలుసని అపుడే తెలిసింది.
ఆత్మనంతా కూడదీసుకుని అది పలికే బుడబుడలభాష
గులకరాళ్ళపై కదిలి
ఆకుపచ్హ తుంగలతో సంభాషించే
సజలగాత్ర ప్రణయ సంగీతభరిత భాష !

3
బాధను ప్రేమించాను
విషాదంలోని ఆనందాన్ని ప్రేమించాను
ప్రేమలోపలి దుఃఖాన్ని,సంతోషాన్నీ ప్రేమించాను

నన్ను నేను దాచుకునేందుకు
ఇంత పెద్దవెలుగులో కొద్దిపాటి చీకటికోసం
వెతుక్కుంటున్నాను

ప్రేమకోసమే ఇలా ఒంటరినయ్యాను

4
జీవితపు ఆవలితీరాన్ని చూడ్డంకోసమే
నిజానికి
నేను ప్రేమపైన అధారపడ్డాను.!!

---------------------------
*Old text,'సరిహద్దు రేఖ'
28-9-2012

http://www.facebook.com/groups/kavisangamam/permalink/450461978339893/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి