పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, సెప్టెంబర్ 2012, శనివారం

డా. కాసుల లింగారెడ్డి || ఒకానొక అసంపూర్ణ వాక్యం కూర్చి,గురించి....


1
ఒక అసంపూర్ణ వాక్యం గురించి
నేనిప్పుడు మాట్లాడుతున్నా-
భావాల్నే కాదు, భాషల్నీ వక్రీకరించే వాడివియ
అసంపూర్ణ వాక్యాల ఆత్మఘోష నీకేమెరుక?
చరిత్ర పుటల్లో మిగిలిపోయిన
ఒక ఉద్విగ్న అసంపూర్ణ వాక్యం గురించి
మళ్ళీ మాట్లాడుతున్నా-

2
జానెడు భూమిజాగ కోసం
గుప్పెడు తిండిగింజల కోసం
ఒక్క పొట్టతిప్పలు కోసం
ఆ మట్టిపుట్టల కోసం
బారులు తీరిన
బాటెరుగని చీమలు
తొక్కిపెట్టినా కుట్టనేర్వని చీమలు
చిన్ని చిన్ని సర్పాలు చిల్లర దేవుళ్ళు
నడిచొచ్చె దారులల్ల కలిసొచ్చె కాలమది-
దారి కాచి
శత్రువు మంద మలిపి
చెరువు కట్టలేసిన చీమలు-
కందకం తవ్వి
కండ్ల కారం కొట్టి
గుత్పలు చేతపట్టి
గుండెలు ఎదురొడ్డి నిలిచిన దండు-
కత్తుల వంతెన దాటి
కాలాన్ని జయించిన కవాతు-
కొండి విరిగిన తేళ్ళు
కాళ్ళు తెగిన జెర్రి
తోక ముడిచి
కోటగోడల దాగిన రక్తపింజర.
3
వేల పులుల మింగిన అనకొండ
చీమలదండుకు అభయమిచ్చిన అనకొండ
రంగు మార్చి
రక్తపింజరకు రక్షణిచ్చి, రాజభరణాలిచ్చి
మట్టిని తొవ్వి
చెట్టును కూల్చి
పుట్టను తొల్చి
చీమల దండును చిందర వందర చేస్తె
బేత దాటి వైరి పక్షాన చేరిన చిన్ని సర్పాలు
మువ్వన్నెల తువ్వాళ్ళ మాటున ముఖం దాచుకున్న చిల్లర దేవుళ్ళు-
సెప్టెంబర్‌ పదిహేడు
చెదిరిపోయిన ఆశయ పతాక ప్రతీక
ఆగస్టు పదిహేను
అనూహ్య రాకాసి అనకొండ పుట్టిన రోజు
చీమల దండు చరిత్రలో రెండు గ్రహణాలు
ఒక అసంపూర్ణ వాక్యాన్ని నిలువరించిన రెండు కామాలు.
4
ఇప్పుడు
చారిత్రక ద్రోహాలకు
గుండె పగిలిన చీమల దండుకు సైరనూదాలి
దినద్వయం ముఖాల మీద నల్లటి తారు వేయాలి
కామాల కింది కొసలు విరిచి
వాక్యాన్ని పూర్తి చేయాలి.

డా|| కాసుల లింగా రెడ్డి
సెల్‌: 9703432211


రచనాకాలం: 11 సెప్టెంబర్‌ 2007.
ముద్రితము: ఆంధ్రజ్యోతి దినపత్రిక 'వివిధ'లో 17 సెప్టెంబర్‌ 2007.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి