పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

డా. రావి రంగారావు || గుండెకాయను పీకేసుకొని||

పెద్ద ఇబ్బందేమీ లేదు
కాకపొతే
మనిషి మనిషిగా బతకలేకపోతున్నాడు...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపొతే
మనిషి విలువ పాతాళానికి పడిపోతుంటే
మసి విలువ ఆకాశా న్నంటుతోంది...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపొతే
తలకాయలు లేని వాళ్ళు
కిరీటాలకోసం ఎగబడుతున్నారు,
తలకాయలు ఉన్నవాళ్ళు
తమ తలల సంగతే మరిచిపోయారు...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపోతే
ప్రాణాల జల్లులు కురవాల్సిన ప్రజాస్వామ్య కాలంలో
మండే నెత్తుటి ఎండలు జనాన్ని చంపుతున్నాయి...

ఈ రోజు పూవు లెంత “దయనీయం”గా అడుగుతున్నాయో తెలుసా-

మురికి మెడల్లో వేసి మమ్మల్ని అపవిత్రం చేయొద్దని...
రాళ్ళు రప్పలు ఎంత “మొండి”గా కోరుకుంటున్నాయో తెలుసా-
చిల్లర పోరాటాలకు మమ్మల్ని పావులుగా చేయొద్దని...
కిరసనాయిలు, పెట్రోలు ఎంత “ఆవేశం”గా ప్రశ్నిస్తున్నాయో తెలుసా-
పదహారణాల బంగారు ఆడతనం మీద బంగారం కోసం మమ్మల్ని మంటలుగా మార్చొద్దని...
సోడాలు, సీసాబుడ్లు ఎంత “గొంతు”పగిలేలా ప్రాధేయపడుతున్నాయో తెలుసా-
పచ్చి పగల “డ్రయినేజ్” లో మా బతుకు కాయలు పారేయొద్దని...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపొతే
మానవత్వం లేకుండా
ఎదగా లనుకుంటున్నాడు మనిషి,
గుండెకాయను పీకేసుకొని
దాంతో క్రికెట్ అడుకోవాలనుకుంటున్నాడు మనిషి...

పెద్ద ఇబ్బందేమీ లేదు

కాకపొతే
ఈ పూలు, ఈ రాళ్ళు, ఈ కిరసనాయిలు, ఈ సోడాబుడ్లు...
అమానుషాలకు తాము ఆసరా కాకూడ దని
ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాయి,
ఇన్నాళ్ళూ విషాన్ని మోస్తూ వచ్చిన పాత్రలు
ఇప్పుడిప్పుడే తిరగబడుతున్నాయి.\

05-09-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి