పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఆగస్టు 2012, శుక్రవారం

క్రాంతి శ్రీనివాసరావు || దారితప్పిన కన్ను ||

రెప్పలులేని చేపకన్ను వీడిది,
కన్నీళ్ళే మాత్రమూ కనబడనిది
బ్రేకులేకుండా ఇరవై నాలుగు గంటలూ
బ్రేకింగు న్యూసులు సరఫరా చేస్తుంది

వొంటికన్ను రాక్షసుడు వీడు
ఓకే కన్నున్న శుక్రాచార్యుడికి తోడు

అరచేతిలో కేమెరా కన్నెట్టుకొని విర్రవీగుతున్నాడు
అరికాలులో కన్నున్న బృగుమహర్షి ననుకొంటున్నాడు
వాసుదేవుని వక్షస్తలంపై తన్నినప్పుడు
జరిగిన సంగతి తెలియజెయ్యాలిప్పుడు

వొళ్ళంతా కన్నులేసుకున్న ఇంద్రుడననుకొంటున్నాడు
వెకిలి శృంగారచేస్టలు వెలగబెడుతున్నాడు
పరమశివుని మూడోకన్ను తెరచినప్పుడు
మాడి మసయున మన్మధున్ని మరచినట్లున్నాడు

గ్రద్ద కళ్ళెట్టుకొని వీడు
గమనించాల్సినవి విడిచిపెట్టి
సెలబ్రిటీల బెడ్రూముల్లోకి తొంగిచూస్తుంటాడు

గుడ్లగూబ కళ్ళేసుకొని
చీకటి తెరలమాటున జరిగిన నేరాలను ఘోరాలను
భయానకంగా అనవసరంగా గుర్తుచేస్తుంటాడు

కన్నులున్నా వాడకుండా రాడార్ సిగ్నల్స్ నమ్ముకున్న గబ్బిలంలా
రేటింగ్స్ కోసం కేమెరా కన్నుల్ని తాకట్టుపెడుతుంటాడు

కులం తోలు కప్పుకొని రాజకీయ రంగులేసుకొని
అందరికంటే ముందే ఎక్స్లూజివ్ ముసలికన్నీరు కారుస్తుంటాడు

24ఇంటూ7 చిరుతపులి కళ్ళతో చెలరేగుతూనే
ఇంటింటికి నిజాన్ని చెప్పల్సినవాడు
లంచాలనాలతో

ర్ధాం

రం
గా
వార్తను వధిస్తుంటాడు
మరో సంచలనానికై
సరికొత్త టీజర్ బాణం
సందిస్తూనే వుంటాడు

దృశ్యాలకు నోళ్ళుపెట్టి దుర్మార్గాలను ఆపాల్సినవాడు
నిజం నీడల జాడలు పట్టి చరిత్రకోసం దాయాల్సిన వాడు
అజాగళ స్తనమై అఘోరిస్తున్నాడు

ఫొర్తెస్టేట్ గా నిలబడాల్సినవాడు
లేపాక్షీ ఆలయంలో వ్రేలాడే స్తంభమై ఊరేగుతున్నాడు

*23-08-2012

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి