పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, ఆగస్టు 2012, సోమవారం

కాశిరాజు || నాన్న తనంతో కాసేపు||

ఏరా సిన్నోడా
ఎప్పుడూ ఏదో అలోసిత్తావేట్రా?
నీ వొయసులో నేనెంత సురుగ్గా వుండేవోన్నో తెలుసా?
నీకు నా కదసెప్తానిను

నువ్వు యినే వుంటావ్
సరిగ్గా పదేల్లప్పుడే పెల్లిసేసార్నాకు
అప్పుడికి మీయమ్మేమో సీముడుముక్కేసుకుని
ఎర్రబొందులాగూతో
సరిగ్గా ఆ ఈది గుమ్మం మీదే కుచ్చూనుండేది

రాయే అని పిలిత్తే వచ్చేదీకాదు
ఆ గుమ్మం మెట్టుదిగేదీ కాదు
సేన్నాళ్ళు గడిసిపోయిందలాగే
ఆ తర్వాత తెలివొచ్చి,తెలిసొచ్చేసరికి

బల్లో ఒకడు
గుమ్మంలో ఒకడు
ఉయ్యాళ్ళో ఒకడు
తయారయ్యారు మీరు

సంసారాన్ని ఈదటం గురించి మాబాబు నాసొవ్లో ఓమంత్రమేసాడు
అంతే

ముగ్గుబండేసుకుని బయల్దేరాను
సరిగ్గా సీకటడే సరికి
నలభైయూళ్ళు సుట్టొచ్చేవోన్ని

కాతపొద్దోతే సాలు
సుర్రుమనేది మీయమ్మ
రేవవతల రాజుగారింట్లో
పనికోసమెల్లేది
నాకంటే కాతముందే ఇంటికొచ్చేసేది
మీయమ్మకు కొడుకులేమైపోతారో అన్న కంగారుతోపాటు
కటికపేదరికం కూడా కుదురుండనిచ్చేదికాదు

ఎప్పుడూ ఏదోపనే
ఎన్నిపనులు సేసెదనుకున్నావ్?
మీకందరికీ అన్నమెట్టి
మిమ్మల్ల్ని బొజ్జోబెట్టి
ఆ తరవాత నాకూ అమ్మయ్యేది,అన్నమెట్టేది

ఇలాంటివెన్నోరా
ఎన్నని సెప్పను
ఎలగోలాగ
ఇదిగో ఇంతదాకా బతికేసాం

జీవితమంటే ఇంతే్నని సెప్పుకునే
ఎంతో పెద్దదిరా
నీకు మెల్లిగా అర్దమౌతాదిలే
నీజీవితంలో కూడా ఇలాగే
పేనమున్న పదాలెన్నోఉంటాయ్
ఆటినన్నింటినీ కలిపితే నీకు నచ్చిన కవిత్వంలా ఉంటాది నీ జీవితం

అర్దమౌతుందా?

*24-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి