పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఆగస్టు 2012, బుధవారం

భమిడిపాటి || నిట్టూర్పుల రాత్రి: ||


నిట్టూర్పుల రాత్రి
పడమటి రాగం

పాడుతున్న
సంధ్యా సూర్యుడికి వీడ్కోలు చెప్తూ !

చీకటి ప్రపంచం చేసే
మౌన సంభాషణకి తను సాక్షిగా
మానవ మృగాల పైశాచిక క్రీడకి
తనే వేదికగా !

నల్ల బట్ట కట్టుకుని
అలసిన గుండెను నిద్రపుచ్చుతూ
కాలే కడుపుకి
ఇదిగో తెల్లవారు అని ఓదార్చుతూ .....

పగటి పని దొరకని
రాత్రి పని తప్ప వేరే దారిలేని
సమాజం పట్టని
సమాజానికి పట్టని కొందరి కొమ్ముకాస్తూ

ఆకలి అందాన్ని
నిశి రాత్రికి హారతి లిస్తూ
తాము కరుగుతూ కరిగిస్తున్న
తరుణీమణుల కాటుక కళ్ళను ముస్తాబు చేస్తూ

నిట్టూర్పుల రాత్రీ
రోదిస్తోంది
విలువలు విప్పుకుని
చీకటి వలువలు కప్పుకుని

నిట్టూర్పుల రాత్రి
ఉదయ రాగం
పాడుతున్న
అరుణ సూర్యుడికి స్వాగతం పలుకుతూ ...!

*07-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి