పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, జులై 2012, ఆదివారం

డా. పులిపాటి గురుస్వామి || ఉప్పల గట్టు జాతర ||

ఎన్నేండ్లయిందో
నీ ముఖం నాకు చూపించకో 
నాది నీకో 

ఉడుకుతున్న బువ్వ
కలెబెట్ట్టినట్టు నిన్ను
తలుచుకుంటె...

నిన్ను నువ్వు ఇంకా
మార్చుకోక ముందే
నీవు చూసిన నన్ను
కుబుసం విడిచాను

కళ్ళల్లోని వొత్తులు
అమాస చీకట్లని
చిడతల మోతతో
శ్శివ శ్శివ శ్శివ శ్శివ శ్శివ
గొంతులు వెంటపడి
తరిమితే ఉరిమితే
ఆకాశం తెల్లబోయింది గుర్తుందో

గుండంలో వణికిన
బాల్యం
భుజమ్మీద
కూచొని గిల్లడం మానలేదు

గుండుకు రాయికి
వయసొచ్చి పౌడరద్దుకొని
జాగారాలు చెయ్యడం తెలిసి ,
జారుకుంటూ జార్చుకుంటూ చేరి
నీ ఎత్తైన కౌగిలి నుండి
ఈ లోకాల లోయల్ని చూసాక కదా
భూమి ప్రేమికత్వం తెలిసింది

మల్లొక్కసారి కొమ్మలు చాచు
దారులు చీల్చు

నీ లోపలి నీవు తడి పడతావో
నా లోపలి నేను పూతకొస్తానో.


*08-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి