పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, జులై 2012, ఆదివారం

జాన్ హైడ్ కనుమూరి॥22nd July॥


అమ్మ
తన అస్థిత్వాలను ఇక్కడే వదిలి వెళ్ళిన రోజు
***

ఇప్పుడు
అమ్మొక వాస్తవ అనుభవాల జ్ఞాపకం
అనుభవమైన జ్ఞాపకం అక్షరాల్లో ఇముడుతుందా!!

నన్ను శిశువుగా మోస్తూ మోస్తూ
పొందిన అనుభూతిని ఎలా రికార్డు చెయ్యాలి!

గోరుముద్దల తప్పటడుగుల బాల్యం
ఏ మురిపాలను మూటగట్టిందో ఎలా విప్పాలి!

నా దేహానికి పొంగు కమ్మి
వారాలు గడుస్తున్నా తగ్గని కురుపులతో విలవిలలాడుతున్నప్పుడు
మందులిచ్చిన ఆచారి మాష్టారు
పిల్లాడికి ఇష్టమైనదేదైనా చేసిపెట్టమనిచెబితే
నా ఇష్టాన్ని తెలుసుకొని
రాత్రంతా నిదురకాచి వండిన కజ్జికాయల్లో
ఏ పాళ్ళలో ఏమి కలిపివండిందో ఇప్పుడు ఎలా తెలిసేది

* * *

ఏడుగుర్ని కన్నందుకు
గర్భం ధన్యమా!
పురిటినొప్పులు సహించిన శరీరం ధన్యమా!!

సుఖదుఖాఃలను తుంగచాపలుగా అల్లి
మోకరించిన వేకువ జాములు ధన్యమా!!

అమ్మా!!
నా జ్ఞాపకాలపొదిలో నీరూపం
చెదరకుండా
ఇప్పుడు నన్ను నడిపిస్తున్నాయి

నీవు కోరుకున్న ఆశీర్వాదాలేవో
నాపై కుమ్మరింప బడుతూనేవున్నాయి

***

(ఈ మధ్య ప్రవీణ రాసిన "వలయం " కవిత చదివాను

నా దేహం ఓ ఏబైఒక్క సంవత్సరాల్ని పూర్తి చేసుకొని 52లో ప్రయాణం చేస్తుంది.

ఇన్ని వసంతాలు వెనక్కువెళ్ళి గర్భస్థ దశను జ్ఞాపకం చేసుకోవలనే కోరిక తీరేది కాదు కదా!!)
*22.7.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి