పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, జూన్ 2014, ఆదివారం

నవీన్ కుమార్ కవిత

నవీన్ కుమార్!! నేను నా ఆకాశం !! ఆకాశం నా ఆత్మీయ నేస్తం మౌనంగా ఎన్ని సంగతులు మాటాడుకుంటామో! ఎన్నెన్ని కాలాలు ఒకటిగా చూశామో! నేనంటే ఎంత ప్రేమనుకున్నావ్? మనసేం బాలేదన్నాననుకో మేఘాలు సృష్టించీ ముత్యాలు చిలకరించీ ముద్ద ముద్ద చేసేస్తుంది మౌనంగా ఉన్నాననుకో మెరుపులు మెరిపించీ ఉరుములు పలికించీ ఏమైందంటూ ప్రశ్నిస్తుంది ఏం కాలేదని కళ్లికిలిస్తూ నే చెబితేనేమో నీలంగా నవ్వేస్తుంది అటుపోయీ ఇటుపోయీ అదిచేసీ ఇదిచేసీ అలసిపోయీ నేనొస్తే చందమామను పిలిపించి చుక్కల్ని రప్పించి ఎదపై వెన్నెల కురిపిస్తుంది ముభావంగా ఉండి నేనిటుతిరిగి పడుకుంటే చల్లగాలితో చక్కిలిగింతలు పెట్టిమరీ తనవైపు తిప్పుకుంటుంది నల్లగా నాతోపాటే నిదురపోయి నాకంటే ముందే తెల్లగా మేలుకుంటుంది సంతోషం పంచుకోవాలని చేతులెత్తి నే చిందులేస్తే చిరుగాలిలా మారి నన్ను చుట్టేసుకుంటుంది ఒక్కోసారి తనకూ బాధేస్తుంది పాపం! భోరున విలపిస్తుంది తననెవరో కాలుస్తున్నట్టూ తన వలువల్నెవరో విడదీస్తున్నట్టూ భగ్గున మండిపోతుంది ఆకాశం పాపం ఆకాశం.. ఎవ్వరితోనూ చెప్పుకోదు..నాతో మాత్రమే నేనయితే వింటాను కదా! ఏం చేయగలను? తనబాధను కాస్తయినా పంచుకుందామని నిండా తడుస్తాను నీరైపోతాను..కన్నీరైపోతాను నేనేడ్వడం చూడలేక కాసేపటికి శాంతిస్తుంది ఆకాశం నేనుమాత్రం, నాలో నిండిన తన దుఃఖాన్ని బొట్లు బొట్లుగా పిండేస్తాను ఆకాశానికి దెయ్యాలంటే భయం నలువైపుల్నుంచీ ఈ మధ్య దెయ్యాలు చుట్టుముడుతున్నాయి నలిపేస్తున్నాయి.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి వయొలిన్ పై విషాదగీతంలా వినిపిస్తుంది ఆకాశం ఆర్తనాదం తనకెంత బాధవుతుందనీ! నాకెంత బాధవుతున్నదనీ! ఒంట్లో ఒకమూలకం ఒంటరిగా పోరాడుతున్నభావన.. నన్నూ తనలో కలిపేసుకోమనీ నేనూ తనకు సాయపడతాననీ ఎన్నోసార్లు చెప్పాను.. కరుణామయి కదూ నా ఆకాశం కాదంది! కనీసం తన కన్నీళ్లయినా తుడుద్దామంటే నా చేతులేమో చాలడంలేదు అందుకే రెండు మొక్కల్ని పెంచుతున్నాను అవి ఏనాటికైనా ఆకాశమంత ఎత్తుకు ఎదిగి నాచేతుల్తో తన చెమ్మను తుడుస్తాయని ఆశ రోజూ నీరుపోసేటపుడు చెమర్చే నా కళ్ల సాక్షిగా నా ఆకాశాన్ని ఓదార్చుతాయని ఆశ! ........22/06/2014

by నవీన్ కుమార్from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nVtIBL

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి