పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, మే 2014, శనివారం

Santosh Kumar K కవిత

||దీవి|| శీర్షిక: "నా బ్రతుకెంత ఘనకీర్తిని తెచ్చిందో తెలీదుకాని,స్వగతమంతా మాయని గాయాలనే మిగిల్చింది", అని ఆవేదనకి గురైన ఒక అనాథ అన్న మాటలు గుర్తొచ్చి ఆ అనాథ బ్రతుకులలోని భారాలను ఆ జీవితాలపై నా భావాలను ఈ కవితాక్షర మాలికలో రాయటానికి ప్రయత్నించాను!! తెగిపడిన మువ్వని నేను.., సవ్వడిని కోల్పోయాను..!! నేలరాలిన ఆకుని నేను.., ఎండుటాకులా మిగిలిపోయాను..!! నేనెవరో తెలియని నాకే నేను.., నిన్నలోనున్న నన్నే నాకన్నీ అనుకున్నాను..!! నాకున్నదేవరో కానరాక ఏకాకినయ్యాను.., అడిగేవాడు లేక.. అడగనూలేక.. అడుగులేస్తున్నాను..!! ఒంటరితనమంటే ఏంటని.. అనాథ బ్రతుకు భారమెంతని.., ప్రశ్నల బంధుత్వాలే తప్ప సమాధానాల బాంధవ్యాలెరుగని.., సంకెళ్ళు వేయని జీవిత ఖైదీని.. ఎలా చెప్పగలను వీటన్నింటికి బదులుని!! సమాధానంలేని ప్రశ్నలు ఎన్నున్నా నాకుండాల్సిన ప్రయోజనాలూ ఉన్నాయి..., నేను పుట్టుకతోనే స్వేచ్ఛావిహారిని, నా కన్న వాళ్ళకి నా మీద అంత నమ్మకం ఉంది మరి!! నేను పుట్టుకతోనే అజాతశత్రువుని, ఎంతోమంది నాలాంటి వాళ్ళకి ఆప్తుడిని అయ్యాను మరి!! నేను పుట్టుకుతోనే పరిశోధకుడిని, చెత్త కుండీలో ఉన్న అన్ని వస్తువులను పరిశీలించాను మరి!! నేను పుట్టుకతోనే ధనవంతుడిని, పసిగొడ్డుగానే నడిరోడ్డుపై నా మీద చిల్లర వర్షం కురిసేది మరి!! తోడులేని నాకు ప్రకృతమ్మ ఒడిలో నీడ దొరికింది, దారిలేని నన్ను రహదారుల రాకుమారుడిని చేసింది!! పూలజల్లుతో స్వాగతించే వసంతాన్ని చూపింది, నేను పని చేసే పూల కొట్టులో అన్ని పూలను చూశానుగా!! మండుటెండల గ్రీష్మాన్ని చెట్టునీడ నుండి చూపింది, ఆ చెట్టుకిందే నేను చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడినిగా!! కన్నీటిని చెరిపే పన్నీటి జల్లుల వర్షాన్ని తెచ్చింది, పెళ్ళిళ్ళలో,పెరంటాలలో నీరు,పన్నీరు నేను మోయనిది ఎదీ లేదుగా!! మేమంతా నీవాళ్ళమేనంటూ శరత్తులో చుక్కలతో చెప్పించింది, రాతిరైనా ఆకాశాన్ని చుక్కలని చూస్తూ టి అమ్ముకుంటూ తిరిగేవాడినిగా!! వణికించే హేమంతాన్ని తెచ్చి నా కష్టాలని చల్లబరచాలనుకుంది, ఆ చలిలో ఎంతోమందిని ఒకే కాలిదోవలో పరిచయంచేసుకున్నానుగా!! ఆకులు రాలే శిశిరాన్ని చూపి రాలే ఆకులను నీకు తోడంపాను అంది, ఆ ఎండిన ఆకులను బుట్టల్లోకి ఏరుకుంటే మంచి సంపాదన వస్తుండేదిగా!! గడిచే కాలంలోని చేసిన పనుల్లో మిగిలిన జ్ఞాపకాలలో ఏనాడూ నేను తోడులేని నీడలేని వాడిని అనే భావం లేకుండా చూసుకుంది ఆ ప్రకృతమ్మ!! ఉరుకుల పరుగుల జీవన పోరాటంలో, ఎటుచూసినా అవకాశమనే అవసరాలు తప్ప, ఆప్యాయతలు అనురాగాలు లేని లోకమిది!! నా వారని.. నాకెవరూ లేరని చింతే లేదు, ఉన్నా మోసం చేస్తారేమో అన్న భయం అసలే లేదు!! అడవిలో తోడులేదంటే అతిశయోక్తి అనుకున్నాను కానీ ఈ జనారణ్యంలో అయోమయంలో సంచరించే మనుషులనే ఈ యాంత్రిక వస్తువులను చూసి ఏమిలేకపోయినా.. ఎవరికీ తెలియకపోయినా.. కాలుష్యమెరుగని కలుషితమవని మనసే ముఖ్యమని మానవడు కాలుమోపని ఈ సృష్టికే తెలియని ఒక దీవిలా మిగిలిపోవటం ఎంత మనోహరమని తెలిసింది!! #సంతోషహేలి 03MAY14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nbnnBE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి