పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, మే 2014, బుధవారం

Ramaswamy Nagaraju కవిత

కవిత : ('సిలికాన్ఆంధ్రా' వారి ఈ -పత్రిక 'సుజనరంజని' ఏప్రిల్ 2014). ........॥ మృత్యు సంధ్య ॥........ అవసాన ఘడియల్లో అల్లాడిపోతుంటాడు ఆత్మారాముడు అర్ధ చైతన్యపు సరిహద్దుల మీద, సాగిపోతుంటాడు తడబడుతూ తాపం తడిపిన తడితోవల్లోంచి కడపటి పడమటి నీడల్లోంచి అనంత ప్రస్థానం కేసి ఆశరీరంగా సుషుప్తిలో కరుగుతున్న స్వప్నంలా. పొడలు పొడలుగా కదలుతున్న పరాపర స్పృహ పొరలు పొరలుగా చీలుతున్న ఇహపర స్పర్శ భావాభావ అస్పష్ట సంధి గీత మీద ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు సంధిదోషం కమ్మిన సాయంత్రపు నీడలు ! అపస్మారం చిమ్మిన ఆఖరి మెరుపులు ! వెన్నంటే వెలుగు నీడలకు అతని అడుగులకింద ఆశ్రయం దొరుకదు రాలిపడుతుంటాయి ఒక్కొక్కటిగా ఆతని చాపల్య చాపంలోని సప్తవర్ణాలు మెడ తిప్పిన నిర్లిప్త పడమర కడసారి ఉషస్సు కేసి చూపు తిప్పుతుంది ఆరీఆరని తూరుపు చక్షూరాగం ! మూసీ మూయని జీవన దిన ద్వారం! ఏవో నీరెండల పరాధ్యాస అంతిమ శోషల ఆఖరు శ్వాస అంతరాంతరాలలో ఎక్కడో గుండెను తవ్వుతున్న గునపం సవ్వడి నాభిని పెకిలిస్తున్న అలికిడి ఆత్మబంధాలు తెగుతున్న అలజడి . ఆవలి తీరం అస్తమయం పిలుస్తుంటుంది పడవ పడమటి గట్టున వేచియుంటుంది ఎర్రెర్రని మరుభూమిలో ఎండుటాకు ఎగురుతుంటుంది కళ్ళు సోలిపోతుంటవి కాళ్ళు తూలిపోతుంటవి దేహం తేలి పోతుంటుంది గొంతు లోతున పడుతుంది పిడచ కట్టిన నాలుక ఆఖరి మాట మరుస్తుంది ఆకాశం సంధ్యను వర్షిస్తుంటుంది చీకటి కౌగిలో నీడ నిద్రలోకి జారుకుంటుంది రంగు రంగుల దీపం చరమ సంధ్యలో సమాధి అవుతుంది. --నాగరాజు రామస్వామి. Dt :14.05.2014.

by Ramaswamy Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qBjIBQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి