పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మే 2014, బుధవారం

Aruna Naradabhatla కవిత

సాధికారం-స్వాధీనం ______________అరుణ నారదభట్ల ఊరేగింపుకు బయలుదేరిన ఉత్సవవిగ్రహంలా...పేరుకే నేను! కారుతున్న చెమటచుక్కలను కొంగుకద్దుకుంటూ ఏదో సాధించాలని ఆరాటపడతాను! సాధికారత పోరులో చింగు చెక్కుకొని కొంగు బిగించి అడుగులను వడివడిగా నాట్యమాడించాలని కలలు గంటాను...! వేసే ప్రతి అడుగూ నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానని అనుకుంటాను...పేరుకుపోతున్న దుమ్ము సాక్షిగా! క్షణకాలం తీరిక లేకుండా అలుపెరుగక నడుస్తూనే ఉన్నా...కానీ నెల ప్రారంభపు జీతం ...నెలాఖరు జీవితం... గమనిస్తే నా ఈ విప్లవం ముసుగు నిజరూపం తెలుస్తుంది! ఉద్యోగం చేసేది ఎవరో ఇప్పటికీ తెలియదు... చేతిఖర్చులకు చేయిచాచినప్పుడల్లా ఈ జీతం...జీవితం మరోసారి వెక్కిరిస్తుంది...నేను భరిస్తున్న శ్రమదోపిడి వైపు చూసి! సంపాదనలో సమానత్వాన్ని ఆహ్వానించిన మనసు చూసుకునే బాధ్యతలనీ సమంగా పంచుకుంటుందా...!?! మంచినీళ్ళూ...మురిపాలూ అన్నీ చేతికందించనిదే ముద్ద గొంతును దాటదు! ఇక రాజకీయమైతే సరేసరి! నిలబెట్టేది నన్నూ...ఏలుకునేది నువ్వూ! పెద్దరికంగా తెల్లకాగితంపై నల్లగీతలా సంతకం నాదే....సమ్మతి మాత్రం నీది! ఎలాగైతేనేమి నా ఆర్థిక స్వాతంత్రం నీకు పరిపూర్ణ స్వేచ్చనిచ్చింది! సంపాదించినా ఇంటికి ఇచ్చే పని లేదు... వ్యసనాలకు కొదవ లేదు! లెక్కలడిగి ఎదిరించేవారూ లేరు! స్వేచ్చా నీ జన్మ హక్కు... నిన్ను పెంచిన తల్లినీ నేనే... లాలించిన ష్త్రీమూర్తినీ నేనే! నీ అవసరాలకు నలుగుతున్న నాయికనూ నేనే! సమానత్వం....సాధికారం అన్నీ కూర్చుని కబుర్లు చెప్పినంతవరకే... లోపలంతా పాతప్రపంచమే! ఎదురీదితే అన్నీ అనుమానాల దుప్పట్లే ... వొంటినిండా చుట్టుకున్న పరువును... కలుషిత పదజాలంతో కాలరాచే కలిపురుషుడవు..... ఆత్మాభిమానంపై దెబ్బతీయడమే నీకు తెలిసిన చివరి అస్త్రం... మాటలతో లొంగదీయడం నీ అభిమతం... అందుకేనేమో విరుచుకుపడుతున్న విప్లవంలా ఆడతనం... సంస్కృతీ...సాంప్రదాయాలకు స్వస్తి చెబుతుంది... స్వేచ్చగా బతకడానికి పిడికిలి బిగించింది! ఈరోజే అంతం కాకపోయినా..... శిశుపాలుడూ కృష్ణుని చందానా తప్పులను జమచేస్తూనే ఉంది! అరాచకం కాలగర్భంలో కలిసేవరకూ... అలుపెరుగక పయనిస్తూనే ఉంది... ఆడతనం ..అమ్మతనం పక్కన బెట్టిన అగ్ని కణం! 21-5-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ndGFK7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి