పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మే 2014, శుక్రవారం

Abd Wahed కవిత

ఈ రోజు ఉర్దూ కవిత్వ నజరానాలో గాలిబ్ సంకలనంలోని 16వ గజల్ చూద్దాం నాలా దిల్ మేం, షబ్ అందాజె అసర్, నాయాబ్ థా థా సపందె బజ్మె వస్లె గైర్, గో బేతాబ్ థా గుండె మంట ప్రభావం చీకటిలో కనబడలేదు నల్ల గింజ కూడా ప్రత్యర్థిని ఆపలేదు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. నాలా అంటే ఆర్తనాదం, ఘోష. నాలాయే దిల్ అంటే గుండె ఘోష లేదా గుండె మంట, విషాదం వల్ల వచ్చిన గుండె బాధ. అందాజె అసర్ అంటే ప్రభావం గురించిన అంచనా అంటే ప్రభావం ఎంత ఉందో చెప్పడం. నాయాబ్ అంటే అలభ్యం, ఇక్కడ అర్ధం ఆ ప్రభావం కనబడలేదని. సపంద్ అనేది ఒక నల్లగింజ, చెడుచూపు ప్రభావం నుంచి, దిష్టి తగులకుండా ఉండడానికి దీన్ని కాల్చుతారు. అదృష్టం కోసం వెంట ఉంచుకుంటారు. బజ్మ్ అంటే సమావేశం, వసల్ అంటే కలయిక, గైర్ అంటే పరులు, లేదా ప్రత్యర్థి. బేతాబ్ అంటే అసహనంగా ఉండడం. ఇది నిజానికి వ్యంగ్య కవిత. కాని గాలిబ్ దీన్ని చాలా సీరియస్ గా చెప్పాడు. ఈ కవితలో కూడా ఒక దృశ్యాన్ని చిత్రీకరించాడు. కవితలో పంక్తులు సూచించే ఆ దృశ్యం ప్రేమలో ఒక త్రీకోణాన్ని చూపిస్తోంది. గాలిబ్ ప్రేయసి అతనితో లేదు, మరో ప్రత్యర్థి ఉన్నాడన్న సూచన ఇందులో ఉంది. ప్రేయసి తన పట్ల ఆసక్తి చూపకుండా ప్రత్యర్థి పట్ల ఆసక్తి చూపిస్తే సహజంగానే గాలిబ్ గుండెల్లో మంటలు మండి ఉంటాయి. గుండెబాధతో ఘోషించి ఉంటుంది. గుండెలు పిండేసే బాధతో ఎవరైనా చేసిన ఆర్తనాదాలు ఆకాశంలోని దేవుని వద్దకు చేరుతాయని, దేవుని కారుణ్యం కురిసేలా చేస్తాయని అంటారు. దీన్నే గాలిబ్ తన కవితలో వాడుకున్నాడు. కవితలో ఇచ్చిన భావం ఏమంటే, గాలిబ్ గుండె మంటతో ఒక రాత్రి తీవ్రమైన బాధలో గడిపాడు. కాని హృదయాన్ని పిండేసే ఆ ఆర్తనాదాలు, గుండెమంటల ప్రభావం (అంటే అవి ఆకాశాన్ని చేరిన సూచన) ఆయనకు కనబడలేదంట. దానికి కారణం తన గుండెమంట తనకు ప్రతికూలమై ఉండొచ్చంటున్నాడు. ఆయన వద్ద ఉన్న సపంద్ (అదృష్టాన్నిచ్చే నల్లగింజ)ను ఆ గుండెమంట కాల్చేసింది. సపంద్ ను కాల్చితే అది చెడు చూపు నుంచి కాపాడుతుంది. దిష్టి తగులకుండా చేస్తుంది. తన ప్రత్యర్ధి పట్ల అసూయతో ఉన్న గాలిబ్ దిష్టి ఆ ప్రత్యర్ధికి తగులకుండా కాలిపోతున్న సపంద్ కాపాడింది. ఫలితంగా గాలిబ్ గుండెఘోషల ప్రభావం పడకుండా ప్రత్యర్థి సురక్షితంగా ఉన్నాడు. ప్రేయసితో సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ గాలిబ్ ఒంటరిగా అలమటించక తప్పలేదు. అంటే గాలిబ్ గుండెఘోషే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది. ప్రత్యర్ధిని కాపాడింది. నిజానికి ఇది వ్యంగ్యకవిత. ఆర్తనాదాలు, గుండెమంటలు, హృదయఘోషలను గాలిబ్ ఈ కవితలో పరిహసించాడు. ఎంతగా దుఃఖించినా, ఎంత విలపించినా, ఆ వేదనలు, రోదనలు దేవుడు విని కాపాడ్డం ఏమో కాని వాటి వల్ల కనీసం తన వద్ద ఉన్న సపంద్ వంటి అదృష్ట గింజ కూడా ప్రతికూలంగా పనిచేసిందంటున్నాడు. రోదనలు నిజానికి దేవుడికి చేరి ఆయనకు కావలసిన సహాయాన్ని దొరికేలా చేయాలి, కాని రోదనల మంటకు సపంద్ కాలిపోవడంతో, ఆయనలో ఉన్న ఈర్ష్యాసూయల నుంచి ప్రత్యర్థికి రక్షణ లభించింది. అంటే, రోదనలు అవివేకంగా పనిచేశాయి. ఇక్కడ ఈయన రోదిస్తున్నాడు, అక్కడ ప్రత్యర్థి హాయిగా ఉన్నాడు. ఈ కవితలో ఒక గొప్ప పాఠం కూడా ఉంది. ఈర్ష్యాసూయలతో రోదించినా దాని ఫలితం ఉండదని చెప్పడం. దేవుని కారుణ్యం అన్నది ఇలాంటి అసూయపరులకు లభించదని చెప్పడం ఈ కవితలో చూడవచ్చు. ఈ మాటలు చెప్పడానికి ఆయన ఎన్నుకున్న కవితావస్తువు త్రికోణ ప్రేమ. వ్యంగ్యంగా తన రోదనలే తన కొంపముంచాయని అన్నాడు. ఇది ఈ వారం గాలిబానా. కేవలం ఒకే ఒక్క కవిత పోస్టు చేస్తున్నందుకు మన్నించాలని కోరుతూ... వచ్చేవారం మరిన్ని గాలిబ్ కవితలతో మళ్ళీ కలుసుకుందా.. అంతవరకు సెలవు, అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/R8cUM3

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి