పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, ఏప్రిల్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 24 (కవి సంగమం) " నివురు" (కవిత్వ సంపుటి) "కొండేపూడి నిర్మల "---సంపుటి రాసిన కవయిత్రి సంపుటిని పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి" "నిగూఢ కోణాలని "నివురు"లో నిక్షిప్తం చేసిన కవయిత్రి కొండేపూడి నిర్మల” "కదిలే నీళ్ళ మీద కదలకుండా కూచుని చేపల కోసం వల విసిరాడా కుర్రాడు."కదలని గట్టు మీద కుదురుగా కూచోలేక పద్యం కోసం "వలవిసిరింది కవయిత్రి.పద్యం ముందు పడుతుందా?చేప ముందు పడుతుందా?-అని ఎదురుచూసిన కవయిత్రి "కవ్వించీ కవ్వించీ అంత పెద్ద సూర్యబింబం ఆ కుర్రాడి వల్లోనే పడటం 'కోరిక మీరా నాలుగు నల్ల మబ్బులు" వాడి వల్లోనే వాలడం చూసిన ఆవిడ"నా కాగితం మీద ఒక పాదముద్రా లేదు"-అని దిగాలు పడుతుంది.ఇలా దిగాలు పడుతున్న కవయిత్రి ఎవరో కాదు "తన కవిత్వ పాదముద్రలతో కుటుంబం,రాజ్యం,చరిత్ర అనేక విధాలుగా స్త్రీలను "ఎమోషనల్ బ్లాక్ మెయిల్"చేసి అణివేస్తూ,ఆ అణిచివేత ప్రయత్నాలనే ఆత్మీయ సంబంధాలుగా భ్రమ పెడుతున్న వాటిని బద్దలు కొట్టే బాధ్యతను" చాలా కాలం నుంచి మోస్తున్న కవయిత్రి కొండేపూడి నిర్మల గారే. "చేప అయినా పద్యం అయినా"-అనే పద్యంలో"కోరిక అంటూ వుంటే లీనం కావాలి చేపకైనా,పద్యానికైనా"-అని కొండేపూడి నిర్మల గారు అంటారు.ఈ కవయిత్రి కవిత్వం లోని నిగూఢ కోణాలు దృశ్యం కావాలంటే ఆవిడ కవిత్వంలో కోరికవుండి లీనమైతేనే అది సాధ్యమవుతుంది.స్త్రీలకు సంబంధించిన కవిత్వాన్ని,స్త్రీలకే సంబంధమైవున్న అంశాలని స్త్రీలే మాట్లాడితే హృదయపు లోతుల్లోంచి వినిపించబడుతుంది.కానీ స్త్రీ స్వరంతో మగ కవులు,పురుష స్వరంతో కవయిత్రులు రాయడం వల్లా కలిగే ప్రయోజనం తక్కువ అని చే.రా గారు అంటారు."నివురు" అనే శీర్షికతో ఈ సంపుటిలో ఏ కవితా లేదు.అయితే దుఃఖపు నివురు కప్పిన "నిప్పు"అనే కవితను నిర్మల గారు పురుష స్వరంతో పురుషుని కోణంలోంచి రాసినట్లు అనిపిస్తుంది.మరణించిన తండ్రి శవంతో "కొడుకులున్నదే తల కొరివి పెట్టడానికంటే / నీ అయిదో కూతురిగానే పుట్టే వాన్ని కదా నాన్న /మగవాడు కన్నీటిని అనుభవించడానిక్కూడా అర్హుడు కాడా?"-అని ప్రశ్నించుకొంటాడు. ఈ వాక్యాలు చదివింతరువాత స్త్రీల దుఃఖపు,కన్నిటిని,వాటి వెనుకగలకారణపు కుట్రల్నీ సహానుభూతితో మగవాళ్ళు వ్యక్తీకరించవచ్చు కదా అని ఈ సంపుటిని పరిచయం చేస్తున్నా.అయితే కవయిత్రి ఉద్దేశ్యం ఏడ్చే మగవాళ్ళను ఆడవాళ్లలాగా ఏడుస్తావెందుకు?"-అని పోల్చడాన్ని నిరసించడానికి పైన పేర్కొన్న వాక్యాలను చెప్పారేమో? జెండర్,మాతృత్వం,పితృస్వామ్యం,లైంగికత అనే ఈ ప్రధానసమస్యల చుట్టూ అల్లుకొన్న సూక్ష్మాతిసూక్ష్మ అంశాల్ని సైతం తమ కవిత్వంలో అనుసంధానిస్తూ,వాటిని తార్కింగా చిత్రిస్తూ స్త్రీ వాద కవిత్వం ఎదుగుతూ వొచ్చింది.అలా ఎదుగుతు వచ్చిన క్రమంలో స్త్రీ వాద కవిత్వం స్త్రీ ఎదుగుతున్నంత మేరా స్త్రీని మనిషిగా గుర్తించాలనే ధోరణిని బలంగా సమాజంలో వ్యాపింపచేసింది.ఆ సందర్భంలో స్త్రీవాద కవిత్వ నదికి ఇరువైపులా రెండు దరుల్లా నిలిచి ఆ నది ప్రవాహవేగాన్ని మరింత ఉధృతం చేసింది ఇద్దరు నిర్మలలు.ఒకరు కొండేపూడి నిర్మల,మరొకరు ఘంటశాల నిర్మల.కాని చాల కాలం క్రితమే ఘంటశాల నిర్మల రాయడం ఆపేసినట్టున్నారు. కొండెపూడి నిర్మల గారు మాత్రం తన కవిత్వంలో ఎన్నో నిగూఢకోణాల్ని నిక్షిప్తం చేస్తూ,ఎందరికీ కష్టం అనిపించినా నమ్మిన మంచిని పచ్చి నిజాల్ని తెల్పే తత్వంతో,మనసులో ముసురులా పట్టి వుండే కవిత్వాన్ని కొనసాగిస్తూవొస్తున్నారు."సంధిగ్ధ సంద్య"లో కవిత్వం ఆరంభించిన నిర్మల గారు "నడిచే గాయాలు" ఏవో మనకు చెబుతూ,ఆ గాయాల సలపరం ఏమిటో తెలియచేస్తూ, బాధలు పడి నిందలు పొందిన స్త్రీ అనే "బాధాశప్త నది"యొక్క లోతుల్లోని దుఃఖపు రహస్యాల్ని విప్పిస్ఫురింప చేస్తూ, వస్తువుల్నే రక్తమాంసాలున్న ,రాగద్వేషాలున్న ఆత్మీయమనుషులుగా మభ్యపెట్టుకొనే లక్షణాన్ని నేర్పుతున్న బహుళ జాతి సంస్థలు చేస్తున్న మోసాల్ని,కుట్రల్ని "మల్టి నేషనల్ ముద్దు"గా తెలియచెప్పిన కవయిత్రి కొండేపూడి నిర్మల గారు. తెల్ల తోలు వుండటమే నిజమైన అందం అనే అబద్దాన్ని నమ్మి ఆ "అబద్దం" కోసం యుధ్దాలు చేస్తున్న నల్ల అబ్బాయిలు ,తెల్ల అబ్బాయిల మూర్ఖత్వాన్ని,గాజు రాయి మీద అరిగిపోతున్న అమ్మాయిల జీవిత వెన్నెముకల్ని కృంగదీసిన గాలికెగిరే పిట్ట ఈక లాంటి అందానికి కొలబద్ద అనుకున్న అమెరికా పంపిన "అబధ్దం"ను తన కవిత్వపు నిగూడతతో మెరిపించిన కవయిత్రి కొండేపూడి నిర్మల గారే.("అబధ్దం")1 ఇరవయ్యారు అక్షరాల శకలాలతో,మోసకారి అక్షరాలతో సంతకం చేయించుకొని తల్లికి రావాల్సిన వితంతు పెన్షన్ ను తనపేర రాయించుకొన్న క్రౌర్యపు కొడుకు కుట్రను,అందుకు కారణమైన పరాయి భాష దాపరికపు మోసాన్ని,కొడుకుల కపటత్వానికి తోడైన నెల తక్కువ భాషని ,మగవాడే కాదు పరాయిదైన భాష కూడా స్త్రీలను దగా చేస్తుందన్న నిజాన్ని తన కవిత్వంతో నిరూపించిన కవయిత్రి నిర్మలగారు. (వివర్ణ మాల)2 కళ్ళున్నందుకు సాక్ష్యంగా కన్నీళ్లను మూట కట్టి గుజరాత్ లో గాయపడిన శిబిరాల శిథిలాల కన్నీటి వాసనని తన కవిత్వంతో మనకు చూపునిస్తున్న రెండు కళ్ళలో వొక నిశ్చల చిత్రం చేసి మన ముందు నిలబెట్టిన కవయిత్రి నిర్మల గారు.("కట్టె-కొట్టె-కాల్చె")3 స్టెరిలైజ్ చేయని సూది మందు కారణంగా పులకరింతల మధ్య ఆటోలో ప్రయాణం చేస్తున్న అమ్మా నాన్నల మధ్య వారిలో వారికే వొకరిమీద వొకరికి అనుమానం కలుగచేసే ఆ యిద్దరి ప్రపంచాల గాలి బుడగను పేల్చి వేసే ఎయిడ్స్ వైరస్ అంటి పుట్టిన పాప విషాదాన్ని కరుణరసాత్మక కవిత్వమ్ చేసిన కవయిత్రి కొండేపూడి నిర్మల గారు.(సూదిపోటు న్యాయం)4 ఇట్లా ఎన్నో కవితలు నిర్మల గారి దార్శనిక శక్తిని,నిర్మాణ వైచిత్రిని,శిల్ప నైపుణ్యాన్ని మనం లీనం అయితే మన ముందు పరుస్తాయి. నిర్మల గారు కవిత్వం రాయడానికి ఏ మాత్రం ఇబ్బంది పడరు.తపన మాత్రం పడతారు.మాములు మాటల్నే కవిత్వం లో పొదుగుతూ,మనసును కట్టి పడేసే భావసంచయాన్ని కవిత్వం చేస్తూ పాఠకుల్నీ తన కవిత్వం ముందు నిలిపేస్తారు. "గ్లోబులో ఏ మూలనుంచో తీగ లాగుతావు/డొంకలా కదిలి పోతాను/అమ్మా...!నేను ఎలావున్నావు"-ఈ వాక్యాలు " చాడీలు" అనే కవిత లోనివి.మాములు మాటల్నే పొదుగుతూ రాసిన కవిత ఇది.ఇందులో మాటల్ని"మెత్తని నీళ్ల చప్పుడితో పోల్చింది.అలా పోల్చడంలోనే కవయిత్రి ప్రతిభ పాఠకుల దృష్టిలో పడటానికీ అవకాశం వుంటుంది.ఇలా ఎందుకు పోల్చిందంటే 'ఆ మాటలు చిట్టి చేప పిల్లల్లా గది నిండా ప్రవహించినపుడు గది అక్వేరియమ్ అవుతుందని వొక దృశ్యం రూపు కట్టడానికే. ఆ అక్వేరియమ్ లో రకరకాల చేప పిల్లలు వున్నట్టు రకరకాల భావాలు అమ్మ మదిలో పేరుకొని"నిన్న పొడిగా వున్న మనసు గది తన పిల్లలు పల్కరించినపుడు తడిగా ఎందుకయ్యిందో పోల్చుకోలేని దిగులుతో తల్లడిల్లిన అమ్మ మనసు లోని తడిని కవయిత్రి గొప్పగా మన హృదిలో కల్గిస్తారు.ఎక్కడో గ్లోబులో అంటే ఖండఖండాంతారాలలో అని.తీగ లాగడం అనే జాతీయాన్ని ప్రయోగించి ఆధునిక సమాచార వ్యవస్తని స్ఫురణకీ తెచ్చారు.ప్రయోగించే ప్రతి పదానికీ ఒక సార్థకతను ఈ కవయిత్రి అభిలషించడం సంపుటిలో చాల చోట్ల గమనించవచ్చు. ఈ సంపుటిలో కవయిత్రి శిల్పనైపుణ్యాన్ని ,చేప్పే తీరుని అత్యంతంగా పఠితలచే ఆకర్షించబడే కవితలు అనేకం కనిపిస్తాయి.నన్ను నిలబెట్టి ఆద్యంతం నన్ను నీరు నీరు చేసిన కవితలు "ప్రేమ మాధుర్యం",వాన -బురద",.....రిస్క్ తీసుకొంటాను" అనేవి. కవయిత్రి అనితర సాధ్యమైన శైలి ,ఆ శైలికనుగుణంగా వొక వ్యూహాత్మక నిర్మాణ చాతుర్యం,ప్రతిభా మూలకమైనా పదప్రయోగ సాఫల్యం ఇవన్ని ఈ రచయిత్రి చాల కవితల్లో ప్రదర్షిస్తుంది. "సాయంత్రం ఆరు గంటలు.... బ్రెయిలి క్లాస్ కి ఆట విడుపు గంట మోగింది చైతన్యపురి చౌరాస్తా నుంచి ముగ్గురబ్బాయిలు దూసుకొచ్చిన బస్ కింద పడబోయి నిలదొక్కుకున్నారు "కళ్లు నెత్తికెక్కాయా?"డ్రైవర్ అడిగాడు(1) వాళ్ళు మాట్లాడ లేదు ఒకరి చేతులుమరొకరు పట్టుకొని రోడ్డు దాటారు ఇ-సేవ సెంటర్ కివతల మలుపు మీద నించున్న అమ్మాయిలకి ప్రాణం వచ్చింది గల్లీ రౌడిచూపుల్ని విదిలించుకొని ఒక్కసారిగా ముందుకొచ్చారు. 'శాజహానా ఎక్కడున్నావు?(2) స్వప్నా నే వచ్చాను చూశావా!(3) ఎస్తర్ ఇవాళా వచ్చిందాండీ?(4) ఎవరీ ప్రపంచాన్ని వాళ్లు పేరు పెట్టి పిలిచారు వారం రోజుల పాటు ఉగ్గబట్టుకున్న ఏకాంత దుఃఖం అబ్బాయిల మాటల్లో బట్వాడ అవుతుంది. అమ్మాయిలు మాట్లడలేదు. షాజహానా పక్కకొచ్చి ఒక అబ్బాయి చేతిలో మధుర గీతం రాస్తోంది స్వప్న అలిగినట్టు నుంచొని అబ్బాయి పెదాల మీదున్న మాటల్ని అల్లుకొని మెడలో వేసుకొంది ఎస్తర్ నవ్వుకొంటూ ముందుకొచ్చి అబ్బాయి చెవిలో ఏవో కొన్ని అక్షరాలు ఉఛ్ఛరిస్తోంది ఇక్కడ నిజంగానే ప్రేమ గుడ్డిది ప్రేమ మూగది ప్రేమ చెవిటిది" ఇలా సాగి పోతుంది. కవిత.ఇందులో ఏం వుంది అనుకోవచ్చు.కవయిత్రి ఎంత శిల్ప నైపుణ్యంతో కవిత్వాన్ని నిర్మించిందో పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ కవితలో చెప్పబడిన ముగ్గురు అబ్బాయిలు కంటిచూపులేని వారేనన్న విషయాన్ని "బ్రెయిలీ క్లాస్ కీ ఆటవిడుపు గంట మోగింది"అన్న వాక్యం ద్వారా,"కళ్ళు నెత్తికెక్కాయా?"-అన్న డ్రైవర్ అడగటం ద్వారాను మనకు తెలుస్తుంది.ఆ ముగ్గురిలో ఒకరు "షాజహానా ఎక్కడున్నావు?"-అని అంటాడు.ఈ మాట అన్నది కంటిచూపు లేని అబ్బాయే.షాజహానా కూడా కంటి చూపు లేని అమ్మాయి.కాబట్టే అతడు ఆమే మాట ద్వార ఆమె ఎక్కడుందో తెలుసుకున్నాడు ఆ అబ్బాయి అని కవయిత్రి మనకు ఊహనిస్తంది.రెండో అబ్బాయి "స్వప్న నే వచ్చాను చూశావా?"అంటాడు.ఈ అబ్బాయికీ కంటి చూపు లేదు.కానీ ఆ స్వప్నకీ కంటి చూపు వుంది. కానీ మాటలు రావు.అందుకే ఆ అబ్బాయితో "చూశావా"అని అనిపిస్తుంది.ఆ అమ్మాయిఅబ్బాయి పెదాల మీదున్న మాటల్ని అల్లుకొని మెడలో వేసుకున్నట్టు రాయడం.మూడో అబ్బాయి కూడా అంధుడే.అందుకే అతడు తన మాట వినలేని తన ప్రియురాలి గూర్చీ తన మాట వినగలిగే ఆమే స్నేహితురాళ్ళతో"ఎస్తర్ ఇవ్వాళ వచ్చిందాండీ"-అని అడుగుతాడు."ఏవో కొన్ని అక్షరాలు అతని చెవిలో ఉచ్చరించిందని కవయిత్రి రాస్తుంది. ఈ కవితలో కవయిత్రి చూపించిన నేర్పు,చేసిన అద్భుతం ఏమిటంటే పద చిత్రాల చిత్రణలో ఈ కవితలో చెప్పబడ్డ అబ్బాయిల,అమ్మాయిల శారీరక వైకల్యాన్ని తాను వాచ్యం చేయకుండానే ఎంతో శిల్ప నైపుణ్యంతో "ప్రేమ గుడ్డిది"అని అనటం ద్వార షాజహాన కంటి చూపు లేనిదని,"ప్రేమ మూగది"-అని చెప్పడం ద్వారా స్వప్న మాటలు రానిదని,"ప్రేమ చెవిటిది"అని పేర్కొనడం ద్వారా "ఎస్తర్" వినికిడి తనం లేనిదనే విషయాల్నీ కవయిత్రి నిర్మల చెప్పి తన శిల్ప చాతుర్యాన్ని చాటుకొంది. ఆ మూడు జంటల శ్రవణ,గాత్ర,నేత్ర అవధానాలతో చైతన్యపురి ప్రేమపురి అయ్యిందని ఒక చమత్కారాన్ని కూడా నిర్మల చేసింది."దశాబ్దాలుగా కలసి కాపురం చేస్తున్న వాళ్లు అపరిచితుల్లా మిగిలిపో విషాదంలో ఒకరినొకరు చూసుకోలేని మాట్లాడుకోలేని చీకటిలో వున్న ఆ ఆరుగురు ఆ చీకటిని ప్రేమ మాధ్యమంలో వెలిగించుకొన్నారన్న అనుభవాన్ని ఎట్లా దృశ్యం చేసిందో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. నిర్మల గారు నైర్మల్యానికీ ప్రతీకగా వానను,అలుముకొన్న అనుమానానికీ ప్రతీకగా బురదను తీసుకొని ఎవరో తెలియని మగవాడి స్కూటర్ లో తెలియని రోడ్ల మీద అనివార్య స్థితిలో వెనుక సీట్లో కూర్చొని ప్రాయణిస్తున్నప్పుడు,రోడ్డు మీద నడుస్తున్న వాళ్లే కాదు చెట్టు,పిట్టలు,గుట్టలు చివరికీ అతనిలో అతనే ఏమీఅనుకోకుండా తమ ఇద్దరి మధ్య చేతి సంచినీ చైనా గోడలా వుంచుకొన్న వొక స్త్రీ మనోభావాలను తన కలాన్ని కెమెరాలా చేసి దృశ్యీకరించింది.తాను ఊహించిన దానికన్నా భిన్నంగా జరిగే సరికీ "ఛేదించాల్సిన దుర్మార్గం"ఎవరిలో వుందో తెలియని స్త్రీ తల్లడిల్లిపోయే సంఘర్షణని "కొత్త బ్యాటరీ వేసి "మరీ చూపిస్తుంది. నన్ను నా ఆలోచనలనూ లొంగదీసుకొని తనలోకి వొంపుకున్న కవిత ఈ సంపుటిలో "...రిస్క్ తీసుకుంటాను" అనే కవిత. "మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను"-అన్న పాదాలతో ఈ కవిత మొదలై మనం ఊహించని అర్థాంతర ముగింపుతో త్రాగుబోతు భర్త,"ఇంట్లో ఈ సంత నా కొద్దు"అనుకుండే భార్య మధ్య నిత్యం నిరంతరం జరిగే ఒక జీవన విషాద భీభత్స సమవాకార సారంశా దృశ్యాన్ని నిలబెట్టి మరి చూపిస్తుంది.ఈ సమస్యతో నిత్యసంఘర్షణాత్మక జీవితాన్ని గడిపే దంపతుల జీవితాల్లోని నిష్టుర సత్యాన్ని నిలువునా మండించిన ఈ కవిత 'నాలుగు పెగ్గులు"గా రాయబడింది. మొదటి పెగ్గులో వున్నప్పుడు ఆ భర్త "అన్నట్టూ నీకొత్త చెప్పులు ఇంకా కరుస్తున్నాయా"-అన్న ప్రశ్నా వాక్యమే రెండో పెగ్గులో,మూడో పెగ్గులో ,నాలుగో పెగ్గులో కూడా చాల కీలక వాక్యమై కవితను సజీవం చేస్తుంది.గోడ మీద తెగ కావలించుకొని దిగిన హానిమూన్ పోటో మొదటి పెగ్గులో విస్తు పోవడం ,రెండో పెగ్గులో భయంతో గోడని కరుచుకోవడం, నాలుగో పెగ్గులో "తటాల్నా విడిపోయి ఇంకెవరితోనో లేచి పోవడం"-అని రాయడంలో ఈ కవయిత్రి ఆ భార్య ఎంతటి వేదనని ప్రతి రోజు పొందుతుమ్దో ద్వనింప చేస్తుంది.కవి లేక కవయిత్రి అనన్య శిల్పం ఇట్లాంటి అంశాలతోనే మెరిసిపోయేది.కనువిప్పు లాంటి ఈ కవిత ఇందులో లోతైనా భావాలు ఎన్నో వున్నాయి."ఇద్దరి మీద వొకే బ్రాండ్ సిగరెట్ పొగ గొడుగు పట్టి వుంది"అనా పాదాలు కవయిత్రి భావన శక్తికి గొడుగు పట్టేవిగా నిలుస్తాయి. "...రిస్క్ తీసుకుంటాను "అనే కవితలో శూన్యంలోకి చీర్స్ కొట్టి గ్లాస్ ఖాళీ చేసే దృశ్యాలు పిల్లల కళ్లబడకుండా ఆవిడ పడే పాట్లు,తాగుడు కారణంగా ఏ తప్పు చేయని ఆ యిద్దరి అమ్మా నాన్నలు శీలాలు కోల్పోవడం,మొదటి పెగ్గులో అన్న వాక్యాన్నే అన్ని పెగ్గుల్లో రెచ్చగొట్టేటట్టుగా వాడటం,చివరకూ ఆ తాగుడు భూతం బయటకొచ్చి తుములోకి వెళ్లిపోవడం ఇలాంటి అంశాలు వాస్తవికంగా చెప్పబడ్డాయి.అయితే ఈ కవితలో అతడు తాగేది జానీ వాకర్ అని రాసింది.అది ఖరీదైన విదేశీ మద్యం.ఆ మద్యం వాడేది అరిస్ట్రొక్రాట్సె. మద్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువ ఈ కవయిత్రి భావించిన సంఘటనలు జరిగుతాయేమో?.ఏమయిన ఒక అద్భుత శిల్ప రహస్య మర్మఙ్ఞి ఈ కవయిత్రి. త్రాగడం కన్నా పేకాట మహా వ్యసనం.పేకాటలో వుండే రాజుల్నీ నాలుగు అగ్ర రాజ్యాలతో పోలుస్తూ ఆ అగ్ర రాజ్యాల పొటీలో నలిగిపోతున్న వలస కూలీల జీవిత విషాదాన్ని ,సామ్రాజ్యవాదుల అధికార వాంఛను వ్యతిరేకిస్తూ,"గోరీలుగా మారుతున్న ఇళ్ళ మధ్య పిల్లల్నీ కావిటేసుకొని పారిపోతూ శాపాలు పెట్టిన దుఃఖాన్ని ఈవిడ "కొత్త గోరీలు-పాత దుఃఖాలు"-అనే కవితలో చిత్రించి అగ్ర రాజ్యం చేసిన యుధ్దాన్ని గుర్తుచేస్తుంది. బాగా యిష్టంతో సెటైర్స్ రాసే ఈ కవయిత్రి ఆవ్యంగ్య శిల్పాన్ని సైతం కవితల్లో సమర్థవంతంగా ప్రయోగించింది.బంగారమంటే స్త్రీలకే కాదు ఈ మధ్య పురుషుల్లో మోజు పెరిగిపోయింది."చేతి వేళ్లపై గజ్జి కురుపుల్లా అదృష్టపు వుంగారాలు"అనే మాట ద్వార పురుషుల్లో బంగారం పై వున్న ఎడతెగని మోజుని సెటైరికల్ గా వ్యాఖ్యానిస్తుంది.మైదాస్ రాజు కథ అందరికీ తెలుసు.దేన్ని తాకినా అది బంగారం కావాలనే విపరీతపు కోరికను వరంగా పొంది ,చివరకూ తాను పొందిన ఆ వరం తన జీవితానికీ ఎంత దుఃఖ హేతువు అయ్యిందో "కంచు మోగినట్టు కాకి రెట్ట మోగును"అనే కవితలో కవయిత్రి వ్యంగ్యంగా రూపు కట్టిస్తుంది.ఎక్కడ చూచిన బంగారు కట్లపాములా కాటు వేయడానికీ నడ్డి విప్పి నాట్యం చేసే దృశ్యాల్నీ "కంచు కంటే కనకం కర్ణకఠోరంగా మోగుతుంది"అన్న మాటల ద్వారా అభివ్యక్తం చేస్తుంది ఈ కవయిత్రి."అత్తింటి ఆరళ్ళ నుంచి రక్షించుకునేందుకు /బంగారాన్ని బుల్లెట్ ప్రూఫ్ లా వాడుతున్నారని ఈవిడ ఒక కోణంలో సమర్థించిన "మానవ స్పర్శ లేని లోహ ప్రేమ/గుడారంలో తలదూర్చిన ఒంటెలా మన జీవితాల్నీ"-తొక్కేసిన వాస్తవాన్ని నిర్మొహమాటంగా చెబుతుంది."ప్రపంచానికొచ్చిన ఈ పచ్చలోహపు జబ్బు ఏ పసర్లకు తగ్గుతుందో" తెలీదంటూ ఎవర్నీ చూసిన ఇంత బంగారం ముద్ద కాకి రెట్టలా కంట్లో పడుతోందని ఒక జుగుప్సను వ్యక్తం చేస్తుంది మనిషిని శాసించే మనిషి సృష్టంచుకొన్న బంగారం పై. స్త్రీల దేహాన్ని ఆభరణాలు ఆక్రమించుకోవడం కూడా పురుష స్వామ్య వ్యవస్థ లోలోపల చేసిన కుట్రనే అని స్త్రీ వాదుల భావన.స్త్రీ దేహాన్ని నగల మోజుకు గురి చేసి వార్ని తమకు బానిసల చేసుకోవడమ్ జరిగిందని కొందరి ఆలోచన."లావణ్యాన్ని పనికి రాని లోహంతో ఎందుకు బంధిస్తావురా చాతనైతే కౌగిలిలో బంధించు"-అని అంటున్న కవయిత్రి నిజాయితీగా,ప్రేమగా కౌగిలి సుఖం కన్నా బంగారు ఆభరణాలు ఇచ్చే కృత్రిమ సౌందర్యం తక్కువేనన్న భావాన్ని "కొక్కేం తీస్తావా?"అనే కవితలో స్పష్టం చేస్తుంది.మనసులో ఇరుక్కున్న భావాలు బయటికీ తేవాటానికీ ఎవరైనా కొక్కేం తీయాల్సిందే. ఒక తాత్విక చింతనను మేళవించి నిర్మించిన కవితలా అనిపించేది "చిలుక ఎగిరిపోదు" అనేది.కొందరు కవులూ కొంత కాలం తరువాత కవిత్వం రాయడం ఆపేస్తుంటారు.అంత మాత్రానా వారిలో కవిత్వపు జల ఇంకిపోయిందని కాదు.భావాల చెలిమ ఎండిపోయిందని కాదు.కాలంతో పాటు కలసి నడువలేని వారు కొంతకాలానికీ ఆగిపోయినా వారిలో కవిత్వపు చిలుక ఎగిరిపోదనే శాశ్వత సత్య భావనను కవయిత్రి నిర్మల జ్వాజల్యమానం చేసింది తన ఊహతో.చిలుక కవిత్వ సృజనకు ప్రతీక.ఎప్పుడన్నా కవిత్వం రాయడం ఆపేసినప్పుడు "కనిపించిన వాళ్లంతా అడుగుతున్నారు చిలుక ఎగిరి పోయిందా? కొందరిది ఆందోళన కొందరిది ఓదార్పు కొందరిది కేవలం ఆరా" అని నిర్మల గారు అంటూ "ఇద్దరం ఒకే వసంతంలో పుట్టాం/మా తోట కొచ్చి నన్ను పేరు పెట్టి పిలిస్తే తనే ముందు పలుకుతుంది"అని కవికీ కవిత్వానికీ గల బందాన్ని అందంగా చెప్పింది.ఇలా చెప్పడంలో కవి బతికుండగానే కవిత్వపు చిలుక ఎక్కడికీ పోదని నిజమైన కవులు ప్రకృతిలాంటి వాళ్ళని,ఋతువుకీ ఋతువుకీ మధ్య తమను పోలిన మొక్కలు మొలిచాయో చూసుకొని గర్వపడతాయని ,ఒక తరమ్ నుంచి మరొక తరానికీ కవిత్వ వారసత్వం అందుతుందని కవయిత్రి చెప్పటం లో దార్శనికత గోచరిస్తుంది. ఈ సంపుటిలో పాఠకుడి కంటి చూపు నుంచి జారిపోని కవిత"దొంగాడు-నాంతాడు".భర్త చనిపోయిన యిల్లాలి మెడలోని నాను తాడు పోయిన సందర్భాన్ని నిర్మల కవిత్వం చేసిన తీరు,ఆవిడ వాడిన మెటఫర్ లూ,పద చిత్రాలు,నిర్మించిన వాక్యాలు,ప్రారంభించిన పద్దతి ఇవన్నీ ఆమె ప్రతిభను అద్దంలా మనకు చూపేవే."పారేసుకున్న నాను తాడంటే ఏమిటీ?ఆఫ్ట్రాల్ ఒక లోహపు తీగ /నాను తాడంటే ఏముంది నెల్లాళ్ళ మటన్ బిర్యాని"కాదు అమ్మకీ నాను తాడంటే....నాన్నతో ప్రారంభించిన యిష్టపూర్వక జీవన ప్రయాణానికి సందర్భ సహిత వ్యాఖ్యలాంటిది"అని అంటున్న కవయిత్రి చెబుతూ నానుతాడు పోగొట్టుకున్న స్త్రీ దుఃఖానికీ కారణమయిన పురుషుని మోసాన్ని బట్టబయలు చేసిన కవిత ఇది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని మదురిమను,సహజీవన సౌందర్యంలోని గొప్పదనాన్ని "మనుషులు అన్నం తినడం లేదు"అని ఈ కవయిత్రి"కూర గిన్నెలో హత్య/సాంబారు గిన్నెలో జుగుప్స/పచ్చ్డిలో భీభత్సం" అంటూ విఛ్చిన్న కౌటుంబికతను గుర్తుకు తెస్తున్నది.అకారణంగా ఆత్మహత్యలు చేసుకొంటున్న అత్మస్ఠైర్యం లేని అమ్మాయిల,అబ్బాయిల జీవితాలలోని శూన్యతను ,మాధ్యమాలు,పుక్కిటి పురాణాలు,చాతకాని అమ్మా నాన్నల పెంపకం వీటన్నిటిని నిర్మల నిలువునా చేరేసి రాసిన కవితే "అందమైన ఆత్మహత్య". కేవలం స్త్రీలే ఎయిడ్స్ కీ కారణం అనే తప్పుడు అభిప్రాయాన్ని ఖండించడానికీ వ్యంగ్యంగా రాసిన కవితే "పులి రాణికి ఎయిడ్స్ రాదా?" అనేది. స్త్రీల జీవితాలలోని గడ్డ కట్టిన విషాదాన్ని "బద్దలయిన గాజులకీ పూసలకీ నా గుండె కంటే ఎక్కువ ముక్కలవ్వడం చాతకాదు" -అన్న పంక్తిలో ఆవిష్కరించింది. ఈ ఒక్క పద్యపాదం చాలు నిర్మల గారు ఎంతటి దుఃఖపు తడితో రాస్తుందో చెప్పడానికి. కవి కష్టసుఖాలలో సంబంధం లేని కవిత్వం కవి ఆత్మలో అను సంధానం కాని కవిత్వం కవిత్వమే కాదు" -అన్న వాక్యాలను నమ్ముతూ...ఇంకా రాయాలని వున్నా స్థలాభావం చేత నిలివేస్తున్నా.నేను చాల యిష్టంగా అభిమానించే కవయిత్రి కొండేపూడి నిర్మల గారికీ అనంతపురంలో ఉమ్మడి సెట్టి సాహిత్యపురస్కారం "నివురు"కు డా:రాధేయ గారు యిచ్చిన సందర్భంలో ఈ సంపుటిని కవి సంగమ మిత్రులకోసం పరిచయం చేశాను.ఆ ఉత్తమ కవయిత్రికీ మరో మారు అభినందనలు తెలుపుతూ...మంగళ వారం మరో సంపుటితో కలుసుకొందాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eHBFUU

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి