పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, ఏప్రిల్ 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

అసమ సమాజంపై అక్షరాయుధం andhra prabha - Mon, 21 Apr 2014, IST ఆర్టిస్టువు కావాలన్నా, సైంటిస్టువు కావాలన్నా ముందు నువ్వు కమ్యూనిస్టువి కావాలి’’ ఇవి మహాకవి శ్రీశ్రీ అన్నమాటలు. ఈ మాటలు విని కమ్యూనిజంపై దృష్టిపెట్టి. విద్యార్థి సంఘాల్లో చేరి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నవాడు మువ్వా శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు మాటలు మువ్వా శ్రీనివాసరావుని ప్రేరేపించాయి. అలాగే కవిత్వం మీద ప్రేమ శ్రీశ్రీని చదివించింది. కవులలో సాన్నిహిత్యమూ పెరిగింది. చుట్టూ కవిత్వ వాతావరణం అలుముకుంది. సమాజం పట్ల, సమాజంలోని అవకతవకల పట్లా అవగాహనా ఉంది. భాష పట్ల కొంత పట్టు అబ్బింది. ఇన్ని ఉన్నాక కవి కాకుండా ఉం టాడా! అందుకే మువ్వా శ్రీనివాసరావు కవి కాగలిగాడు. కవి కావటమే కాదు మంచి కవిగా ఎదిగాడు. రాసిన కవితలన్నింటిని కూర్చి “సమాంతర ఛాయలు’ పేరుతో కవితా సంపుటిని తీసుకొచ్చాడు మువ్వా. ఈ కృషి వెనుక సీతారాం ప్రోత్సాహం ఉందని ముందే చెప్పుకున్నాడు. సరే అది అలా ఉంచితే ఈ కవిత్వంలో ఏముందని లోపలికెళితే మొదటి కవిత ఒక పోరాట చరిత్రను విశిదీకరిస్తుంది. “”1975 --ఓ పోరాట గాథ’’ మావూరి మర్రి చెట్టుమీద/ అర్ధరాత్రి /మందారం పూసిందని/ ఖాకీలు కాలువల్లా ప్రవహించాయి/ తుపాకీ గొట్టాలు/ తూరుపు మొక్కల్ని పసిగట్టాయి/ తెల్లవార్లు/ లాఠీలూ ఎముకలు/ మాట్లాడుకుంటూనే ఉన్నాయి. ఈ కవిత ఎమర్జెన్సీ గురించి, ఆనాటి ఘోర దృశ్యాలను కళ్ళకు కడుతుంది. పోరాటాలను లాఠీలతో, తూటాలతో అణిచివేయాలనుకుంటే అంతకంటే ఎక్కువ ఉధృతితో ఉద్యమాలు పుట్టుకొస్తాయని చరిత్ర నేర్పిన పాఠం. ఇదే కవితలో ఆ రోజు నెనెప్పటికీ మరిచిపోలేను/ హఠాత్తుగా ఎదురైన బియ్యాబానీ/ సకల జీవుల్ని తాకి పలకరించే / శిరిడీ సాయిలా / కాలందింపిన ఏసుక్రీస్తులా/ అందరిలానే నన్ను చూసి/ నేనెవరో తెలియనట్లు తప్పుకున్నాడు/ చుట్టూ మూగిన చిన్నపిల్లలతో/ సమావేశం పెట్టి/ చిట్టీలు పంచుకున్నాడు/ ఎమర్జెన్సీ/ మా వూరికిచ్చిన బహుమతి/ బియ్యగానీ సాక్షిగా / ఇప్పుడు మావూరినిండా /మందారాలు విరగబూస్తున్నాయి అని ముగిస్తాడు. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ఉద్భవిస్తారని అన్న సోమసుందర్‌ వాక్యం గుర్తొస్తోంది. మావూరి మర్రి చెట్టుమీద అర్ధరాత్రి మందారం పూసిందని ఈ కవితను మొదలుపెట్టడం -చివరలో ఇప్పుడు మావూరి నిండా మందారాలు విరగబూస్తున్నాయని ముగించడం సోమసుందర్‌ వాక్యానికి సరిగ్గా సరిపోయేదే. కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్న కవి నుండి రావాల్సిన వాక్యాలే వచ్చాయి. పోరాటాన్ని విధ్వంసపూరిత ఘట్టాల్ని రాయకుండా ఉండలేడు. అదే మనం మువ్వాశ్రీనివాసరావు లోనూ చూస్తాం. అలాగే దళితులపై జరిగిన పైశాచిక మారణకాండను గుండెకెత్తుకున్నాడు కవి. మొన్న అచ్చంపేటను అచ్చంగా తొక్కిపెట్టి/ నిన్న కారంచేడును చుండూరు/ గుండెలు గాయం చేసిన /ఆ గడి /ఇవ్వాళ లక్సెట్టిపేటలో కన్ను తెరిచింది/ గడీలకు గడియలేస్తే / గంగలో కలిసి పోయాయనుకున్నా/ మారువేషాలేసుకొని మన మన మధ్య తిరుగుతున్నాయని ఈ మధ్యే తెలిసిందంటాడు. బలవంతులు బలహీనులపై సాగించే దురాగతాలు ఎన్నో. శ్రీశ్రీ నుండి ప్రేరణ పొందినవాడు కాబట్టి బలహీనుల పక్షం వహించడం సహజమే కదా! ఈ కవిలో ఒక ఆవేశం, ధర్మాగ్రహం నిండుగా ఉన్నాయి. మరో కవితలో ఎరుపు తెరిపి లేకుండా కురిసే రోజు కోసం/ శాంతి కరువు లేకుండా విరిసే రోజు కోసం/వెతలతో రణాలుకట్టి వేచిచూస్తూనే ఉన్నాం అంటాడు. “క్రాంతి’ శీర్షికతో రాసిన కవితలో ఎంతచిక్కని/ అమావాస్య చీకటి అయినా/ బాలభానుని /లేతకిరణము ఓడిపోక తప్పదులే/ ఎత్తునుండి పడిపోతున్నా/ నీళ్ళుకూడా నిప్పును రాజేస్తుంటాయి/ మొదలు చివరా/ నరికినా సరే/ పందిరికి పెట్టిన/ సిరిమాను గుంజలు/ చిగురులువేస్తూనే ఉంటుంటాయి/ రాక్షస బల్లులు పోయినట్లు/ రాకాసి మనుషులు పోతారు. అంటూనే సమాజంలోని దుర్గంధాలన్నింటినీ కాలప్రవాహంలో కడిగేసుకుంటూనే ఉంటుంది. అవసరమైనప్పుడల్లా నిశ్శబ్దం పగిలి గమనాన్ని నిరంతరం చేస్తూనే ఉంటుంది. నిర్నిరోధంగా క్రాంతి అడుగులు వేస్తూనే ఉంటుందని చెపుతాడు. ఇది సమాజంలో జరిగే అన్యాయాలపై యుద్ధం ప్రకటించడమే. మువ్వా శ్రీనివాసరావు ఆసమ సమాజపు పోకడలపై అక్షరాయుధాన్ని ఎక్కుపెట్టాడని సందేహం లేకుండా చెప్పవచ్చు. ఇందులో మొత్తం 93 కవితలున్నాయి. ఇవి మువ్వా శ్రీనివాసరావుని, అతని ఆలోచనల్ని ఆవిష్కరించాయి. ఈ పుస్తకానికి ముందు మాట మువ్వాదే ఉంది. ప్రత్యేకంగా ఈ పుస్తకంలో అఫ్సర్‌, అరుణసాగర్‌, కవి యాకూబ్‌, ప్రసేన్‌, ఆనందాచారి, బి.వి.వి.ప్రసాద్‌, ఖాదర్‌ మొహిద్దీన్‌, సీతారాంలు వెనుక మాటలందించారు. ఏది ఏమైనా ఒక మంచి ప్రయత్నంగా మువ్వా శ్రీనివాసరావును అభినందించాలి. పేజీలు: 276, వెల: 200 రూపాయలు, ప్రతులకు: మువ్వా శ్రీనివాసరావు, ఫ్లాట్‌ నెం.103, శ్రీజన అపార్ట్‌మెంట్స్‌, స్ట్రీట్‌ నెం.1, బ్యాంక్‌ కాలనీ, ఖమ్మం మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యం.http://ift.tt/1h4cBM1

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h4cBM1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి