పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

కవిసంగమం ప్రయాణంలో ఒక సంవత్సరం!


...................................................

సరిగ్గా ఈరోజే(Feb'9,2012) కవిసంగమం మొదలయ్యింది.ఎంతోమందిని కలుపుకుంటూ సాగింది.ఇవ్వాళ ఫేస్ బుక్ కవితావేదికగా నిలబడింది.ఈ సంవత్సరకాలంలో అనేక సాహిత్యసందర్భాల్ని సృష్టించింది.కొత్తగా రాసున్నవాళ్ళు ఎందఱో ఇవాళ తమదైన ముద్రను ఏర్పరుచుకున్నారు.
చర్చలు,సూచనలు,సందేహాలు,సందోహాలు,-వీటన్నిటి మధ్య తమనుతాము ప్రూవ్ చేసుకున్నారు.ఆ మార్గంలో సాగుతున్నారు.
కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది.
'కవిత్వం ఇక యాభై ఏళ్ళ పైబడిన వారి ప్రక్రియేనని' ఎద్దేవా చేసినవాళ్లకి, 'తెలుగులో కవిత్వం లేదని' పెదవి విరిచినవాళ్లకి కవిత్వం నిత్యనూతనమని ,అదొక తీరనిదాహంగా అందరిలోనూ ఉందని కవిసంగమం వేదికగా కవులు నిరూపించి చూపారు.
ఆగష్టు పదిహేనున ఇఫ్లూ లో జరిగిన 'కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్' ఒక గొప్ప ప్రయోగం.ఆంధ్రజ్యోతి,పాలపిట్ట,దక్కన్ క్రానికల్ ,హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని కొనియాడాయి.

***
బెంగాలీ కవి సుబోద్ సర్కార్ అతిధిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్ ను చూసి ముచ్చటపడ్డాడు.గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు.అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి.
ఈ మధ్య వచ్చిన ప్రసిద్ద తమిళకవి చేరన్ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు,చదివిన కవిత్వం ;మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్ ' గా ఎంతో ఉపయోగపడ్డాయి.
ఈ లర్నింగ్ ఇన్ ప్రాసెస్ కు కొనసాగింపుగా ఈ సంవత్సరం మనం మొదలుపెట్టిన 'లామకాన్ లో కవిసంగమం' కార్యక్రమం.! ఇప్పటికే మొదటి సీరీస్ ను ముగించుకున్నాం.ఇవాళ రెండవ సీరీస్. నగ్నముని,నిఖిలేశ్వర్,ఇంకా ముందు ముందు ఈ సీరీస్ కు రాబోయే సీనియర్ కవుల కవిత్వం వినడం,వారితో గడపడం ద్వారా ఈ లర్నింగ్ ఇన్ ప్రాసెస్ ను కొనసాగిస్తాం.

కవిత్వం పని అయిపోయిందనే దశనుంచి,కొత్తవాళ్ళు కవిత్వంలోకి రావడంలేదనే దశనుంచి 'కవిసంగమం'-'నువ్వొక పచ్చని చెట్టైతే ,పక్షులు వాటంతటవే వచ్చి వాలేను'అన్న మాటను నిజం చేసి చూపింది. ఈ సంవత్సరం విజయాలను చూసి తెలుగు పత్రికలూ ,అంతర్జాల పత్రికలూ 'మాకు కవిత్వం పంపండి 'అని కవిసంగమంలో రాస్తున్న కవులను అడుగుతూ ఉండటం గర్వంగానే ఉంది.

**
అప్పటివరకు తమకేమీ పట్టనట్లున్నఎందరినో 'కవిసంగమం'మేల్కొలిపింది. ఆ మేల్కొలుపుకు కవిసంగమం కారణం కావడం ఆనందదాయకం.కవిత్వం కేవలం పెద్దల వ్యవహారం అయిపోయిందని కొట్టిపడేసినవాళ్ళే ఇవాళ కవిసంగమం మార్గాన్ని,విజయాన్ని ఒప్పుకోక తప్పని పరిస్తితిని కల్పించాం.

ఈ సంవత్సరకాలంగా 'కవిసంగమం' ప్రయాణాన్ని గర్వంగా తలుచుకుందాం. మనమందరం ఈ ప్రయాణంలో భాగమైనందుకు ఈ తొలి జన్మదినాన్ని సంతోషంగా చాటుదాం!

1 కామెంట్‌: