పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

కవితాపఠనవత్సరం సీరీస్-2 || నందకిషోర్


అందరికీ నమస్తే!

లామకాన్ వేదికగా,కవిసంగమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కవితాపఠనవత్సరం సీరీస్-2 వేడుకగా జరిగిందనీ,విజయవంతమయ్యిందనీ తెలియజేయడానికి ఆనందిస్తున్నాం.feb9కవిసంగమం జన్మదిన తేదీ కూడా కావడంతో కార్యక్రమానికి మరింత విశిష్టత సంతరించుకుంది.

ప్రత్యేక అతిధిగా విచ్చేసిన,దిగంబరకవితావేశానికి పేరెన్నికగల కవి నిఖిలేశ్వర్,లామకాన్లో కవిసంగమాన్ని ఉద్దేశ్యిస్తూ " కవికి విశ్వమంతా ఇల్లేనని,తమ వ్యక్తిగతమైన ఆకాంక్షని-సామాజిక ఆకాంక్షగా మార్చుతూ విశ్వజనీనతకు యత్నించడమే కవులకుండాల్సిన లక్షణమనీ అన్నారు. యుక్తవయసులో,సమాజాన్ని మార్చాలన్న తీవ్రమైన కోపం,ఆపై తాత్వికత,మార్క్సిజం,అస్తిత్వవాదం తన ప్రయాణాన్ని ఎలా నిర్ధేశించిందీ చెపుతూ యాదవరెడ్డి నిఖిలేశ్వర్‌గా మారిన క్రమాన్ని,దిగంబర కవితోద్యమ దిశ-దశలని చర్చించారు నిఖిల్.70ల్లో విరసంలో చేరి ఝంఝ ప్రచురించినప్పుడు PD act కింద అరెస్ట్ అయిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ-కవి నిర్భయంగా మాట్లాడితే ఒప్పుకోలేని,మనోభావాల పేరుతో,తమ అసహానాన్ని ప్రదర్శించే తీరు ప్రస్తుత సమాజంలో నెలకొందనీ అన్నారు.యుగస్వరం,భయం,నల్లగొండ పల్లెటూరి వచ్చినా,నగరంతో తనకున్న విడదీయలేని బంధాన్ని చూపించే నాలుగుశతాబ్ధాలసాక్షిగా..లాంటి కవితలని గానంచేసి ఆహుతులని అలరించారు.సర్క్యులేషన్ తక్కువే ఉన్న పాతికసంవత్సరాలుగా తన సామాజిక,సాహిత్య స్పృహకి దర్పణమైన "జనసాహితి" పత్రికను గురించి ప్రస్తావించారు.

కవిసంగమంలో చిరపరిచుతులైన మరో కవి పులిపాటి గురుస్వామి గారు కవిత్వంకోసం తమ సాయంత్రాన్ని కేటాయించి వచ్చినవారందరికీ దండాలు అంటూ ఆత్మీయంగా మొదలుపెట్టి " రాయడం ఒక బాధ.రాసేంతవరకూ ఒక బాధ..రాసినంక ఒక తృప్తి,ఎవరన్నా బాగుందంటె ఇంకొంచెం తృప్తి" అంటూ తన కవిత్వానుభవాన్ని నాలుగేమాటల్లో చక్కగా చెప్పారు.97లో ప్రచురితమైన అయ్యా!మళ్ళెప్పుడొస్తవే తనని కవిగా పాఠకలోకానికి ఎలా పరిచయం చేసింది గుర్తుచేసుకున్నారు." ప్రియురాలా!ఈ రాత్రిని వెళ్ళనీయకు!" అంటూ తను రాసే శైలిని ఆత్మవెలదిగా ప్రకటించుకున్నారు.సాటిమనిషిని ప్రశ్నిస్తూ సాగే తన మొదటి కవిత " వొత్తుకుండ"తో పాటే,వానధ్యానం,మిషలాంటి దీర్ఘకవితలతో మెప్పించారు.

ఎప్పుడూ వేలమంది హాజరయ్యే సభల్లో మాట్లాడటం అలవాటై ఈ వాతావరణం కాస్త కొత్తగా ఉందనీ,పుస్తకానికి ముందుమాట రాయమంటే మూడునెలలు ఆలస్యంచేసి కవిమిత్రులు తన కవితల సంఖ్యని 93కి పెంచారనీ,పుస్తకావిష్కరణ జరిగి మూడురోజులు కాకమునుపే తనని వేదికమీద కవిత్వం చదవమనడం అన్నప్రాసన రోజే ఆవకాయలా ఉందనీ చమక్కులు పేలుస్తూ మొదలైన క్రాంతి శ్రీనివాసరావుగారి కవిత్వపఠనం ఆద్యంత ఉత్సాహపరిచింది.శ్రీశ్రీనే తనకి స్పూర్తి అని,దాదాపుగా అరవైవేలమంది విధ్యార్ధులకి శ్రీశ్రీ కవిత్వాన్ని తాను పరిచయంచేసాననీ చెప్పుకుంటూ మహానగరం,మా ఊరి మర్రిచెట్టుమీద,లోపలి మరకలు,అపార్ట్‌మంట్ బతుకులు..వంటి కవితలతో ఆకట్టుకున్నారు.స్త్రీలపై తనకున్న గౌరవాన్ని,మమకారాన్ని ప్రతిబింబించే అమ్మమ్మ,తన వ్యవసాయ కుటుంబపు బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ రాసిన "నాన్న కళ్ళు" బాగా హత్తుకున్నాయి.

తనలోని బాధల్ని కవితలుగా చేసి, మృదువైన స్వరంతో ఒలికించిన జయశ్రీనాయుడు..తన ఉపాధ్యాయవృత్తిని తనెట్లా ప్రేమించేదీ,బ్లాగులో తనెట్లా కవిత్వం ప్రచురించుకుందీ,fbలోనూ, కవిసంగమంలోనూ మిత్రులు తననెట్లా ప్రోత్సహించిందీ,వాళ్ళ నాన్నగారు ఎలాంటి ఆదర్శాలని తన జీవితానికి మార్గదర్శకంగాచేసిందీ గుర్తుచేసుకున్నారు.ఒకే మనిషిలో ఉండే విభిన్నకోణాలనూ,ఒక్కోసారి మరొకరిగా మరిపోవాల్సిన సందర్భాలనూ,అనుభవాలనూ తన మాటల్తో అందంగా విశ్లేషిస్తూ, నిజం-నైజం,నేనే నా నౌక.. వంటి మంచి మంచి కవితలతో నిశ్శబ్ధం నింపి కరతాళద్వనుల మధ్య వేదికదిగారు.

చివరగా వచ్చిన బుల్‌బుల్ కూడా,తనకున్న సమయ పరిమితి గుర్తెరిగి బాగానే ప్రయత్నించాడు. అమ్మని,నాన్నని,ఊరినీ,ఉపాధ్యాయుల్ని,తనని ప్రశంసతోని,విమర్శతోని,కావాల్సినప్పుడు తమ నిశ్శబ్ధంతోనీ ప్రోత్సహించిన కవిమిత్రులనీ తలుచుకున్నాడు.పసితనపు గుర్తుగా రాసుకున్న ఊవెలపిల్ల,ఓపెన్ కాస్ట్‌తో అంతరించిపోతున్న ఊర్ల గోస- ఇంకా గోడు,ప్రేమే..etc కవితలు వినిపించి, కవిసంగమం తెలుగు సాహిత్యానికి ఆత్మగాభాసిల్లే రోజు రావాలని కోరుకున్నాడు.

పచ్చని చెట్టుపై మేమంతా పిట్టలం అంటూ వచ్చిన యజ్ఞపాల్ ముగింపువాక్యాల్తో సభముగిసింది.వ్యాఖ్యాతగా మురిపించిన కిరణ్,live planచేసిన vice captainకట్టా,work out చేసిన రాజేశ్,cover upచేసిన మీడియామిత్రులు,అన్నీ తనై ముందుకు నడిపించే captain అభినందనీయులు.

ఇవ్వాళ నాకు సెలవు లేకపోవడంతో reportకాస్త ఆలస్యమైంది.మన్నించాలి.సీరీస్-3 తో మళ్ళీ కలుసుకుందాం.సెలవు.

10-02-13

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి