పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఆగస్టు 2012, బుధవారం

జాన్ హైడ్ కనుమూరి ||ఇంటికొచ్చాక - పలకరింపుల పర్వం||

ఆసుపత
్రిలో రానివ్వలేదని
ఆత్రంగా పలకరింపుకోసం
రెక్కలు కట్టుకుని వాలినట్టు కొన్ని అనుబంధాలు

కొన్ని పెదాలు
ఇష్టంగానో అయిష్టంగానో పలకరిస్తాయి

దేహంతోనో, ఆత్మతోనో
స్నేహించిన పెదాలు
రెప్పలమధ్య ఒలకనివ్వని బిందువుల్తో స్పృశిస్తారు
ఆ స్పర్శ ఎంత ఊతమిస్తాయో ఏ పదాల్తో తెలపాలి
గుండెలోకి గుటకవేయడం తప్ప

దూరాలనుంచి రాలేక
ఆత్రాన్ని అణుచుకోలేక
గద్గద స్వరాలై
సెల్‌పోనుల్లో దుఃఖాన్ని కుమ్మరిస్తాయి

* * *

ఎక్కడో ఎప్పుడో గూడుకట్టుకున్న అనుబంధం
పలకరింపై కప్పేయాలని ఎదురుచూస్తుంటాను
వచ్చినవాళ్ళే మనవాళ్ళు
రానివాళ్ళకోసం ఆ దుఃఖపొర ఎందుకని
ఆరోప్రాణం హెచ్చరిస్తూవుంటుంది
ఒక్కోసారి ఆ దుఃఖపొర
దిగులు కంబళ్ళై కప్పేసి
ఇంకా అనారోగ్యంలోకి నెట్టేస్తుంది

* * *

జాగ్రత్తల ఆంక్షలు మొదలౌతాయి
చదవొద్దని
ఎక్కువ మాట్లాడొద్దని
ఎక్కువ నిద్రపొమ్మని
సమయానికి తినమని
సమయానికి మందులేసుకొమ్మని

* * *

ఇక దేహానికి మరోరకమైన పరీక్ష
అప్పటివరకు నరాల్లోకి చేరిన మందుల ప్రభావం
సమతుల్యానికి అడుగులేస్తుంటాయి
దేహం విశ్రాంతికి కోరుకుంటుంది

ఆనారోగ్యపు ప్రారంభ మూలాలకోసం చర్చమొదలౌతుంది
తాగునీరో, తిన్న ఆహారమో
వేసుకున్న మందులో
అనారోగ్యన్ని ఆలస్యంగా గుర్తించకపోవడమో
ఇదిమిత్తంగా నిర్ణయించలేక చర్చముగుస్తుంది

* * *

ఆర్థిక వనరులకోసం
ఎవరి తలుపో తట్టాలని చూస్తుంటాను
తవని తలుపులవైపు చూపులుచరిస్తాయి

ఎవ్వరోవచ్చి భుజంతట్టి జేబునింపాక
దేవుడు తనదైన ద్వారాలు తెరుస్తాడని
ఎవరినైనా పంపుతాడని గుర్తుకొస్తుంది
ఆ అశ్చర్యాన్ని నెమరేస్తుంటే
దేహానికి కొత్త రెక్కలొస్తాయి

***

నీవాక్యము నన్ను బ్రతికించి యున్నది
నా బాధలలో నెమ్మది కలిగించుచున్నది


14.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి