పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఆగస్టు 2012, గురువారం

జగద్ధాత్రి || తపస్సు ||



నరుక్కుంటున్నా
నాలోని నన్ను..నా అహాన్ని
అభిజాత్యాన్ని ..అసహాయతని..అజ్ఞానాన్ని
ఖండఖండాలుగా....
అశక్తతని ..అనుమానాలని ..మొహమాటాలని
ముక్కముక్కలుగా...
నాలోని నా అసలు నేను
నాకు దొరికే వరకు
ఈ నిరంతర ఊచకోత సాగిస్తూనే ఉంటా
నా శక్తిని నేను తెలుసుకునే వరకు
నా మనసుని యధాతధంగా
వ్యక్తీకరించగలిగే వరకు
నా అనుభవాలను నిర్మమంగా అక్షరీకరించేవరకూ
నా అనుభూతుల అ౦శీ భూత రాశిని
అభివ్యక్తీకరించ గలిగేవరకు
నాలో నాకు నేనే ..అడ్డుపడే అన్ని గోడల్ని
తెరలని పొరలని చీల్చుకుంటూ
ధరిత్రి లోంచి మొలకెత్తిన
నా జీవన విత్తనాన్ని..నా జీవిత కధనాన్ని
కాస్తైనా మీకు చెప్పేవరకు
ఈ నా నిరంతర అంతర్యుద్ధం
సాగిస్తూనే ఉంటా
నన్ను నేనే
సరి చూసుకుంటూ ..సరి చేసుకుంటూ
నన్ను నన్నుగా చూపించడానికి
అడ్డొచ్చే ప్రతి ఆంక్షని
నిజాయితీ తో నరుకుతూ పోతా
చివరికి అసలైన
"నేను" ను ఆవిష్కరించుకునే దాకా
నగ్నమైన నా ఆత్మను
నా ప్రేమను ..కనుక్కునేదాకా
ఇలా ఈ ఊచకోత
సాగిస్తూనే ఉంటా....!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి