పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, జులై 2012, బుధవారం

జగతి జగద్ధాత్రి || మరణ ధృవం ||

ఆశగా ప్రతి ఏటిలా...
చూసుకుంటూనే ఉన్నా
ఆకులు రాల్చిన మందార చెట్టువైపు
చివురులు వేస్తుందని
ఏదో ఒకరోజు పొద్దున్నకల్లా
చిలుక పచ్చ కోక చుట్టుకుని
పలకరిస్తుందని ....
కానీ ఈ సారి మరేమో
ప్రతి రోజూ నిరాశే ఎదురైంది నాకు
పచ్చని తనమే లేకుండా
ఎండు కట్టెలా ఎండి పోయింది
ఎన్నెన్నో జీవిత సత్యాలను చెప్పిన
మా మందార చెట్టు ...
ఈ రోజు మృత్యువు సత్యమే నని
రుజువు చేస్తూ
ప్రాణ రసాన్ని వదిలి
వెళ్ళిపోయింది .....
మనుషులకి మరు జన్మ లుంటాయని
ఎన్నెన్ని శాస్త్రాలు చెప్పినా
రుజువులున్నాయో లేదో
మన మేధకు అందక పోయినా
చెట్టు మాత్రం కట్టెగా నే మిగులుతుందన్నది
సత్యం చేస్తూ వీడి పోయింది ....
మా తో పాటే రెండేళ్ళూ
ఈ ఇంటిలో సావాసం చేసిన
మా చెట్టు ......రాత్రుళ్ళు
వంటరిగా బయటికి వెళ్ళాల్సి వస్తే
తోడుగా మనిషి ఉన్నట్టుండే
మా మందార చెట్టు ....
మా కవితల్లో పదిలంగా
మా చాయాచిత్రాలలో అందంగా
మాకు జీవన సత్యాలను
నుడివిన మా జ్ఞాన మందారం చెట్టు
ఇప్పుడు లేదు చచ్చి పోయింది
అని మా సత్యం గాడు అంటే ....
గుండె తరుక్కు పోయింది ..
తీసి పారేస్తాను అన్నాడు ....
వద్దురా ...ఉంచు ఎక్కడైనా
ఏ మాత్రం జీవకణాలు ఎమన్నా
ఉన్నాయేమో ఉంచు మరి కొన్నాళ్ళు
మొదలు పీకేయ్యకు ...
అన్నా నెమ్మదిగా ....
ఇంకా నమ్మకంగా ....
ఇంకా ఇంకిపోని ఆశతో ....
ఏమో ...చిగురిస్తుందేమో చూడాలి
వానలు కురిసాక .......
అని బిడ్డకోసం అమ్మలాంటి ఆశతో...
ఎదురు చూస్తున్నా .......
(ఆశ ఫలించలేదు చెట్టు పీకేసాడు సత్యం...ఈ రోజే అందుకే మళ్ళీ ఒకసారి మందార చెట్టుని తలచుకుంటూ...25th july wednesday )
 *25.7.2012.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి