పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, జులై 2012, బుధవారం

నవుడూరి మూర్తి కవిత

వయసు కండె విచ్చుకుని బాల్యపు గాలిపటం
నీలాంబరిని నర్తిస్తుంటే,
కాలం తకిలీ వడికిన వర్షధారలకు
తుఫానుగా పరిణమించిన వార్థక్యం
అలలతలమీంచి ఆకసానికెగసిన
"అల"నాటి అనుభూతికై ప్రాకులాడుతోంది..

ఏడుపెంకులాట బ్రతుకులో
మధురస్మృతులు ఒకదానిపై ఒకటి పేర్చేలోగా
"చేదు అనుభవపు" బంతి
వీపుమీద ఒకటి చరుస్తుంది.

ఇసుకతిన్నెలు చూసినప్పుడల్లా
గూడుకట్టుకోవాలని పడిన ఆరాటంలా,
చుట్టుపక్కల లేస్తున్న ఇళ్ళను చూసి
"నేనూ ఇల్లుకట్టుకోవా"లనిపించినా,

బ్రతుకు పుస్తకంలో భద్రంగా దాచుకున్న
నెమలి ఈకలూ - కాకిముచ్చిల్లా
"మచ్చకొండ"ను చూసినప్పుడల్లా
రఘూ, రత్నం, రథయాత్రలూ గుర్తొచ్చినా

సినిమాహాలు దగ్గర లాగు ఎగలాగుకుంటూ
టిక్కెట్టుకి చాలని పావలాకోసం
"తాడాట"లో తిన్న "చెంకీ"కి పొడిగింపులా
బొంబాయిలో పెన్నులమ్మేవాడిచేతిలో మస్కాతిన్నా,

ఎంత జాగ్రత్తగా ఆడినా "దొంగ" కాకుండా
తప్పించుకోలేని చాతకానితనంలా
ఎన్ని పరీక్షలు రాసినా, పరంపరగా వచ్చే
"Regret Letters" ఆపలేకపోయినా,

ఏడో ఎక్కం ఎప్పుడూ తప్పే చెప్పినందుకు
SS మేష్టారు తలపై బెత్తంతో చేసిన బొడిపిల్లా
చేసిన తప్పే చేస్తున్నానని
బాసు మెమోల మొట్టికాయలు వేసినా,

ఉదయాస్తమయాలమధ్య
జీవనపర్యంతం పరుగెత్తే సూరీడులా
ఏ ఊరికీ వెళ్ళకుండా ఊళ్ళోనే ఉండిపోయిన
వేసవి శలవుల్లా జీవితం గడిచినా,

బోర్లా పడిన ప్రతిసారీ ఏడుపులంకించుకున్నప్పటికీ
మళ్ళీలేచి అందుకోవాలని పడిన చిన్నప్పటి తపనే
అరిగిపోయిన మనకాళ్లకి విసుగెత్తిన ప్రతిసారీ
కొత్త ఆశల "Re-soling" చేస్తుంది.

నాన్నజేబులోంచి దొంగతనంగా తీసిన సిగరెట్టుతో
పెరట్లో జామచెట్టు గుబుర్లో సృష్టించిన మేఘాలూ,
అల్లావుద్దీన్ కథ చదివి
ప్రతి పాత లాంతర్నీ గోకిన తెలివితక్కువదనమూ,
తాతగారి ఊర్లో చలిరాత్రులపుడు
వేరుశనగకుప్ప మంటవేసుకుంటూ
సీనుగాడితో పంతాలేసుకుని
శనక్కాయలు ఫలహారం చేసిన తర్వాత
బెల్లంకోసం కుండలో చెయ్యిపెట్టినపుడు
తేలుకుడితే వేసిన కుప్పిగంతులూ,

ఎండాకాలం వర్షంలో తడుస్తూ వదుల్తున్న కాగితం పడవల్లా
గ్రీన్ కార్డ్ సీతారామయ్యతో రెండుమూడేళ్ళకొకసారి
గడిపే మధుర క్షణాలూ
కాలం ఊదుతున్న ఈ బెలూన్ లో
ఆడుగడునా దర్శనం ఇస్తుంటాయి.

కానీ, బెలూనుకి సహజ సిధ్ధమైన
అమాయకత్వం, అసూయ ఉక్రోషం,
ఉడుకుమోత్తనం, అభిమానం, అపేక్షల
వస్తుతత్త్వం ఎన్నటికి మారేను?
*17-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి