పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, మార్చి 2014, గురువారం

Afsar Afsar కవిత

అతని సంతకం కింద ఇంకో కొత్త నిప్పు వాగు! ~ కవులు రాజకీయాలు మాట్లాడవచ్చా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమైన ప్రశ్న! నా మటుకు నాకు ఇది మనిషి గాలి పీల్చవచ్చా లేదా అన్న ప్రశ్న లాంటిదే! అయితే, వొక వచన రచయిత రాజకీయాలు మాట్లాడడానికి, వొక కవి రాజకీయాలు మాట్లాడడానికి తేడా వుందని మాత్రం నేనొప్పుకుంటాను. రాజకీయ భావాల వ్యక్తీకరణలో వచనరచయితకి వున్న అభివ్యక్తి స్వేచ్చ కవికి లేదు – ఎందుకంటే, అంతిమంగా కవిత్వం అనుభూతి కళ కనుక! కవిత చదివాక అది ఎదో వొక అనుభూతిని మిగల్చకపోతే, రాసిన వాక్యాలన్నీ వృధా అయిపోయినట్టే! ఇలా వృధా కాని వాక్యాలతో రాజకీయ కవిత్వం రాసిన వాళ్ళు చాలా తక్కువ, తెలుగు కవిత్వం అనే కాదు, ప్రపంచకవిత్వంలో కూడా! రాజకీయ తీవ్రతా, అనుభూతి సాంద్రతా వొకే వొరలో యిమడవన్న అభిప్రాయమూ వుంది. అది కేవలం అభిప్రాయమే అని నిరూపించే కవులు మనకి అప్పుడప్పుడూ తారసపడతారు. అలాంటి కవి చేరన్ రుద్రమూర్తి. చేరన్ ఇప్పటికే కవిసంగమస్థలిలో బాగా తెలిసిన పేరు. చేరన్ గొంతుక మనకి తెలుసు. ఈ మధ్య నెల రోజులుగా చదువుతున్న పుస్తకం - You Cannot Turn Away- చేరన్ కవిత్వపు కొత్త ఇంగ్లీష్ అనువాదాలు. ఈ పుస్తకం చివరి భాగంలో చేరన్ కొత్త కవిత్వం కూడా వుంది. చేరన్ కొత్త కవిత్వం వొక అనూహ్యమైన క్లుప్తత వేపు మళ్ళుతోంది. చాలా మామూలుగా అనిపించే మాటల్లో లోతైన దుఃఖాన్ని తవ్వుతోంది. పదచిత్రాలూ ప్రతీకల వంటి కవిత్వ భాషని వదిలేసి, మాయవస్త్రాల్ని చింపి పోగులు పెట్టి, తప్పక రాసి తీరాల్సిందేదో రాయడం కోసం చేరన్. ఈ నాలుగు మాటలూ వినండి, అవి చేరన్ చిర్నామా అనుకుంటాను. లేదంటే, చేరన్ లాంటి వొక కవి మాత్రమే రాసుకోగలిగిన epitaph కూడా కావచ్చు. నా చితి కాలిపోతే కాలిపోనీ అందులోంచి చిన్ని వెలుగు రవ్వని నేను. ఆ వెలుగురవ్వలోంచి వొక పాట పుట్టుకొస్తోంది... వొక చేరన్ కవిత: ~ గొంతుక -- దోస్త్, ఇంకా ఏముంది నన్నడగడానికి? పోయిన వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు రాలిపోయిన వాళ్ళు పోయే వాళ్ళు బతికిన వాళ్ళు ధ్వంసమైన వాళ్ళు ఎదిగిన వాళ్ళు కుప్పకూలిన వాళ్ళు గుర్తున్న వాళ్ళు గుర్తు లేని వాళ్ళు జారిపోయిన వాళ్ళు పుట్టిన వాళ్ళు ప్రవహించుకుంటూ వెళ్ళిన వాళ్ళు పరిభ్రమిస్తున్న వాళ్ళు. వాళ్ళలో ఎంత మంది నాకు తెలుసో నీకేం తెలుసు?! సముద్రాల ఆవల బతుకుతున్న వాణ్ని నేను నా తెర మీద నెత్తుటి నదులు. నా చుట్టూరా కరిగిపోతున్న నది మీద వొక మంచుతెప్ప కదిలిపోతోంది. దాని మీద తడిసిన రెక్కల గాయపడిన పక్షి. ఏ దారీ తోచని వాళ్ళలో చిక్కుబడింది ఆ నదా? ఆ పక్షా? నన్నెందుకులే అడుగుతావ్?!

by Afsar Afsar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P2ZboJ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి