పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, నవంబర్ 2013, బుధవారం

తొవ్వ




పండు వెన్నెల -పసందయిన జ్ఞాపకాలు

తెల్లని ఎన్నీల ఎలుగుల చల్లదనం
వాకిట్ల గడించేల ఎల్లెలుకల పండి
తాత చెప్పిన శాత్రాలు ఇన్నందుకేమో
కొంతయినా కవిత్వాల అల్లకం అబ్బింది

పండు వెన్నెల రోజు ఆరు బయట నడుస్తుంటే వచ్చే ఉల్లాసం ఎట్లుంటదో టైపు చేయరాదు రాయరాదు .పున్నం రాత్రి అన్నం తిని కట్టె పట్టుకొని పొలం కాడికి కావలి పోతే ,ఆ చెల్కలు చేన్లన్నీ తెల్లగ అగుపిస్తాయి .కొట్టంల కట్టేసిన ఎడ్లు అయితే మరింత తెల్లగ మెరిసిపోతాయి .
ఎన్నిల రాత్రి ఎవలకు వాళ్ళే మెరిసి పోతారు .చేను చెలక గొడ్డు గోదా మ్యాక వాటి మొకం సూస్తే అవ్వి సుత ఎన్నిల ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తయి .అమాస పున్నంకు ఎంత తేడా ఒకటి కటిక చీకటి ఒకటి ఎలుగుల పందిరి .
మేము చిన్నప్పుడు వాకిట్ల నులుక మంచం ఏసుకొని ముచ్చట్లు పెట్టుకుంట పండుకునేది .నడుమ మా తాత మాకు కచెప్పేది.ఇనుకుంట ఇనుకుంట మేము నిద్రల జారేది .ఆ కథలల్ల తప్పక చందమామ వచ్చేది .మా తాత కథలను శాత్రాలు అంటదు .
కాముని పున్నం నాడు అయితే పోరగాండ్లకు మస్తు సంబురం .కోలలు పట్టుకొని ఊరంతా జాజిరి ఆడపోయేది
జాజిరి జాజిరి జాజిరి జాజ
జాజిరి ఆడపోతే ఏమేం దొరికె
రింగుడు బిళ్ళ రూపుడు దండ
దండ కాదురో దామెర మొగ్గ
మొగ్గ కాదురో మోదుగు నీడ
నీడ కాదురో నిమ్మల బాయి
బాయి కాదురో బసంత తీగ

ఇట్లాంటి పాటలు పాడుకుంట ఇంటింటికి ఎన్నిల రాత్రిళ్ళు పాడుకుంట తిరిగిందీ కవిత్వమే ...కవిత్వం కావాలి కవిత్వం అని మన కవి సంగమం పిలిపిస్తే అక్కన్నుంచే వస్తుందిఏ కవనపు జాలు .కవిత్వానికి ఎన్నేలకు ఎంత సంబంధమో ఈ చందమామ లు కవిసమయాలే ...చల్లని పల్లె ఎన్నెల తాగిన వాళ్ళు ,చిక్కని బర్రె పాలు జుయ్యిన పిండిన వూరోల్ల కవిత్వం ఇప్పుడు పరిశోధన జరగాలె .
అందుకే వెన్నెల ను ప్రేమించిన మా కరీంనగర్ కవులం ప్రతి పున్నం రాత్రి 'ఎన్నీల ముచ్చట్లు 'పేర కలుసుకొని కవిత్వం చెప్పుకుంటన్నం .ఒక్కో పున్నంకు ఒక కవి ఇంటి డాబా మీద కలయిక .ఇప్పటికి మూడు సార్ల అయ్యింది .'సాహితీ సోపతి 'వాటిని పుస్తకాలు తెచ్చింది .రేపు 17.11.2013న కార్తీక పున్నం రోజు మిత్రుడు బూర్ల వెంకటేశ్వర్లు ఇంటి మీద ..కవుల కలయిక ...

నిండు పున్నమి నాడు పండు వెన్నెల
భూమికి సున్నం ఎసినట్లు
ఎన్నీల ఎలుగు పల్లెటురంత స్వచ్చం
ఎన్నీల ఎలుగె మనుసుకు నిమ్మళం ......


                                                                                                                          
 
 
 
 
                                                                                                                 ________అన్నవరం దేవేందర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి