పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, అక్టోబర్ 2012, బుధవారం

కర్లపాలెం హనుమంత రావు॥ప్రపంచీకరణ పంచ నుంచీ…॥

1
వర్తమానం జ్ఞానంగా ఘనీభవించక ముందే
కాలం చరిత్రలోకి జారుకుంటుంది

నాటకమని తెలిసీ
పాత్రల్లో లీనమైపోయే రసబలహీనత మనసుది
చప్పట్ల సంబరంలో మూతివిరుపుల సందేశం
పట్టించుకోటం వెంగళాయితనం!
విజయవంతమైన ప్రతి ప్రదర్శన వెనకా
హృదయశల్యమైన కథలనేకం కద్దు
జీవితం నాటకమని తెలిసీ
నటన్నే జీవితంలా ప్రేమిస్తే
ఆఖరి సీనులో అమాయకత్వానికి
పట్టే గతేమిటో
చరిత్ర చర్విత చరణంగా చెపుతూనే ఉంది

2
రావణసంహరణ కైకమ్మకోర్కెల మధ్య కార్యకారణ సంబధమేంటి?
కృష్ణ రాయబారసారం సత్యప్రమాణకంగా ధర్మసంస్థాపనార్ధమేనా!
శకుని పాచికలఎత్తులసలు లోతులెంతెంత?
కళింగయుద్ధంనాటి ఎన్ని యోధకుటుంబాల కన్నీళ్ళు
బాటలకిరువైపులా నాటిన అశొకుడి చెట్లనీడలయినట్లు?
విజాయానికి జేజేలు పలికే లోకానికి
జీవితంమ్యాచి వెనక జరిగే ఫిక్సింగు తతంగం
తోలు వలిచి తినిపించినా గొంతుదిగని అరటిపండు !
చెప్పటం వరకే చరిత్ర పాత్ర
చెవి మెలిపెట్టేంత ప్రేమ ఎందుకుంటుంది!

3
శృంఖలాలే కంకణాలాయ
గాటక్కట్టిన మోకు వ్యాసార్థపరిధికే
సర్వపురుషార్థసారమూ సమర్పితమాయ
ముక్కవాసనకే కుక్కముక్కు తోకూగిపోతుందాయ
వేగుచుక్కలు పైనెంత ప్రజ్వలిస్తేనేమి
మనిషి మోరెత్తి చూడలేని మకురు వరాహమైనాక!
నిప్పును కనిపెట్టిన అనాది నిశితత్వం
అంగారకందాకా మానవపాదాన్నెగరేస్తుండచ్చు
మరో వంక నీరోల ఫిడేలు రాగాలకి
మనిషిక్కడ చంకలెగరేస్తున్నాడే!
రోములా తగలబడతావురా మొర్రో అనెంత మొత్తుకున్నా
హత్తుకొనే మెదళ్లేవీ!

4
క్లోజుకొచ్చిందాకా సీజరుకి
బ్రూటస్ బాకు కంటపడనేలేదు
ఏకలవ్యుడి మూఢగురుదక్షిణ విలువ కుడిబొటనవేలు
దుష్టసాన్నిధ్యం దానకర్ణుడికి తెచ్చిపెట్టింది హీనకీర్తినే
తవ్వినకొద్దీ గతమంతా
ఎవరో ఎవరెవరివెనకో తవ్విపోసిన గోతులూ గుంతలే!
కళ్ళగంతలతోనే కుప్పిగంతులేస్తున్న మనిషీ
మెరిసేదంతా బంగారమేనని మురస్తే
మరి మెరుపుల షాకు?

5
ఏమి పండాలో
ఎలా వండాలో
ఎంత మింగాలో
ఎవరు మిగిలుండాలో
ఎజెండా ఎవడిదో
ఆ జెండాను మోసే భుజం మాత్రం నీదా!

6
సంస్కరణలంటే
సంస్కృతిని పరాయీకరణల పాలుచేయడమా!
అభివృద్దికర్థం
రూపాయి డాలరుబాబుగోరికి చేసే ఊడిగమా!
ఆర్థికస్వావలంబనం
ఆహాహా...ఎంతదమైన సంస్కృతమోసమో
మెడమీద ఎవడిదో కాడి
మన కాళ్ళమీద మనమే గాడిదై పరుగెత్తాలి!
సరళీకరణసారం
వాడి గరళాన్ని వేళకింత కొని
రసగుళికల్లా గుట్టుగా మింగేయటనమనే బేరమేగా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి