పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, అక్టోబర్ 2012, బుధవారం

కర్లపాలెం హనుమంత రావు॥వెలుగు బొట్లు॥



1
నీలాకాశాన్నలా దులుపుతావెందుకు?

నాలుగు వెలుగు బొట్లు నేల రాల్తాయేమో తాగి పోవాలని.
ఆడి ఆడి అలసిపోయాను
గాయాలకు మందు కావాలి

2
నది దాటాలంటే వంతెనే ఉండాలా
మడుగు అడుగున కాల్దారీ ఉంటుంది
వేగుచుక్కలు పైన వెలుగుతూనే ఉంటాయి
బాటసారికి మోరెత్తి చూడాలనే మనసు కలగాలి
క్షణం పాటు పీల్చి వదిలే ప్రాణవాయువును
ఎన్ని పైరుపచ్చల నుంచీ మూటకట్టుకుని
పడుతూ లేస్తూ వస్తుందో పిచ్చి గాలి!
కంటికి నిద్ర ఊహ రాకముందే
రెప్పలు కలల పొత్తిళ్ళు సిద్దంచేస్తాయి
గోపురాలు కందకాలు రహదారులు రహస్యస్థావరాలు
ఇలాతలాన్ని నువ్వివాళిలా యుద్ధరంగ చేసావు గానీ
ఓంప్రథమంగా పునాది రాయి పడింది ఆటలమైదానానికే
ఏడుస్తూ వచ్చిన వాడివి…
ఎలాగూ ఏడుస్తూనే పోతావని తెలుసు
ఇక్కడున్నఈ నాలుగు రోజులూ
నిన్ను నవ్వుల పూలతోటల వెంట తిప్పాలని కదూ
ఈ ఆటలూ పాటలు ప్రేమ మాటలు
కలల మీదా పెత్తనం కావాలి
అందుకే నీకీ అలసట

3
రేపటి సంగతి మరచి
నేటి గెలుపుకి పరుగు…అలుపు!

4
ఆటంటూ ముగిసాక
గెలుపోటములు ఆటల్లో అరటిపండు
చీకటి ముసిరితే ఎవరైనా ఇంటిదారే పట్టాలి
ఎక్కణ్నుంచొచ్చామో ఎక్కడెక్కడికి పోవాలో
ఇక్కడున్నన్ని రోజులూ ఎంచక్కా ఆడుకో
చక్కని మైదానం
ఆటవస్తువులు
తోటిదోస్తులు
అలుపు మరుపుకే కదా ఈ ఆటా పాట
గెలుపు కోసం అలుపు వృథా అవునా కాదా!

5
నీలాకాశాన్నలా దులపడమెందుకు
ధారగా రాలుతునే ఉన్నాయిగా వెలుగు బొట్లు
హాయిగా తాగేయ్ రేపటికి మాగబెట్టక!
మనిషి బుద్ధి చూపెట్టక!










23-10-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి