పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, అక్టోబర్ 2012, సోమవారం

కెక్యూబ్ వర్మ ॥ నిర్జన వంతెన ॥

ఈ నిర్జన వంతెన అంచున
ఒక్కో దారప్పోగునూ పేనుతూ
అక్షరాల అల్లికలల్లుతూ

పదాల మధ్య బందపు కండెను జార్చుతూ
ఒలికి పోకుండా పట్టుకొనే ఒడుపు కోసం నిలబడి వున్నా....

ఏదీ అంటనితనమేదో యిలా ఒంటరిగా
మిగిల్చి పాదాలను రాతి తాళ్ళతో బంధించి
దేహాన్ని ఇలా వదిలేసి పోయింది....

మనసు మూగతనాన్ని నింపుకొని
గ్లాసు నిండుగా ఒంపినా గొంతుదిగని మత్తు....

యుద్ధానంతర నిశ్శబ్ధపు నీరవం
చుట్టూరా పొగల సుళ్ళుగా అల్లుకొని
అస్తమయ వెలుగులో కాసింత రంగునిచ్చి
కనులలోయలో ఒరిగిపోతు....

దూరంగా జరుగుతున్న మేఘాల రాపిడికి
అక్కడక్కడా మెరుస్తూ ఓ వాన చినుకు
కన్రెప్పపై జారిపడి వెచ్చగా గొంతులో దిగుతూ
గుండె మూలల ఖాళీని కాసింత కప్పే కఫనవుతూ....

దేనికదే ఒక అసంపూర్ణత్వం కలగలిసి
నలుపు తెలుపుల చిత్రంగా గోడనతుక్కొని
కలవని గీతల వలయంలా మారుతూ
వెక్కిరిస్తూ ఎదురుగా అలా నిలబడుతూ....

ఎక్కడో ఓ సన్నని నాదం విరిగిన వెదురు పొద మీంచి
గాలిని కోస్తూ శబ్ధావరణాన్ని సృష్టిస్తూన్న
వాతావరణంలో గాయాన్ని సలపరమెట్టిస్తూ.....
(18-10-2012)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి