పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

అనిల్ డానీ కవిత


గూడెమంతా సందడి
పండగేం గాదు
పతంగులు ఎగరలేదు
సాయిబులు పీర్లు ఎత్తలేదు
గాని అంతా వూదుకడ్డీల వాసన

కిర్రుచెప్పుల సవ్వడి
గుళ్ళో చదివే వేదాలు
భజన కీర్తనలు,తాళాల చప్పుడు
గాలి మోసుకొచ్చింది చెవుల్దాకా

పూల పల్లకీలో దేముడు
మా అంటరాని పేటలో
ఎప్పుడో జమానా నుంచి
ముంతా తాటాకు కట్టి
విసిరేసిన గూడేనికి
హవ్వ ! ఏంటి విచిత్రం

అరవై ఏళ్లనుంచి నంజుకు తినబడుతున్న
నాల్గో జాతి వీధిలోకి నరసింహ సాములోరు
ఉరేగి పోయినాడు
కళ్ళారా చూద్దామంటే ఆపిన నాథుడే లేదు
పాపం పూలని మాత్రం చంపారు దేవుడి పేరు జెప్పి

ఊరికి కరువొచ్చినట్టు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు
పౌర్ణమి రోజున వెన్నెల కాసినట్టు
ఒక్కసారే వస్తాడంట దేముడు మా గూడేనికి

నల్ల దొరల రాజ్యం ఆర్తిగా పిల్చినా
ఆలకించడేమి దేవుడు
చిక్కుకున్నడా దేవుడుకూడా మీ
కబందహస్తాల్లో మా జీవితంలానే

దేవుడు ని మా గూడేనికి తేవడం కాదు
మమ్మల్ని తీసుకుపోండి
మీ గుడిలోకి బడిలోకి మీ ఇళ్ళకి
మీ మనసుల్లోకి
కడుక్కోండి మీ మసులని
మానవత్వపు జలం తో

కుదిరిందా సరే సరి
లేకుంటే ఈ సారి మీరు తెస్తే వచ్చేది
ఒట్టి విగ్రహమే దేవుడు కాదు
పైవాడికి తెలీదా మీ కులం
రంగేసుకున్న నాటకాలు (12sep2012)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి