పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, ఆగస్టు 2012, శనివారం

‎Mercy Margaret ll జనాభా లెక్కలో ఒక దాన్నిll

నేను పుట్టినప్పుడు
తలితండ్రుల మొహాల్లొ
సంతోషం గురించి
వాళ్ళు చెప్పేప్పుడు వింటుంటే
నా కళ్ళలో ఏవో దీపాలు వెలిగిపొతాయి

సంవత్సరం సంవత్సరం
మారి పోతున్న
నా గురించి నేను ఆలోచిస్తుంటే
ఇసుక లొతుళ్ళోకి కాలు దిగబడి
మళ్ళీ పైకి తీసినట్టు
ప్రాణం ఎవో ఒత్తిళ్ళకి లోనై
వెంటనే
కొద్ది సేపు శ్వాస తీసుకున్నట్టు
అనిపిస్తుంది

జీవితాన్ని సముద్రం చేసుకొని
తీరంలో పసిపాపలా
ఒళ్ళో ఇసుక నింపుకుని పిచ్చుక గూళ్ళు కడుతూ
ఒక్కో గూడుతో ఒక్కో సంబంధం పెంచుకొని
ఏ విధి కాళ్ళకిందో
ఎపుడో అపుడు అవి కూలిపోతుంటే
పసిపాపాలా నా ఏడుపు సముద్రపు ఘోషలో
కలిపి

నిశబ్దపు స్నేహం నించి చీకటిని చీల్చి
వెలుతురు ధారలతో లోలోతుల మనసు నేలని తాకి
నాకు నేను ఒక సాహసం
నాకు నేను ఒక పోరాటం
నాకు నేను నిరంతర పునరావృత ఉషోదయమై
కనిపిస్తుంటా

వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు అమ్మ కొంగు ఓదార్పు
నాన్న భుజాలపై ఎక్కి
అటక పై పడ్డ బంతి దొరికే వరకు
వదలక సాదించుకున్న మంకు ఏడుపు
అబద్దం ఆడినప్పుడల్లా భయపడి
చర్చి కిటికిలోంచి
గుస గుసగా సారీ దేవా అని చెప్పిన సమయాలు
కేకు కోసేవరకు అన్నం తినక
పుట్టిన రోజు పండుగకై
నెల ముందు నుంచే ఎదురు చూపులు
అమ్మ అని రాయడం మొదలు
చదువయిపోయేంత వరకు
నమ్మడం నేర్పిన స్నేహాలు
నమ్మి మోసపోవడం నేర్పిన నేస్తాలు

ఒక్కొక్కటిగా ఏవేవో విత్తనాలు
ఎక్కడెక్కడి నదులో
పచ్చదనం చూసొచ్చే పక్షుల్ని
నేను అనే అరణ్యం లోకి
అనుమతిస్తూ
గాయపడి పాఠం నేర్చుకుంటూ
భంగపడి ప్రతిఘటించి ధైర్యాన్ని
చెంతనే ఆయుధంగా పెట్టుకుంటూ

ఇప్పటి వరకు ఇలా వ్యాపించా
నా స్థలం ఎంత మేరని
నిర్దేశించాడో దైవం
అంత వరకు నేనే నాకు
నా భావాలతో నా ఊహలతో
రమిస్తూ
పచ్చదనం తగ్గనివ్వక
నన్ను నేను
నాకోసం నా లో నాకైన వాళ్ళ కోసం
అడుగులలో అడుగు వెసుకుంటూ
పుప్పొడి వాసన రాసుకొని
సీతకోక చిలుకల గుంపులతో
పరవళ్ళు తొక్కే నదుల పలకరింపుల ముచ్చట్లతో
సాగిపొతున్నా
నాకు నేనే




*23-08-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి