పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఆగస్టు 2012, బుధవారం

కెక్యూబ్ వర్మ॥గోడ॥

ఈ నాచు పట్టిన గోడ పక్కగా
తడిచిన పూలను కోసి గుత్తుగా
నీ చేతిలో వుంచి
కళ్ళలో వెలుగు చూసిన గురుతు...

ఆ తడి ఇంకా ఆరనే లేదు
ఈ గోడపై ఎండిన నాచు పెళ్ళలు పెళ్ళలుగా
రాలి ఏవో అస్పష్ట ఆకారాలు
నలుపు తెలుపుల రంగు మాధ్యమంలో...

ఆ వెలుగు జిలుగు
ఈ కంటి రెప్పలు దాటి బయట మెరియనే లేదు
సంధ్య కాంతిని పులుముకుంటూ
కొండ వాలులోకి జారిపోతూ....

ఆ చేతి మృధుత్వం
అలా నరనరాన ప్రవహిస్తూ వానలో కరిగిపోనూ లేదు
గోధూళిని దోసిలిలో నింపుతూ
మస్తిష్కంలో రంగుటద్దంపై అలికినట్టూ...

ఆ అడుగుల సవ్వడి
అలా అలల వెల్లువలా ఒడ్డుకు చేరనూ లేదు
రాళ్ళ గవ్వల ఒరిపిడిని రాగంజేస్తూ
మనసులో అసంపూర్ణ గేయమైనట్టూ...

ఆ గాయపు గురుతులేవో
కలల దేహంపై ఎర్రగా చారలుదేరుతూ
స్వేదమింకిన నేల బీటలు వారుతూ
కణకణ మండే ఉచ్వాశ నిశ్వాశలైనట్టూ....

చివరిగా ఆ గోడపై ఓ చిగురు తొడిగిన
మొక్క పచ్చగా పైకెగబాకుతూ
వేకువ వెలుగు రేఖల వెచ్చదనమౌతూ
గుండె అలికిడికి గురుతుగా పూస్తున్నట్టూ...
 
*1.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి