పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఆగస్టు 2012, బుధవారం

జగద్ధాత్రి॥మాట్లాడి ఉంటే...॥

.
మాట్లాడుకోవాలి నిజమే దోస్త్ !
అనుభవపూర్వకంగా ఒప్పుకుంటున్నా 

నువ్వు చెప్పిన జీవిత సత్యాన్ని
సంభ్రమ,సందిగ్ధ లేబ్రాయంలో...పెదవులతో గాక మనసు విప్పి
మాట్లాడి ఉంటే.
జీవితం చేజారిన స్వప్నంయ్యేది కాదు
విశ్వవిద్యాలయ ఒడిలో చెట్లనీడన చేరి
హరిత పత్రాల్లా మనమంతా కళకళలాడినపుడు
తలనిండ పూదండ దాల్చి
మొలక నవ్వులతో మురిపించిన  మురళిగాడి రాణి పాటతో
మీ ప్రసాద ద్వయ హాస్యాన్ని చెట్టు కింద అవ్వ కొట్లో
టూబైత్రీ కాఫీలతో కలిపి ఆస్వాదించినపుడు
కలత కలలను నేను గానీ
కవిత కళలను నీవు గానీ ఎప్పుడూ ఆవిష్కరించనే లేదు
చలాన్ని చర్చించి, కిన్నెరసాని సౌందర్యాన్ని
చివరకు మిగిలిన నా కృష్ణ పక్షాలలో
మీ చెలిమి వెన్నెలతో నింపు కున్నప్పుడు
ఆర్ద్రతతో మాటరాలేదు
హిమంలో జ్వలించి, గీతాంజలిలో సేద తీరి
ఫైజ్ ఉద్విగ్నత, గాలిబ్ సాంద్రత,ఎమిలీ నిరాశా నిస్పృహల మధ్య
యులిసిస్ లా డోలాయ మానమౌతూ
ఇలియట్ వేదనా మయతలోకి జారిపోయనే గాని
మీలో ఎవ్వరితోనూ
ఒట్టు, నిజంగానే మాట్లాడలేకపోయాను

చిరు నవ్వుల ఆనంద భైరవితో మిమ్మల్ని అలరించి
అంతరంగాన్ని మాత్రం అపరిచితంగానే ఉంచాను
పెదవి విప్పి పలికే లోపు నాన్న ఇచ్చిన మాట కత్తితో
చదువులమ్మకు నాకు బొడ్డు తాడు కోయ బడ్డాక
దశాబ్దం పాటు నిశ్శబ్ద నయ్యాను కానీ
పెదవి మెదపలేదు

ఆటు పొట్ల కాలంతో కసరత్తు చేస్తూ
ఆపుకోలేని కన్నీటి మాటలను అప్పుడప్పుడూ మాటాడబోతే
మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడానని
మాట పడ్డాక తెలుసుకుని
మళ్ళీ మౌనాన్నే ఆశ్రయించాను
దశాబ్దాల నిరీక్షణకు ఆశీర్వాద ఫలంగా
తొలి స్వప్నాల మరు చంద్రోదయమైనప్పుడు
ధైర్యం చేసి మాటల పూవులను దోసిళ్ళతో నింపి పదాభిషేకం చేస్తూ
అక్షరాల వెల్లువనై నా హ్రుదయాన్తర్యామికి
పాదాక్రాంత మైపోయాను

నిజం నేస్తం! నువ్వు చెప్పింది
మాటల మంచి మాత్రమే
మనుషులను కలపగలదని దూరాల నుండి సాగి
నా చేతిలో ఒదిగి మాట్లాడిన
నీ ప్రాణ పదాలేగా నన్నిలా మాట్లాడిస్తున్నాయి
మనసుకు మాట అద్దం పట్టాలి

మాటలకు మనసునద్ది గుండె సవ్వడి ఆగిపోయేదాక
నిమ్మళంగా,నిర్మలంగా, మాట జారకుండా
మనమందరం మాట్లాడుకోవాలి
మనలా జీవితంలో తిరిగి
మాట కలుపుకునే యోగం అందరికీ దక్కదుగా మరి !

(చాల కాలం తర్వాత నన్ను మాట్లాడించిన నా స్నేహితుడు
డాక్టర్ ప్రసదముర్తి కవిత "మాట్లాడుకోవాలి" చదివి హృది కదిలి
మాటల్లో ఒలికి పోయాను. ఆ తర్వాత మా మిత్ర కూటమిలో "మురళీ నాదం" మా మిత్రుడు మురళి వెళ్ళిపోయాడు హటాత్తుగా , డాక్టర్ పిబిడి విప్రసాద్ ప్రకాశం జిల్లాలో నవోదయలో పనిచేస్తున్నాడు )
 
*1.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి